టెక్‌ ప్రియులను ఆకట్టుకున్న 2017
31-12-2017 22:23:35
గత సంవత్సరం విడుదలైన గ్యాడ్జెట్లు, కొత్త ఆవిష్కరణలు టెక్నాలజీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. వాటిని ఒకసారి గుర్తు చేసుకుందాం.
 
ఆకర్షించిన ‘అలెక్సా’
పిలిస్తే పలికే డివైజ్‌గా అమెజాన్‌ ‘ఎకో ప్లస్‌’ 2017లో అదరగొట్టింది. పాటలు ప్లే చేయడం, వార్తలు చదవడం, వాతావరణ సమాచారం చెప్పడం, చెప్పిన పుస్తకాన్ని చదివి పెట్టడం.... ఒక్కటేమిటి ఏ పని అడిగినా ఠక్కున చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ‘అలెక్సా’ ఉదయం 6 గంటలకు నిద్రలేపు అంటే ఠంచనుగా నిద్రలేపుతుంది. ఈ ఏడాది ఎక్కువ మందిని ఆకర్షించిన డివైజ్‌లలో ఇది మొదటి స్థానంలో ఉంది.
 
అదరగొట్టిన డిజిటల్‌ వ్యాలెట్లు
పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. 2017లో వచ్చి అదరగొట్టిన డిజిటల్‌ వ్యాలెట్‌లే ఇందుకు సాక్ష్యాలు. పేటిఎం వంటి మొబైల్‌ వ్యాలెట్‌ జనాల్లోకి బాగా చొచ్చుకెళ్లింది. టీస్టాల్స్‌ దగ్గర సైతం పేటిఎంతో డబ్బులు చెల్లించారు. 2 కోట్ల మంది వినియోగదారులు పేటిఎం వినియోగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. మొబిక్విక్‌, ఫొన్‌పె, సామ్‌సంగ్‌ పే, ఎయిర్‌టెల్‌ మనీ వంటి వ్యాలెట్లు సైతం ఆకర్షించాయి. గూగుల్‌ సైతం డిజిటల్‌ చెల్లింపుల కోసం ‘తేజ్‌’ పేరుతో యాప్‌ను విడుదల చేసింది. అతి తక్కువ సమయంలో 12 లక్షల మంది వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.
 
ఆసక్తి రేకెత్తించిన ఐఫోన్‌ 10
ఐఫోన్‌ కొత్త వెర్షన్‌ విడుదలవుతోందంటే ప్రపంచమంతా ఆసక్తే. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఐఫోన్‌ 10 విడుదలయింది. ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఐఫోన్లు అమ్ముడుపోయాయి. 3జిబి ర్యామ్‌, 64 జిబి, 256జిబి స్టోరేజ్‌ సామర్థ్యం కలిగిన మోడల్స్‌ విడుదలయ్యాయి. బ్యాటరీ పనితీరు, కెమెరా నాణ్యత వినియోగదారులను ఆకట్టుకున్నాయి.
 
వావ్‌... ఓరియో
నెక్ట్స్‌ జనరేషన్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌గా పిలుస్తోన్న ఆండ్రాయిడ్‌ ‘ఓరియో’ 2017లోనే విడుదలయింది. ఆండ్రాయిడ్‌ నౌగట్‌ తరువాత మరికొన్ని మార్పులు చేస్తూ, కొత్త ఫీచర్లను జోడిస్తూ తీసుకొచ్చిన ఈ ఓఎస్‌ ఆకట్టుకుంది. యాప్‌ పర్‌ఫార్మెన్స్‌, రీడిజైన్‌ చేసిన ఎమోజీలు....వంటివి వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఆ తరువాత ఆండ్రాయిడ్‌ ‘ఓరియో గో’ పేరుతో అప్‌డేట్‌ చేసిన ఓఎస్‌ను విడుదల చేసింది.
 
గూగుల్‌ అసిస్టెంట్‌ సూపర్‌!
2017లో ఆండ్రాయిడ్‌ వినియోగదారులను బాగా ఆకర్షించింది గూగుల్‌ అసిస్టెంట్‌. ‘ఓకే గూగుల్‌’ అంటే ‘ఐయామ్‌ లిజనింగ్‌’ అంటూ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు బాగా దగ్గరయింది. ఫోన్‌ కాల్‌ చేయాలన్నా, యూట్యూబ్‌లో వీడియో ఓపెన్‌ చేయాలన్నా అడిగిందే తడవుగా చిటికెలో చేసి పెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.
 
యాపిల్‌ వాచ్‌ సీరిస్‌ 3
గతంలో వచ్చిన వాచ్‌లతో పోల్చితే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని ఉపయోగించారు. ఫోన్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయాన్ని అందించారు. డిజిటల్‌ అసిస్టెంట్‌ సిరి ఆకట్టుకుంది. హార్ట్‌రేట్‌ మానిటరింగ్‌ ఆకర్షించింది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.