శ్రీభగవాన్‌ కరుణ
14-12-2017 23:11:09
(గత సంచిక తరువాయి)
శ్రీభగవాన్‌ తన దర్శనార్థం వచ్చే భక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకపరచ వద్దనే వారు. అయితే భగవాన్‌ ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా వారికి విశ్రాంతి అవసరమైంది. ఎవ్వరూ వారి సమక్షంలోకి వెళ్లకూడదని కొన్నాళ్లు కట్టడి చేశారు ఆశ్రమం వాళ్లు. దీనిని గమనించి భగవాన్‌ స్వయంగా హాలులోంచి బయటకు వచ్చి దర్శనమిచ్చే వారు. తనను బయటకు రాకూడదని ఆశ్రమం వాళ్లు ఏ నియమమూ పెట్టలేరు కదా అనే వారు. భక్తుల పట్ల వారి ప్రేమ అంతగా ఉండేది.
 
చలం ఇంకో ఉదంతం చెప్పారు. ఆశ్రమానికి దగ్గరలో ఒక పాడుపడిన గుడిలో ఒక ముసలి వాడుండే వాడు. అతడ్ని నీకు భయం వేయదా అని చలం అడిగినప్పుడు ‘‘దేనికి భయం. శ్రీభగవాన్‌ తమ కాంతిని నాపై విరజిమ్ముతారు. రాత్రంతా నీలపు కాంతి నన్ను చుట్టేస్తుంది. ఆ కాంతి నాకున్నంత కాలం నాకు భయమెలా ఉంటుంది?’’ అని అన్నాడట.
 
శ్రీభగవాన్‌ రూపం అప్పుడప్పుడు మారుతూ ఉండేది. వారు దూరంగా చూస్తూ కూర్చున్నప్పుడు మనకు శ్రీదక్షిణామూర్తి స్ఫురిస్తారు. ఆ నిశ్చలమూర్తికి వర్ణింపలేని సౌందర్యం, లావణ్యం ఉండేవి. కేవలం కౌపీనాన్నే ధరించినా రత్నసింహాసనంపై కూర్చుని చీనీచీనాంబరాలను ధరించి రాచరికాన్ని కనబరిచే ఏ మహారాజునో స్ఫురింపచేసేవారు.
మానవాకారంలో ఉన్న భగవదవతారులు శ్రీభగవాన్‌. అటువంటి గురువులు మానవాళి క్షోభను నిర్మూలించడానికి అప్పుడప్పుడు భూమి మీద, మానవరూపంలో అవతరిస్తారు. పరమనాస్తికుడైన చలం గొప్ప రమణ భక్తునిగా మారి పోయిన ప్రముఖులలో ఒకరు. (సశేషం)
 పింగళి సూర్యసుందరం
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.