ఆ 6 రోజులే కిరణాలెందుకు?
20-11-2017 00:17:27
అది ఆదిత్యుడి గుడి! సంవత్సరానికి 365 రోజులున్నా.. ఆ గుడిలో ఏటా సంవత్సరంలో రెండుసార్లు.. మూడు రోజుల్లో ఒకసారి చొప్పున.. ప్రాతఃకాలాన గాలిగోపురాన్ని దాటి.. ధ్వజస్తంభాన్ని తాకుతూ.. గర్భాలయంలోని మూలవిరాట్టుపై సూర్యకిరణాలు పడతాయి. అప్పుడే ఎందుకు పడతాయి?
 
క్రమం తప్పదు...
దేశ తూర్పు తీరంలో ఉన్న మూడు సూర్యదేవాలయాల్లో.. తెలుగునాట ఉన్న క్షేత్రం అరసవల్లి. శ్రీకాకుళం పట్టణ సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని కళింగరాజు దేవేంద్ర వర్మ క్రీ.శ. 673వ సంవత్సరంలో నిర్మించాడు. ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11 తేదీల్లో ఒకసారి... అక్టోబరు 1, 2, 3 తేదీల్లో మరొకసారి అరసవల్లిలో సూర్య దేవుడిని భానుడి కిరణాలు తాకుతాయి. ఉదయం 6 గంటలకు గాలి గోపురం మీదుగా వచ్చే కిరణాలు.... అనివెట్టి మండపం, ధ్వజస్తంభాన్ని తాకుతూ మూల విరాట్‌పై ప్రసరిస్తాయి. ‘అరుణ శిల’తో చెక్కిన విగ్రహం... సూర్య కిరణాలు పడగానే బంగారు ఛాయలో మెరుస్తుంది.
 
వింతల ప్రసరణ...
సూర్యుడికి నీడతో అవినాభావ సంబంధం. ఏదీ ఎదురు కానంత వరకే... సూర్యుడి కిరణ ప్రయాణం! ఏదైనా అడ్డు వచ్చిందంటే... దాని నీడే నేలపై కనిపిస్తుంది. అరసవల్లిలో దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. గాలి గోపురం నుంచి మూలవిరాట్టుకు మధ్య దూరం 306 అడుగులు! మధ్యలో... అనివెట్టి మండపం, ధ్వజస్తంభం, బేడా మండపం, అంతరాలయాలను దాటుకుని గర్భాలయంలోకి సూర్య కిరణాలు కనిపిస్తాయి. విచిత్రమేమిటంటే... ఆయా మండపాల తలుపులు మూసినప్పటికీ సూర్య కిరణాలు లోపలికి వస్తాయని చెబుతారు. ఆకాశం మేఘావృతమైతే తప్ప... ప్రతిఏటా రెండుసార్లు సూర్య నారాయణుడి విగ్రహాన్ని కిరణాలు తాకడం విశేషం.
 
సౌరగమనమే కీలకం..
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. పడమట అస్తమిస్తాడు! అయితే, ఈ ‘ఉదయ-అస్తమయాలు’ ఒకే పాయింట్‌ నుంచి జరగవు. కాలానుగుణం గా మారుతాయి. దీనిని బట్టి సూర్యుడి గమనం ఉంటుంది. ఈ సౌర గమనాన్ని గమనిస్తూ, ఏటా మార్చి 9, 10, 11 తేదీల్లో... అక్టోబరు 1, 2, 3 తేదీ ల్లో మరోసారి సూర్యకిరణాలు తాకేచోటును గుర్తించి అక్కడే ఆలయం ని ర్మించి, మూలవిరాట్టును కొలువుదీర్చినట్లు అర్థమవుతుంది.
 
-అరసవల్లి
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.