ADVT
మనోధైర్యమే కవచం!
14-12-2017 23:08:12
కల ముగియింపుము తల్లీ! కలలో నున్నంతసేపు కట్టలు కట్టలు జ్వలియించు కోర్కె కట్టెలు మెలకువలో నుండనిమ్ము మేనా పుత్రీ!
జీవితం ఒక కల. మన ఆలోచనలు, మన భయాలే కలగా రూపొందుతాయి. కాబట్టి సుఖానికి పొంగి పోకూడదు. దుఃఖానికి కుంగిపోకూడదు. రెండింటిని సమానంగా తీసుకోవాలంటే ‘‘సుఖదుఃఖాలు రెండూ లేవు, రెండూ మిథ్య’’ అని అర్థం చేసుకోవాలి. కలలో ఉన్నంత సేపు కోరికలనే కట్టెలు కట్టలు కట్టలుగా మండిపోతూ ఉంటాయి. మంట ఆగాలంటే నీళ్లు చల్లాలే కానీ ఈ కట్టెతో ఆగిపోతుందిలే అనుకుంటే ఎక్కడాగుతుంది? అసలు కట్టె వెళ్లిపోయే వరకు ఆగదు. అందుకే తల్లితండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు అడిగిందల్లా ఇవ్వకూడదు. అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. గారాబం పనికిరాదు. ‘‘మేం గారాబంగా పెంచుతున్నాం పిల్లల్ని’’ అన్నారంటే అంతకంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరు. వాళ్ల పిల్లలను వాళ్లే చెడగొడుతున్నట్టు లెక్క.
భయంకరమైన కష్టంలో ఉన్నప్పుడు కూడా ద్రౌపదీదేవి మనోధైర్యంతో నిలబడింది. ఆ మహాసాథ్విని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ద్రౌపది అనగానే ఐదుగురిని ఎందుకు చేసుకుంది? అన్న ప్రశ్నలు వేయడం కాదు. ఆవిడ నుంచి గ్రహించవలసినవి ఎన్నో ఉన్నాయి.
 
‘అలమట బొంది మాయ విధియా! యని దైవము దూఱు, నిత్తఱిం
గలరొకొ నాకు దిక్కను, మొగంబున నశ్రులు వెల్లిగొల్పు, దొ
ట్రిలబడు, జల్లనం జెదరు డెందము గూడగ దెచ్చి నన్ను గే
వలమున ముట్ట నెవ్వరికి వచ్చునను, గలగున్‌, వెనుంబడున్‌’
 
‘‘అసలు నన్ను కాపాడే వారెవరైనా ఉన్నారా? ఏనుగు పనిగట్టుకుని సింహం గుహలోకి వెళ్లినట్టుగా నేను ఆ దుర్మార్గుని గుహలోకి వెళుతూ నన్ను రక్షించమని అడగడమేంటి? నన్నెవరు వెళ్లమన్నారు?’’ అనుకుంది ద్రౌపది. కానీ వెళ్లక తప్పదు. ఎంతటి పరిస్థితి వచ్చింది? ద్రౌపదికి వచ్చిన కష్టం సామాన్యమైనది కాదు. ద్రౌపధి ఏకధారగా ఏడుస్తోంది. అంత అధైర్యంలో, అంతటి భయంకరమైన పరిస్థితిలో కూడా మనోధైర్యాన్ని కూడగట్టుకుంది. ‘నన్ను ముట్టుకోవడం ఎవ్వరికైనా సాధ్యమా?’ అనుకుంది ద్రౌపది. ఇలాంటి పరిస్థితులు చాలా మందికి ఎదురవుతాయి. అలాంటప్పుడు మనో ధైర్యం కూడగట్టుకోవాలి. దేవుని స్మరణ చేస్తూ మనోధైర్యాన్ని కూడ గట్టుకుని ముందుకెళితే ఇబ్బందులె దురైనా మేలే జరుగుతుంది.
డా. గరికిపాటి నరసింహారావు

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.