12 రికార్డుల అయ్యప్ప మహా వైభవ పడిపూజ
04-12-2017 12:16:00
  •  ఎన్టీఆర్‌ స్టేడియంలో జ్యోతి స్వరూపుడు
  •  108 పడులతో శబరిమల వైభవం
  •  పాల్గొన్న పరిపూర్ణానంద స్వామి, నేతలు
 కవాడిగూడ (హైదరాబాద్): శబరిమల అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నగరంలోని ఎన్‌టీఆర్‌ స్టేడియంలో 108 పడిపూజలు వైభవోపేతంగా జరిగింది. పూజలో నగర నలుమూలల నుంచి అయ్యప్పస్వాములు వేలాదిసంఖ్యలో పాల్గొన్నారు. దేశంలో ఎక్కడ జరగనివిధంగా 108 పడిపూజ భాగ్యనగరంలో అత్యంతభక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేలాదిగా అయ్యప్పస్వాములు పూజల్లో పాల్గొనడంతో ఎన్‌టీఆర్‌ స్టేడియంలో అయ్యప్పస్వామి నామస్మరణతో మారుమోగడంతోపాటు అయ్యప్పస్వాములు, వారి కుటుంబసభ్యులతో స్టేడియం కిటకిటలాడింది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డు, ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుతోపాటు మొత్తం 12 రికార్డులను అయ్యస్వామి మహాపడిపూజ సొంతం చేసుకుంది. అయ్యప్పస్వామి మహాపడిపూజ మహాగణపతి పూజతో ప్రారంభమై కనులపండువగా సాగింది. అనంతరం సుబ్రమణ్యస్వామి పూజ, అయ్యప్పస్వామి సహస్రనామావళి పూజలో స్వాములు పాల్గొన్నారు. శరణుగోష, భజన కార్యక్రమాలు భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.
 
మహావైభవ పడిపూజలో పాల్గొన్న కాకినాడ శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద భక్తులనుద్దేశించి అనుగ్రహ బాషణం చేశారు. హిందూమతంపై జరుగుగున్న దాడిని ప్రతిఒక్కరూ ప్రతిఘటించాలని, సంవత్సరంలో ప్రతినెలా హైందవ కార్యక్రమాలు కొనసాగించి హైందవ సంస్కృతిని పరిరక్షించాలన్నారు. 108 పడిపూజలతో హైదరాబాద్‌ ఎన్‌టీఆర్‌ స్టేడియంలోనే అయ్యప్పస్వాములు, భక్తులు మకరజ్యోతి చూస్తున్నారన్నారు. ఇది చారిత్రక అపూర్వమైన ఘట్టమన్నారు. అయ్యప్ప దీక్ష చాలా గొప్పదని, కులమత, ప్రాంత, వర్ణ, వర్గాలకు అతీతంగా ప్రతిఒక్కరూ మాలధరిస్తారని, అయ్యప్ప వారిలోనే కొలువై ఉంటారని అన్నారు. అయ్యప్ప విషయంలో కోర్టులు చెప్పినా వినేదిలేదని, హిందువుల పండుగలపై ఆంక్షలు విధించడం ప్రభుత్వానికి మంచిదికాదన్నారు. రెండు రాష్ర్టాల నుంచి శబరికి వెళ్లి ఓక్కి తుఫానులో చిక్కుకున్న అయ్యప్పస్వాములను ప్రభుత్వాలు సురక్షితంగా తీసుకువచ్చే ప్రయత్నం చేయాలన్నారు. పూజా కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆచారి, శబరిమల అయ్యప్ప సేవా సమాజం సెంట్రల్‌ ట్రస్టీ సభ్యుడు ఐతా రాములు, సమాజం రాష్ట్ర అధ్యక్షుడు ధనుంజయ, ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్‌, కోశాధికారి శ్రీనివాస్‌, కార్యనిర్వాహక కార్యదర్శి నాయిని బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.
Tags : Ayyappa, Ayyappa Swamy, Maha Vaibhava Padi Pooja
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.