చెడ్డవేవి? మంచివేవి?
14-12-2017 23:09:35
మనిషి మంచివాడా లేదా చెడ్డవాడా అన్నది అతని హృదయం, నాలుక వల్ల తెలుస్తుంది. ఈ రెండు అవయవాలను ఎలా వాడాలన్నది మనిషి చేతిలో ఉంది అని చెప్పిన మహానుభావుడు హజ్రత్‌ లుక్మాన్‌ అలైహిస్సలాం. ఆయన ఆఫ్రికా ఖండంలో జన్మించారు. అడవుల్లో పెరిగి పెద్దవారయ్యారు. అడవుల్లో కాలికి చెప్పులు లేకుండా తిరిగేవారు. కేవలం ఒక వస్త్రాన్ని చుట్టుకొని అడవుల్లో వన్య మృగాలతోపాటు ఉండేవారు. తన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి దీర్ఘంగా ఆలోచించేవారు. ఈ ఆలోచనల వల్ల అనేక కొత్త విషయాలు ఆయన తెలుసుకున్నారు.
 
హజ్రత్‌ లుక్మాన్‌ అలైహిస్సలాం సజ్జనుడైన దైవదాసుడు. అల్లాహ్‌ ఆయనకు విజ్ఞతా వివేచనలు పుష్కలంగా ప్రసాదించాడు. విషయావగాహనల్లో, ధార్మిక దృష్టిలో సాటిలేని మేటిగా పేరు సంపాదించుకున్నారు. ‘‘మీకు ఇంతటి విజ్ఞత ఎలా వచ్చింది?’’ అని ప్రజలు అడిగేవారు. ‘‘ఋజువర్తన వల్లా, నిజాయితీ వల్లా, నిరర్థకమైన విషయాలకు దూరంగా ఉండడం వల్లా అని ఆయన సమాధానమిచ్చేవారు. ఆఫ్రికాపై దండెత్తిన బానిస వ్యాపారులు ఆయనను నిర్బంధించారు. ఆయనను ఒక బానిసగా అమ్మేశారు. అప్పటి నుంచి తన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఆయన కోల్పోయారు. జీవితంలో ఎదురైన ఈ కష్టాన్ని ఆయన భరించారు.
 
సహనం వహించారు. అల్లాహ్‌ అనుగ్రహం కోసం ఎదురుచూడసాగారు. ఆయనను కొనుక్కున్న వ్యక్తి మంచి మనిషి. తెలివి, వివేకం కలవాడు. అతను లుక్మాన్‌ (అలై)ను దయతో చూసేవాడు. లుక్మాన్‌ సామాన్య వ్యక్తి కాదని అతను గుర్తించాడు. ఆయన వివేకానికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు.
 
ఒకరోజు లుక్మాన్‌ను పిలిచి, గొర్రెను కోసి అందులో చెడ్డ భాగాలు తన వద్దకు తీసుకురమ్మన్నాడు. లుక్మాన్‌ ఒక గొర్రెను కోసి, దాని గుండె, నాలుకలను తీసుకొని యజమాని వద్దకు వెళ్ళారు. వాటిని చూసి యజమాని మెచ్చుకోలుగా చిరునవ్వు నవ్వాడు. శరీరంలో అత్యంత చెడ్డ భాగాలుగా గుండె, నాలుకను తీసుకువచ్చిన లుక్మాన్‌ ఎన్నిక ఆయనకు నచ్చింది. చాలా లోతైన విషయాన్ని లుక్మాన్‌ చెప్పారని అతను అర్థం చేసుకున్నాడు. అప్పటి నుంచి యజమాని అతని పట్ల శ్రద్ధ వహించి, ఆదరంగా చూడసాగాడు.
 
కొన్ని రోజుల తరువాత లుక్మాన్‌ను యజమాని మళ్ళీ పిలిచాడు. ఈసారి గొర్రెను కోసి దానిలో అత్యంత ఉత్తమమైన అవయవాలు తీసుకురమ్మన్నాడు. ఈసారి కూడా ఆయన గుండె, నాలుకలే తీసుకువచ్చారు.
 
యజమాని వాటిని చూసి, ‘శరీరంలో అత్యంత చెడ్డ భాగాలు, మంచి భాగాలూ కూడా అవే ఎలా అవుతా’యని ప్రశ్నించాడు. ‘‘మనిషి మంచివాడైతే అతని గుండె, నాలుక చాలా ఉత్తమమైన భాగాలు’’ అని లుక్మాన్‌ చెప్పారు. ఈ సంఘటన జరిగిన తరువాత వివేక విచక్షణలు, తెలివితేటలు రాజ్యం యావత్తూ మారుమ్రోగసాగాయి.
యజమాని తన కుటుంబ సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. తన మరణానంతరం లుక్మాన్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పాడు. యజమాని మరణం తరువాత లుక్మాన్‌కు స్వాతంత్య్రం లభించింది. ఆయన అక్కడినుంచి బయలుదేరి చాలా ప్రాంతాలు తిరిగి చివరికి బనీ ఇస్రాయీల వద్ద స్థిరపడ్డారు. దావూద్‌ (అలై) పాలనలో ఆయన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన తీర్పులు చాలా ప్రసిద్ధి పొందాయి.
 
మహమ్మద్‌ వహీదుద్దీన్‌, సిద్దిపేట
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.