ప్రదక్షిణ పరమార్థం..
22-11-2017 01:04:35
ప్రదక్షిణ ఎలా చేయాలి? ‘దక్షిణావర్తేన దేవముద్దిశ్య భ్రమణం’... అంటే దేవతామూర్తుల కుడివైపు నుంచి ప్రదక్షిణ మొదలుపెట్టాలి. దేవతామూర్తులకు, గోవులకు, జ్ఞానులకు, అశ్వత్థవృక్షానికి ప్రదక్షిణ చేయాలి. మనం దేవాలయాల్లో ప్రదక్షిణచేసే ఆచారం అనాదికాలం నుండి వస్తోంది. మన ఇతిహాసాల్లో, పురాణాల్లో ప్రదక్షిణ ప్రసక్తి చాలాచోట్ల ఉంటుంది. గణనాథుడు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసినట్లు శివపురాణం చెబుతోంది.
 
రఘువంశంలో దిలీపచక్రవర్తి నందినీధేనువుకు ప్రదక్షిణ చేయనందున అతనికి సంతానహీనత కలిగినట్లుంది. వాసుదేవుడు కార్తికేయునికి ప్రదక్షిణ చేసినట్లు శివపురాణం చెబుతోంది. ఆనాడు గౌతమబుద్ధుడి చితి చుట్టూ ఆయన శిష్యులు 5 వేల మంది ప్రదక్షిణ చేసినట్లు చరిత్రపుటలలో కనిపిస్తోంది. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఎనిమిది తత్త్వాలు భగవంతుని ఎనిమిది ప్రకృతులని భగవద్గీత చెబుతోంది.
 
ఈ అష్టప్రకృతులనే యోగులు అష్టచక్రాలుగా, అష్టకమలాలుగా అభివర్ణించారు. జీవుడిని ఒక హంసగా వర్ణించి, అది ఈ ఎనిమిది కమలాల చుట్టూ ప్రదక్షిణచేసి, చివరకు సుషుప్తిలో హృత్కమలమందు లీనమవుతుందన్నారు. సుషుప్తియందు పరమాత్మవల్ల తుష్టి పొందినందునే ప్రతి జీవికీ జీవనం.
 
ఈ ప్రదక్షిణ ఆగిపోతే అది మృత్యువే. శ్రీ శంకరాచార్యులు ‘‘సంచారః పదయోః ప్రదక్షణవిధిః’ అన్నారు. పాదాలచే సంచరించటం ప్రదక్షిణ విధి. శ్రవణ, మనన, నిదిధ్యాసనలను (అదే పనిగా తలచుకోవడం) అవలంబించి సద్గురువులవల్ల మరల మరల ఆత్మవిచారం చేయటమే ఆత్మ ప్రదక్షిణం. ప్రదక్షిణ అంటే తిరగటంకాదు. ‘ప్ర’ అంటె ప్రకృష్టమైన - శ్రేష్ఠమైన, దక్షిణ అంటే కుడి. నామ అంటే ఎడమ. కుడి అనేది ఆత్మకు సంకేతం, ఎడమ అనేది అనాత్మకు సంకేతం. గురూపదేశంవల్ల అనాత్మను నిషేధించి ఆత్మ స్వరూపంగా మిగలడమే అసలైన ఆత్మ ప్రదక్షిణ. ప్రదక్షిణ అంటేనిశ్చలతత్త్వమైన నిర్విశేషాత్మయే. అందుకే మండలబ్రాహ్మణం ‘నిశ్చలత్వం ప్రదక్షిణం’ అన్నది.
 
-స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.