ADVT
వివాదంలో అయ్యప్ప ‘హరివరాసనం’
27-11-2017 03:12:54
  • పాట రీరికార్డింగ్‌కు శబరిమల దేవస్థానం సంకల్పం
  • వద్దంటున్న దేవరాజన్‌ ట్రస్టు.. టీబీడీ నిర్ణయంపై ఆగ్రహం
‘‘హరివరాసనం విశ్వమోహనం/హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం’’ అయ్యప్ప స్వామిని తల్చుకోగానే మనకు తెలియకుండానే ఈ అష్టకం మనోఫలకాన్ని తాకుతుంది. దాదాపు తొమ్మిది దశాబ్దాల క్రితం నాటి ఈ పాటను సంగీత దర్శకుడు జీ. దేవరాజన్‌ స్వరబద్ధం చేయగా.. సుప్రసిద్ధ గాయకుడు కేజే ఏసుదాసు ఆలపించారు. తర్వాత విభిన్న స్వర రచనల్లో ఈ పాట వచ్చినప్పటికీ.. దేవరాజన్‌-ఏసుదాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ గీతాన్నే భక్తజనం విశేషంగా ఆదరిస్తూవస్తున్నారు. శబరిమలలో నిత్యం జరిగే స్వామివారి పవళింపు సేవలో కూడా ఏసుదాసు ఆలపించిన పాటనే వినిపించి జోలపుచ్చుతున్నారు.
 
అయితే.. వీనులవీందైన ‘హరివరాసనం’పై ఇప్పుడు తీవ్ర వివాదం నెలకొంది. 1920 నాటి హరివరాసనం మాతృకకు, ఏసుదాసు ఆలపించిన సాహిత్యం మధ్య కొన్ని తేడాలున్నాయని, అలాగే ఆలాపనలో కొన్ని ఉచ్చారణ దోషాలు దొర్లాయని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) అంటోంది. అష్టకం మాతృకలోని ప్రతిలైను చివర ‘స్వామి’ అనే పదం ఉంటుందని, స్వరబద్ధం పరంగా సౌలభ్యానికిగాను ఏసుదాసు ఆలపించిన పాటలో దీన్ని తొలగించారని బోర్డు చెబుతోంది.
 
ఈ నేపథ్యంలో మాతృకకు అనుగుణంగా ఏసుదాసుతో హరివరాసనాన్ని మళ్లీ పాడించాలని నిర్ణయించింది. అయితే బోర్డు నిర్ణయం వెనుక పెద్ద కుట్ర ఉందని కేరళలోని దేవరాజన్‌ మాస్టర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆరోపించింది. ఈ పాటలో మార్పులు చేయడాన్ని వ్యతిరేకించాలని కోరుతూ సోషల్‌ మీడియాలో ఉద్యమం లేవదీస్తామని స్పష్టం చేసింది.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.