గీత చెప్పింది తత్వమా? కర్తవ్యమా?
09-12-2017 01:37:30
భౌతిక శరీరం, మనసు, బుద్ధి వీటికంటే విలక్షణమైనది ఏదైనా ఉందా? ఈ ప్రశ్నకు భౌతిక విజ్ఞాన శాస్త్రాలు సమాధానం చెప్పలేక మౌనం వహిస్తున్నాయి. ‘చనిపోయిన పిమ్మట మిగిలేది గుప్పెడంత బూడిదే! అంతకంటే వేరేది ఏదీ లేదు’ అని తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానంతో వాదించే వాళ్లు కొందరున్నారు. ఇంతకీ ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టంగా తెలియట్లేదు. అయితే, ఆధ్యాత్మిక శాస్త్రం దీనికి కచ్చితమైన పరిష్కారం చూపుతుంది.
 
జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం.. ఈ మూడు కీలక అంశాలూ భారతీయ తత్వ శాస్త్రాల పట్టుగొమ్మలు. భౌతిక అంశాల పట్ల వివరణ ద్వారా అవగాహన కలిగించేది జ్ఞానం. సూక్ష్మమైన అంశాలపై లోతైన విచారణ ద్వారా అవగాహన కలిగించేది విజ్ఞానం. కారణం, తాత్వికమైన అంశాల పట్ల వివేకవంతమైన అవగాహన కలిగించేది ప్రజ్ఞానం. జ్ఞానాన్ని సకల జీవకోటికి ప్రసాదించింది ఈ ప్రకృతి. కానీ విజ్ఞానం మాత్రం ప్రయత్నంతో మానవ మేధకు పదును పెట్టి సాధించుకోవాలి.
 
ప్రజ్ఞానాన్ని కేవలం అంతర్ముఖ సాధనతోనే సాధించగలరు జిజ్ఞాసువులు. శరీరం, మనసు, బుద్ధిని దాటి స్వరూపమైన ఎరుకను గుర్తించడమే ప్రజ్ఞానం. ఈ తత్వాన్ని ప్రభోదించేది భగవద్గీత. దీంతోపాటు వ్యక్తికి ఈ ప్రపంచంతో, పర్యావరణంతో, ప్రకృతితో తన కర్తవ్యం ఏ విధంగా నిర్వహిస్తే సత్సంబంధాన్ని మెరుగుపరచుకుంటూ శాంతియుతంగా సమన్వయంతో జీవించవచ్చుననే అంశాన్ని కూడా స్పష్టంగా తెలుపుతుంది గీత. అందుకే ఇది బ్రహ్మవిద్య- యోగశాస్త్రాల మేలుకలయికతో శ్రీకృష్ణుడి ద్వారా లోకానికి అందింది. -స్వామి పరిపూర్ణానంద
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.