హైదరాబాద్ నగరంలో శబరిమల..!
02-12-2017 12:01:03
  • ఆకట్టుకుంటున్న సెట్టింగ్‌లు
  • లక్షలు ఖర్చుచేసి అయ్యప్ప పడి పూజలు
అయ్యప్ప పడి పూజలతో నగరంలో ఆధ్యాత్మికత వెల్లివిరిస్తోంది. స్వాములు శబరిమలను పోలిన రీతిలో సెట్టింగులు వేయిస్తూ పూజా స్థలాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. వీటి కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
 
హైదరాబాద్: హరిహర సుతుడు, మణికంఠ దేవుడు శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజలు నిర్వహించేందుకు మాలధారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భారీ సెట్టింగ్‌లు వేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి ఆకుతోట శ్రీనివాస్‌ అలియాస్‌ వాసు కొన్నేళ్ళుగా ఈ సెట్టింగ్‌లను ఏర్పాటు చేస్తున్నాడు. ముఖ్యంగా ఎరుమేళిలోని వావర్‌ స్వామి ఆలయం, పంబా నదిని పోలిన తరహాలోనే సెట్టింగ్‌ను తయారు చేస్తున్నారు. శబరిగిరిలో హరిహరసుతుడు కొలువైన ప్రముఖ ఆలయంతో పాటు శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామిలకు సంబంధించిన కోవెలలను(గుడులను) అచ్చంగా కేరళలోని స్వామివారి ఆలయాల తరహాలోనే తీర్చిదిద్దుతున్నారు. స్వామి వారి ఊరేగింపునకు ఉపయోగించే పల్లకిల తయారీలో సైతం శ్రద్ధ చూపుతున్నారు. మణికంఠుడికి విశేష అభిషేకాలు నిర్వహించేందుకు గాను 18 కలశాలను ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు. అయ్యప్ప స్వామి వారి సెట్టింగ్‌కు ముందు రెండు వరుస క్రమాల్లో ఏర్పాటు చేస్తున్న దేవతామూర్తుల విగ్రహాలు చూడముచ్చటగా ఉంటున్నాయి. పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత ముందుగా భక్తులు దర్శించుకునే ధ్వజస్తంభం సైతం ఎంతో ప్రత్యేకంగా ఉంటోంది.
 
రూ. 60 వేల వరకూ ఖర్చు
అయ్యప్ప పడిపూజలకు సంబంధించిన సెట్టింగ్‌లను వేయడానికి గాను రూ. 50 వేల నుంచి 60 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో సెట్టింగ్‌ వేయడానికి సుమారు 5 గంటల సమయం పడుతుందని, ఇందుకు 12 మంది కార్మికులు శ్రమించాల్సి వస్తుందని నిర్వాహకుడు శ్రీనివాస్‌ అంటున్నారు.
Tags : Ayyappa, Sabarimalai
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.