ADVT
నాడు చిత్ర పటం.. నేడు మహా ఆలయం...
09-12-2017 10:10:33
  • దాతల ఔదార్యంతో
  • భక్తుల పూజలతో విరాజిల్లుతున్న సోమాజిగూడ అయ్యప్ప దేవాలయం
  • ఈ ఆలయానికంటూ ప్రత్యేక గుర్తింపు
కోరిన కోరికలు తీర్చే సోమాజిగూడ అయ్యప్పస్వామి దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతోంది. ఓ దాత స్థలం విరాళంతో నాడు ఓ చిత్రపటంతో పూజలు అందుకున్న మణికంఠుడు నేడు మహా ఆలయంలో కొలువుదీరి భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతున్నాడు. నగరం నలు మూలల నుంచి నిత్యం భక్తులు వచ్చి దైవాన్ని దర్శించుకుంటారు. అయ్యప్ప స్వాముల మండల పూజల సమయంలో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.
 
దాత ఔదార్యం...
నగరానికి చెందిన దాత దుగ్గిరాల రామశాస్త్రి ఆలయం కోసం సోమాజిగూడ త్యాగరాజ్‌నగర్‌లోని సుమారు 800 గజాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. 1993లో స్థానికులు అయ్యప్పస్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించసాగారు. స్థానికులు, భక్తుల సహకారంతో షెడ్‌ను ఏర్పాటు చేశారు. అంచెలంచెలుగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ మహా ఆలయంగా తీర్చిదిద్దారు. నేడు నిత్యం పూజలు, అన్నదాన కార్యక్రమాలతో ఆలయం కిటకిటలాడుతోంది. ఏడాదికి ఓ సారి నియమనిష్టలతో అ య్యప్ప మాలధారణ సమయంలో స్వా ములకు నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. నవంబర్‌ 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు అయ్యప్ప స్వాములకు, స్థానికులకు నిత్య అన్నదానం నిర్వహిస్తారు.
 
ప్రత్యేక గుర్తింపు
ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి నగరంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. నగరంలోని సోమాజిగూడ అయ్యప్ప దేవాలయం అంటే తెలియని వారు లేరనే చెప్పొచ్చు. ఈ ఆలయ వార్షికోత్సవం ప్రతి యేడాది ఏప్రిల్‌ నెలలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి శబరిమల ఆలయం ప్రధాన తంత్రిలో ఒకరైన బ్రహ్మ శ్రీ కందరారు రాజీవరారు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లక్షార్చన, పుష్పార్చనతో పాటు నిత్య పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. స్థానికుల కోసం ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో అయ్యప్ప స్వామితో పాటు గణపతి, దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్టించారు. రోజూ సుమారు 600 మందికి పైగా ఆలయాన్ని దర్శించుకుంటారు.
 
ఆలయ చరిత్ర...
నాడు చిన్న చిత్రపటంతో ప్రతిష్టాపించారు. దాతల చేయూత , స్థానికుల సహకారంతో ఆలయాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. 1993లో మణికంఠుడి విగ్రహాన్ని ప్రతిష్ఠాపించారు. ఆరు నెలల వ్యవధిలోనే గణపతి విగ్రహం, 1997లో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠాపించినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ ఆలయానికి రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు దర్శించుకుంటారు. నిత్యం ఆలయంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 5 గంటలకు సుప్రభాతం, 5.30 గంటలకు మహాగణపతి హోమం, 6గంటలకు సర్వాభిషేకం, 6.30 గంటలకు ప్రభాత పూజ, 12.30 గంటలకు అన్నదానం, సాయంత్రం 6 గంటలకు మహా దీపారాధన, 6.30 గంటలకు భజన, రాత్రి 8 గంటలకు ప్రత్యేక పూజ, 9 గంటలకు భిక్ష కార్యాక్రమాలు ఉంటాయి. ఈనెల 25న లక్షార్చన కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు.
భక్తుల కొంగుబంగారం....
సోమాజిగూడ అయ్యప్ప స్వామి దేవాలయం భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతోంది. భక్తులు కోరిన కోరికలు తీరుతాయని వారు ప్రగాఽఢంగా విశ్వసిస్తారు. అయ్యప్ప మండల పూజల సమయంలో నిత్య అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్న సమయంలో అన్నదానం, సాయంత్రం వేళల్లో అల్పాహారాన్ని దాతల సహకారంతో ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు.
- కిషోర్‌, బీఎస్‌మక్తా
నిత్యాన్నదానం...
అయ్యప్ప మండల దీక్షలు మొదలైనప్పటి నుంచే ఈ ఆలయంలో నిత్యాన్నదానం నిర్వహిస్తారు. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్ర వేళల్లో అల్పాహారం ఉంటుంది. రోజూ స్వాములతో పాటు సాధారణ భక్తులు సుమారు 1000 మందికి పైగా ఈ ఆలయంలో భిక్ష చేస్తారు. సాధారణ రోజుల్లో కూడా ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ ఆలయానికి స్థానికులతో పాటు నగరం నలుమూలల నుంచి వస్తుంటారు.
- వేణు, స్థానికుడు.
Tags : Ayyappa, Temple

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.