రామో విగ్రహవాన్‌ త్యాగః
08-12-2017 02:57:01
రామ చరిత్రలో రాజ్యం త్యజించి వనవాసానికి వెళ్లడమే ముఖ్య ప్రసంగం. ఎందుకంటే, రామావతార ప్రయోజనాన్ని పరిపూర్ణంగా సాధించిపెట్టే ప్రకరణం ఇదే. రాముని సుదీర్ఘ జీవన విధానం ఈ త్యాగమే. పెండ్లి అయ్యేనాటికి రాముడికి 15 సంవత్సరాలు.
 
వివాహానంతరం అయోధ్యలో పన్నెండు సంవత్సరాలు సీతారాముల ఆదర్శ దాంపత్యం సాగింది. 14 ఏళ్ల అరణ్యవాసం విధించిన తల్లి కైకతో రాముడు-అమ్మా! 27 సంవత్సరాలు నీ ఒడిలో ఆడుతూ పెరిగినా నన్ను నీవు అర్థం చేసుకోలేక పోతివిగదా! నాకు రాజ్యకాంక్షలేదు తల్లీ ! నాన్నగారి సత్యప్రతిజ్ఞా నిర్వహణకై ఇదుగో, ఇప్పుడే జటా చీరధారినై అటవీ ప్రస్థానం చేస్తాన’’న్నారు. దశరథుడు వికలుడయ్యాడు.
 
వనవాసాంతంలో తన 41వ యేట రాముడు లంకకు వెళ్లి రావణవధ గావించాడు. ఇలా 41 సంవత్సరాల వర్ణనమే రామయణమంతా. సనాతన వైదిక ధర్మ మహాధర్మాలన్నీ శ్రీరాముని జీవితంలోనే పరిపూర్ణతను పొందినవి.
 
‘రామో విగ్రహవాన్‌ ధర్మః’.. అమూర్త ధర్మానికి మూర్తరూపమైన శ్రీరాముడు ధర్మాచరణలో అవరోధమైనది ఎట్టిదైనా ఆనందంగా త్యజించాడు. ‘‘ప్రజల సుఖ సంతోషాలకై నేను నా స్నేహాన్ని, దయను, సుఖాన్ని, చివరకు అర్ధాంగి, సహధర్మచారిణి సీతను కూడా సహర్షంగా విడిచి పెడతాన’’ంటాడు రాముడు. రామ చరిత్ర సత్యం, ధర్మం, త్యాగం, సౌశీల్యం, శరణాగతవత్సలత, ప్రజారాధన- ఇవే ప్రధానం.
 
రావణవధానంతరం 11 వేల సంవత్సరాలు రాజ్యం పాలించినా రామరాజ్య వర్ణన ఒక్క (యుద్ధకాండ- 128వ అధ్యాయం) అధ్యాయంలోనే ఉంటుంది. పితృవాక్య పరిపాలనా రూప ధర్మ నిర్వహణకై సర్వస్వం త్యజించి క్షణకాలంలో వనవాసం స్వీకరించాడు.
 
పట్టాభిషేకమంటే పొంగిపోయింది లేదు. వనవాసమంటే కృంగిపోయింది లేదు. ఇదే రాముని మహత్తర ఆదర్శం, స్థితప్రజ్ఞత. ఈ ఆదర్శమే అనంతర కాలంలో ఎందరినో త్యాగులుగా, వైరాగులుగా తీర్చిదిద్దింది. శత్రువుల చేత గూడా శ్లాఘించబడిన శ్రీరాముడు మర్యాదపురుషోత్తముడు, మహాత్ముడు! ‘రామభూతం జగదభూత్‌ రామే రాజ్యం ప్రశాసతి’.. రామరాజ్యంలో జగమంతా రామమయమై అలరారింది.
 
- తంగిరాల రాజేంద్రప్రసాద్‌ శర్మ
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.