నడిచేది నువ్వు... నడిపేది తాను..
16-12-2017 02:49:53
మనిషి గొప్పవాడు. అయితే తాను వేసే ప్రతి అడుగులోను పరమాత్మ ప్రేరణ, స్ఫూర్తి ఉన్నదని గ్రహించి వ్యవహరించినపుడే గొప్పతనానికి సార్థకత చేకూరుతుంది. ఇది... వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని చాటుతుంది. పరమాత్మను బేఖాతరు చేసి, ‘అంతా నేనే చేస్తున్నాను. సర్వము నావల్లనే నడుస్తుంది’ అనే అపోహతో ఉన్న వ్యక్తికి పతనం తప్పదు. ఈ రహస్యాన్ని గ్రహించాడు అర్జునుడు. అందుకే పరమాత్మను తన రథసారథిగా ఉండి నడిపించాలని ప్రార్థించాడు.
 
భగవంతుడే ముందుండి నడిపేటప్పుడు అంతా... శుభమే... మంగళమే... అని ప్రపంచానికి చాటుతుంది కృష్ణార్జునుల రథచిత్రం.ఈ అంశాన్ని పండిత పామరులనే తేడా లేకుండా అతి సులభంగా ఆచరించే విధానాన్ని హిందూధర్మం బోధిస్తుంది. తెలిసినా, తెలియకున్నా ప్రతి హిందువు ఆచరించే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇల్లు నిర్మించుకుని మొదట గృహప్రవేశం చేస్తారు. ఈ సమయంలో ప్రప్రథమంగా దేవుని ప్రతిమను ముందుగా ఇంటిలోనికి తీసుకెళ్ళి పూజించిన పిమ్మట ఆ నివాసస్థలాన్ని వాడుకుంటారు. అలాగే, ఓ కొత్త వాహనం కొన్నా, మొట్టమొదటి సంపాదన తెచ్చినా, రైతు పొలంలో పండించిన తొలి పంటను, ఇంటిలో అమ్మ వండే వంటను ఇలా... ప్రతి దానిని దైవానికి సమర్పించి, ఇది దైవదత్తమని భావించి స్వీకరిస్తారు. భారతదేశంలో అతి సామాన్యుడైన హిందువు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తుంటాడు. దీనికి వేదశాస్త్రపురాణాది పాండిత్యం అవసరం లేదు.
 
వ్యక్తి తాను చేసే పని వెనుక శక్తిని, స్ఫూర్తిని తనకు ఇచ్చి నడిపించేది దైవమనే విశ్వాసం కలిగి ఉండటం, అలాగే తాను చేసిన పనికి లభించే ఫలితం కూడా పరమాత్మ అనుగ్రహమని స్వీకరించటం అనే అద్భుతమైన అంశాల్ని ఆవిష్కరిస్తుంది హిందూ సంస్కృతి. శ్రీకృష్ణుని రథసారథిగా పరిగణించి తనను, తన భవిష్యత్తును నడిపించమని అర్జునుడు వేడుకోవడంలో ఇదే ఆంతర్యం.
 
స్వామి పరిపూర్ణానంద సరస్వతి
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.