విషాదం తొలగితే విజ్ఞానం
18-11-2017 02:24:19
ఈ విశ్వం ఒక వేదిక. దీనిని మనుగడకు వాడుకుంటే మమతానురాగాలు పంచుతుంది. రాగద్వేషాలతో వ్యవహరిస్తే రణరంగంలా మారుతుంది. కౌరవుల రాక్షసత్వంతో ధర్మక్షేత్రం రణక్షేత్రంగా మారింది. యుద్ధం అనివార్యమైంది. కురుక్షేత్రంలో ప్రవేశించిన అర్జునుడిలో విషాదం అలముకుంది.
 
విషాదం అంటే ఏడుపు కాదు. లోలోపల ఏదో చెప్పుకోలేని వ్యధ. భరించలేని బాధ. ప్రాణాలకు సైతం తెగించి యుద్ధానికి సిద్ధపడిన అర్జునుడిలో ఎందుకు ఈ విషాదం పుట్టింది? ఇతరులతో పంచుకోలేక, స్వయంగా బయటపడటం చేతగాక తనలో తానే కుమిలిపోవడమే ఈ విషాదానికి అసలు కారణం.
 
ఈ సమస్య కేవలం అర్జునుడిదిమాత్రమే కాదు. సమాజంలో చాలామంది మానసిక సంఘర్షణలతో కొట్టుమిట్టాడుతుంటారు. విషాదాన్ని భరించలేని కొందరు మానసిక శక్తిని కోల్పోయి ప్రాణత్యాగానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి విషమ స్థితి ఎదురైనప్పుడే సరైన గురువు సన్నిధి కావాలి. గురువు ద్వారా ఆధ్యాత్మిక శక్తిని సాధించినప్పుడే ఆత్మవిశ్వాసంతో వ్యక్తి యథాస్థితిని పొందుతాడు.
 
సరిగ్గా అర్జునుడి పరిస్థితి కూడా ఇంతే. కొంతకాలం వనవాసం, ఆ తర్వాత అజ్ఞాతవాసం, చివరకు రణరంగంలో పోరాటం. ఇదంతా ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతోంది? దీన్నుంచి ఎలా బయటపడాలి? ఈ సంఘర్షణలోంచి పుట్టిందే విషాదం. ఈ సందిగ్ధత తొలగి విషాదం నుంచి బయటపడాలంటే విజ్ఞానం కావాలి. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించాడు. విశ్వమానవ శ్రేయస్సు కోసం అర్జునుణ్ని నిమిత్తంగా చేసుకుని జీవన విధానం, జీవిత లక్ష్యమనే రెండు సూత్రాలతో కూడిన సిద్ధాంతాన్ని సర్వమానవాళికి ఉపదేశించాడు.
 
-స్వామి పరిపూర్ణానంద
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.