ADVT
జీవన్మృతుడే జీవన్ముక్తుడు
15-12-2017 01:42:26
దేవాసుర యుద్ధంలో అలసిపోయిన శ్రీ మహావిష్ణువు నారి బిగించి ఉన్న తన ధనుస్సు మీదే గడ్డం ఆనించి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆయన్ని నిద్ర లేపడానికి దేవతలు చెదపురుగును సృష్టించి వింటినారిని తినమన్నారు. ‘‘నిద్రాభంగం, భగవత్కథాశ్రవణ విఘ్నం, దంపతులను విడదీయటం, మాతాశిశువులను వేరు చేయడం... బ్రహ్మహత్యాసమానమంటారే. అందునా నీరజాక్షునికా నిద్రాభంగం? మీరెంత స్వార్థపరులు? నన్నీ పాపానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? దీని వల్ల నాకేమిటి ప్రయోజనం?’’ అని ఆ పురుగు ప్రశ్నించింది.
 
యజ్ఞ హవిస్సులో నీకూ కొంచెం భాగమిస్తామని ఎర చూపగా ఆ పురుగు వింటినారిని కొరికింది. అంతే, త్రివిక్రముని తల తెగి ఎక్కడ పడిందో తెలియలేదు. దేవతలు మొండెం మాత్రం చూసి దిగ్ర్భాంతి చెందారు. ‘‘ఏమిటీ దారుణం? ఎవరిదీ మాయ? నిన్ను మించిన మాయ కూడా ఉందా ఈ జగత్తులో జగన్నాథా?’’ అని వాపోయారు. బృహస్పతి సలహాతో పరాశక్తిని ప్రార్థించారు. ‘‘దేవతలారా! ఒకప్పుడు వైకుంఠంలో విష్ణుమూర్తి మహాలక్ష్మిని చూచి అదోలా నవ్వగా, ఆమె తమోగుణ విజృంభణంతో ‘నీ తల తెగిపోగాక’’ అని దారుణంగా శపించింది.
 
అంతే గాక పూర్వం హయగ్రీవుడనే అసురుడు ఘోర తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు. అది అసంభవం మరొకటి కోరుకోమనగా తన మరణం తన వల్లనే (హయగ్రీవుని చేతనే) కలగాలని అర్థించాడు. నేను అలాగే అనుగ్రహించాను. కావున, గుఱ్ఱపు తల తెచ్చి విష్ణువు మొండేనికి తగిలించండి.’’ అని పరమేశ్వరి బోధించింది. అలా శ్రీమహావిష్ణువు హయగ్రీవుడై అవతరించి హయగ్రీవాసురుణ్ణి సంహరించాడు. ఆదిశక్తి అనుగ్రహంతో అన్ని విద్యలకు ఆదిదేవుడయ్యాడు.
ఈ దేవీ భాగవత కథకు శతపథ బ్రాహ్మణం మూలం. ఇక, ‘పరంజ్యోతి’ ప్రకాశంలో ఈ ప్రసంగ పరమార్థం పరిశీలిద్దాం. ఇద్దరు హయగ్రీవులలో ఒకడు దేహ భావంతో ఉన్న జీవుడు(నరుడు) కాగా, మరొకడు ఆత్మనిష్ఠుడైన దేవుడు(నారాయణుడు). దేహభ్రాంతితో ఉంటే పురుషుడు. అది తొలగితే పురుషోత్తముడు. నరునికి నారాయణత్వం కల్గించుటే అవతార ప్రయోజనం. హయగ్రీవుని చేతిలో హయగ్రీవుడు మరణిస్తేనే, అనగా తన చేత తాను నశించినప్పుడే జీవునికి అమృతత్త్వ సిద్ధి.
 
‘‘సర్వవేదాంత సిద్ధాంత సారం వచ్మి యథార్థతః,
స్వయం మృత్వా స్వయం భూత్వా స్వయమేవావశిష్యతే.’’
 
‘జీవుడు స్వయంగా మరణించి, అనగా దేహమే నేనను భావం త్వజించి, స్వయంగా బ్రహ్మస్వరూపుడై తానే శేషించును’ అని కఠరుద్రోపనిషత్తు వేదాంత విద్యాసారం ప్రవచించింది. అహంకార మమకారాలు తొలగితే దైహికంగా జీవించి ఉన్నా మరణించిన వాడే, అమనస్కుడే. జీవన్మరణమే జీవన్ముక్తి! సాధకుడు ప్రపంచంలో మరణించి పరమాత్మలో జీవించాలి. అట్టితరి, ఎట్టి సాంసారిక అనుకూల, ప్రతికూలాలు వానిని ప్రభావితం చెయ్యలేవు సరికదా పరమాత్మ యందు లీనమై ఆనందిస్తూ ఉంటాడు. ఇదే సిద్ధి. సమస్త సాధనా ఫలం.
(శ్లో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం, ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే.)
 
తంగిరాల రాజేంద్ర ప్రసాద్‌

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.