ఇప్పుడంతా.. ఇలా!
03-01-2018 23:24:48
కొత్త సంవత్సరం వచ్చేసింది. ముందున్న పన్నెండు నెలల్లో సరికొత్త యాత్రానుభవాల కోసం మనలో చాలామంది ఎదురుచూస్తూ ఉంటాం. ప్రయాణాల్ని ఎలా ప్లాన్‌ చేసుకోవాలన్న ఆలోచనలు చేసేస్తూ ఉంటాం. ఇలా ప్లాన్‌ చేసుకొనే వాళ్ళ ధోరణులు ఈ ఏడాది ఎలా ఉండబోతున్నాయి?టూరిస్టుల అభిరుచులూ, ఆలోచనల్లో కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి. ఆ క్రమంలోనే యాత్రలకు ప్లాన్‌ చేసుకొనే తీరు కూడా మారుతోంది. కొత్త సంవత్సరంలో ట్రావెల్‌ ట్రెండ్స్‌ గురించి పర్యాటక, యాత్రా రంగ నిపుణులు చేసిన అధ్యయన వివరాలివి. మనకు కూడా ఇవి కొత్త దారులు చూపిస్తాయనడంలో సందేహం లేదు.
 
‘మనం’ టైప్‌!
 
కలసి ఉంటే కలదు సుఖం, అలాగే కలసి ప్రయాణిస్తే మనసులు దగ్గరవుతాయి. నిజానికి రెండు మూడు తరాలవారు కలిసి యాత్రలు చెయ్యడం గతంలో సర్వసాధారణం. కాలక్రమేణా ఉద్యోగాలూ, చదువుల పేరుతో ఉన్న ఊళ్ళకు దూరం కావడం, దరిమిలా మైక్రో స్థాయి కుటుంబాలు పెరిగిపోవడంతో రెండు మూడు దశాబ్దాలుగా ఉమ్మడి యాత్రలు చాలా వరకూ తగ్గిపోయాయి. మళ్ళీ ఆ రోజులు వచ్చేట్టు కనిపిస్తున్నాయి. మల్టీ జనరేషనల్‌ ట్రిప్స్‌కు చాలామంది ఇప్పుడు ఓటేస్తున్నారు. వివిధ వయసులవారి అభిరుచులకు అనుగుణంగా... అంటే, పెద్దవారికి ఆధ్యాత్మికం, మధ్య వయసువారికి ఆహ్లాదం, కుర్రకారుకు జోష్‌, పిల్లలకు వినోదం ఉండే ప్రదేశాలు ఈ మధ్య హాట్‌ ఫేవరెట్స్‌. ఇలాంటి ట్రిప్స్‌ వల్ల ఆత్మీయ బంధాలు పెరుగుతాయి. అదే సమయంలో పిల్లల్నీ, వయోధికుల్నీ విడిచిపెట్టి వెళ్ళడం, వెళ్ళాక టెన్షన్‌ పడడం లాంటివి అవసరం లేదు. వెకేషన్లో కాస్త ఏకాంతంగా తిరగాలన్నా పిల్లల్ని పెద్దవాళ్ళ దగ్గర ఉంచి వెళ్తే సరిపోతుంది.
 
‘ఒంటరి’ మార్కు!
 
‘‘టూర్‌కి ఎవరితో వెళ్ళినా తలనొప్పిగానే ఉంది గురూ! మనం తిన్నవి వాళ్ళు తినరు. మనం చూద్దామనుకున్నవి వాళ్ళకి నచ్చవు. మొత్తం ప్రోగ్రామంతా చెడిపోతుంది!’’ అని తల పట్టుకొనే వాళ్ళు ఎందరో ఉంటారు. అందుకే చాలామంది ‘సోలో ట్రావెల్‌... సో బెటర్‌’ అనుకుంటున్నారు. అప్పుడు అంతా మన కంట్రోల్లో ఉంటుంది. నచ్చినట్టు తిరగొచ్చు, నచ్చింది తినొచ్చు, మరో పూట గడపాలంటే గడపొచ్చు. లేదంటే వేరే డెస్టినేషన్‌ వెతుక్కోవచ్చు. మీ అంతట మీరుగా ప్రయాణాలు చేసినప్పుడు, కొత్త కల్చర్‌లో మరింత సులువుగా కలిసిపోవచ్చు. కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకోవచ్చు. తెలిసినవారెవరూ ఉండరు, కాబట్టి మీ కంఫర్ట్‌ జోన్‌లోంచీ బయటికి రావచ్చు. అడ్వంచరస్‌ టూర్లు ఇష్టపడేవాళ్ళు ఎక్కువగా ఇలాంటి ఒంటరి ప్రయాణాలకు ఓటేస్తున్నారని చెబుతున్నారు ట్రావెల్‌ రంగ నిపుణులు. సోలో టూరిస్టుల్లో మహిళల శాతం పెరుగుతూ ఉండడం కూడా గుర్తించదగిన పరిణామమే!
 
సాహస ‘విలాసం’
 
యువ జంటలు హనీమూన్‌ కోసం బీచ్‌లూ, సాహసాలు చేయడానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలను ఎంచుకొనే ధోరణి బాగా పెరుగుతోంది. అడ్వంచరస్‌, బీచ్‌ డెస్టినేషన్లకు మునుపెన్నడూ లేనంత డిమాండ్‌ ఉంది. బోటింగ్‌, స్విమ్మింగ్‌, ట్రెక్కింగ్‌, స్పా, యోగా లాంటి అదనపు ఆకర్షణలతో ప్యాకేజీలు అందిస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. కొన్నేళ్ళ కిందట ప్రధాన నగరాలూ, ప్రసిద్ధమైన టూరిస్ట్‌ స్పాట్స్‌నే చాలామంది ఎంచుకొనేవారు. యువతరం ఇప్పుడు శోధిస్తున్నది మామూలు ప్రపంచానికి దూరంగా, ఉత్తేజాన్నీ, ఉల్లాసాన్నీ అందించే ప్రదేశాల కోసం, నోరూరించే కొత్త కొత్త రుచుల ఆహారం కోసం. ఈ సంవత్సరం ఈ ట్రెండ్‌ మరింత పెరుగుతుందని పరిశీలకుల అంచనా
 
రెండూ, అంతకు మించి!
 
 ట్రిప్‌ ప్లాన్‌ చేసుకుంటున్నప్పుడు ఒకటికన్నా ఎక్కువ ప్రదేశాల్ని సందర్శించాలనుకొనే వారి సంఖ్య పెరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు. దగ్గర దగ్గరగా ఉన్న రెండు డెస్టినేషన్స్‌ను ఒకే విడతలో చుట్టి వచ్చేస్తే ఖర్చులు కలిసొస్తాయి. సంతోషం రెట్టింపవుతుంది. అంతేకాదు, ఎక్కడికి వెళ్లాలనే విషయంలో కుటుంబ సభ్యులు, లేదా స్నేహితుల మధ్య సందిగ్ధం ఏర్పడినప్పుడు ఇలా రెండు మూడు చోట్లకు వెళ్ళడం ఉభయతారకంగా ఉంటుంది. ఎంతో ఎగ్జైటింగ్‌గానూ ఉంటుంది. ‘డబుల్‌ డెస్టినేషన్స్‌’ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువమంది అనుసరిస్తున్న ట్రెండ్‌ అనీ, కొత్త సంవత్సరంలో ఇది మరింత ఊపందుకుంటుందనీ నిపుణుల ఉవాచ.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.