కనువిందు చేసే లెమన్‌ ఫెస్టివల్‌
03-01-2018 22:47:07
పండగ సమయాల్లో వీధులు, పార్కులను కళ్లు మిరుమిట్లుగొలిపే లైట్లతో అలంకరించుకోవడం మనకు తెలుసు. కానీ ఫ్రెంచ్‌ రివెరాలో మాత్రం
నిమ్మకాయలతో, నారింజ పండ్లతో పార్కులన్నీ అలంకరించి పండుగ చేసుకుంటారు. ఏటా అక్కడ జరిగే లెమన్‌ ఫెస్టివల్‌ కోసం ఇలా చేస్తుంటారు. ఈ ఫెస్టివల్‌ను చూడటానికి కొన్ని లక్షల మంది పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు.
 
ఫ్రాన్స్‌లో జరిగే ముఖ్యమైన పండుగల్లో ఈ లెమన్‌ ఫెస్టివల్‌ ఒకటి. ఫార్ములా గ్రాండ్‌ 1 తరువాత ఫ్రెంచ్‌ రివెరాలో జరిగే రెండో అతి పెద్ద ఈవెంట్‌ ఈ లెమన్‌ ఫెస్టివల్‌. ప్రతి ఏటా ఫిబ్రవరిలో జరిగే ఈ వేడుకకు సుమారు 2 లక్షల 50 వేల మంది సందర్శకులు హాజరవుతారు. ఈ పండుగ ఈ మధ్య పుట్టిందేమీ కాదు. 1928 నుంచి ఈ ఫెస్టివల్‌ను జరుపుకుంటున్నారు. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 1 వరకు జరిగే ఈ వేడుక కోసం కొన్ని వేల మంది కార్మికులు శ్రమించి పార్కులు, ఇతర ముఖ్యమైన స్థలాలన్నింటినీ అందంగా తీర్చిదిద్దుతారు. ఇందుకోసం 120 టన్నుల నిమ్మపండ్లను ఉపయోగిస్తారట. నిమ్మపండ్లు మాత్రమే కాకుండా ఆరెంజ్‌, గ్రేప్‌ఫ్రూట్‌ వంటి సిట్రస్‌ జాతికి చెందిన పండ్లను కూడా వాడతారు. అయితే ఎక్కువగా నిమ్మపండ్లే కనిపిస్తాయి. ఇలా అలంకరించిన పార్కులను చూడటానికి సందర్శకులను అనుమతిస్తారు. అత్యంత సుందరమైన తీరప్రాంతం కలిగిన ఈ పట్టణాన్ని లెమన్‌ ఫెస్టివల్‌ జరిగే సమయంలో సందర్శించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు.
 
గోల్డెన్‌ ఫ్రూట్‌ పరేడ్‌
నారింజపండ్లు, నిమ్మపండ్లు రోడ్డుపై నీటివరదలా జారుకుంటూ వస్తే ఎలా ఉంటుంది? ఈ దృశ్యం చూడాలంటే గోల్డెన్‌ ఫ్రూట్‌ పరేడ్‌ చూడాల్సిందే. లెమన్‌ ఫెస్టివల్‌ జరిగే రోజుల్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈ పరేడ్‌ నిర్వహిస్తారు. జానపద బృందాలు చేసే నృత్యాలు, అభిమానుల కోలాహలంతో ఈ పరేడ్‌ కన్నుల పండువగా ఉంటుంది. చివరి ఆదివారం రోజున పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తారు. గురువారం రోజుల్లో పరేడ్‌ రాత్రివేళ ఉంటుంది. ఈ ఫెస్టివల్‌ను మెంటన్‌ లెమన్‌ ఫెస్టివల్‌ అని కూడా అంటారు. ఎందుకంటే మెంటన్‌లోనే నిమ్మపండ్లు ఎక్కువ పండుతుంటాయి. మెంటన్‌ ఒక చిన్న పట్టణం. నైస్‌ పట్టణానికి 30 కి.మీల దూరంలో ఉంటుంది. ఇది యూర్‌పలో అత్యధికంగా నిమ్మపండ్లను పండిస్తున్న ప్రదేశంగా గుర్తింపు పొందింది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.