కలశ రహస్యం
20-11-2017 03:14:32
దైవకార్యాలన్నింటిలోను మొదటగా కలశ స్థాపన ఉంటుంది. చాలా మందికి ఈ కలశ స్థాపన ఎందుకు చేయాలి అనే విషయం తెలియదు. సంప్రదాయం ప్రకారం చేయాలి కాబట్టి అన్నట్లు చేస్తూ ఉంటారు. అసలు దీని వెనకున్న రహస్యమేమిటో తెలుసుకుందాం..
 
చేస్తున్న కార్యక్రమం ఆధారంగా కలశ స్థాపనలు రకరకాలుగా ఉంటాయి. సాధారణంగా ఏ కార్యానికైనా ముందు పుణ్యాహవాచనం చేసుకోవటానికి కలశం పెడతారు. ఆ కలశంలోని జలాన్ని శుద్ధి కోసం ప్రోక్షిస్తారు. అంటే కార్యక్రమంలో ఉపయోగించే ద్రవ్యాలను శుద్ధి చేయటం దీని పని. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మనలో ఉన్న ప్రతికూల ఆలోచనలను శుద్ధి చేయటమే. ఇక మరి కొన్ని చోట్ల ఒక దేవతను ఆవాహనం చేసి.. ఆమె సన్నిధిలో ఒక సంకల్పిత కార్యాన్ని చేయటానికి కలశం పెడతారు. అంటే ఆ కలశానికి ఒక అధిదేవత ఉంటుంది.
 
ఆ కలశాన్ని- 3, 5, 9, 11, 16- ఇలా చేస్తున్న కార్యం ఆధారంగా ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఉంచుతారు. చివరకు ఆ దేవతకు ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ కలశాన్ని తీస్తారు. కొన్ని చోట్ల కొన్ని ద్రవ్యాలను ఆవాహన చేసి, వాటి పోషణకు సోమకుంభాన్ని స్థాపిస్తారు. దాని రక్షణకు మరో కలశాన్ని స్థాపిస్తారు.
 
అయితే ఇలాగ చేసినప్పుడు కలశం ఉన్నన్ని రోజులు ఆవాహన చేసిన దేవతను శ్రద్ధగా ఆరాధించాలి. చివరకు దానికి ఉద్వాసన చెప్పాలి. ఇప్పుడు కలశాన్ని స్థాపించటం వెనకున్న మరో కోణాన్ని చూద్దాం. ఈ కలశం మన హృదయానికి ప్రతీక. హృదయంలో ప్రేమను నింపి దానిలో భగవానుని దర్శించాలి. హృదయమే ఒక కుండైతే దానిలో నీరే ప్రేమ. దీనిపై పెట్టే మామిడి ఆకులే పచ్చని కంఠసీమ. మన కంఠమునకు భగవన్నామం వల్లే పచ్చదనమొస్తుంది.
 
ఈ ఆకులపై ఉంచే నారికేళం మన శిరస్సు. దీనిలో ఉండే తెల్లని గుజ్జు సాత్విక శ్రద్ధ. దానిలో ఉండే తీయని నీరే జ్ఞానజలం. ఇదంతా కలిస్తేనే పరమభక్తి. ఏ పూజకైనా ఈ భావన ఉంటే ఆ కార్యం నిజంగా ఫలిస్తుంది. అయితే దీనిని ప్రతి రోజూ కొనసాగించటం కష్టమే! అందుకే ఆలయాలలో కూడా కొన్ని రోజులు మాత్రమే కలశాన్ని ఉంచుతారు. - త్రిదండి చిన జీయర్‌ స్వామి
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.