ADVT
భగవంతుడు భక్తులకు భక్తుడు!
17-11-2017 02:20:54
కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు, అభిమానధనుడు, పరవైరాగ్య సంపన్నుడు, జితేంద్రియుడు, శాంత మనస్కుడు. అన్నిటినీ మించి.. పరమ ధార్మికుడు, జ్ఞాన భక్తుడు. కానీ, ప్రారబ్ధం కొద్దీ దరిద్రుడయ్యాడు. అయినా, తన పేదరికానికి ఏనాడూ బాధపడలేదు. ధర్మం తప్పలేదు. ఇదే అసిధారా వ్రతం! దినమంతా భగవద్‌ భాగవత సేవ, అయాచక వ్రతపాలన - ఎవరినీ అర్థించక దొరికిన దానితో తృప్తిపడుతూ ఏదో విధాన కుటుంబ పోషణ చేస్తూ ఉన్నాడు.
 
వృద్ధాప్యంలో ఒక రోజున భార్య పోరుపెట్టగా, ఆమె అర్థించి తెచ్చిన నాల్గు గుప్పిళ్ల అటుకులు తీసుకొని ద్వారకకు వచ్చాడు. భగవంతుణ్ని దర్శించి వెళ్దామని వచ్చాడే కాని అడిగి స్వీకరించి వెళ్దామని రాలేదు. స్వామి వైభవం, సంపద చూసి సిగ్గుపడి తెచ్చిన అటుకులు కూడా అర్పించ లేకపోయాడు. కుచేలుని దీనస్థితి చూసి భగవంతుని కళ్లు చెమర్చినై. కుచేలుడు సమర్పించడానికి వచ్చాడే గాని సంగ్రహించి పోవడానికి రాలేదని భగవంతునికీ తెలుసు. జీవుడు నిష్కాముడైతే భగవంతుడు జీవుణ్ణి పూజిస్తాడు. ఇది ఆయన స్వభావం! ‘భగవాన్‌ భక్త భక్తిమాన్‌’.. భగవంతుడు భక్తులకు భక్తుడు అంటుంది భాగవతం.
 
అందుకే కృష్ణుడు కుచేలునికి బ్రహ్మరథం పట్టాడు. తన ఈశ్వరత్వం కూడా మరచి పరిష్వంగాలు, పాద సంవహన గోదానాదుల ద్వారా భక్తుని సేవలో తరించాడు! కుచేలుని దారిద్య్రం.. దానమివ్వని దోషఫలం. ‘అదాన దోషేణ భవేత్‌ దరిద్రః..’ ఉన్నంతలోనే దానధర్మాలు చేసుకోవాలి. దరిద్రునికి ఇచ్చిన దానం, శూన్యలింగానికి చేసిన పూజ, అనాథ ప్రేతకు జరిపించిన సంస్కారం కోటి యజ్ఞ ఫలం కల్గిస్తుందని ధర్మశాస్త్రం. అందుకే కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ- ‘కుచేలా! నాకు ఏమి కానుక తెచ్చావు? అది స్వల్పమైనా పదివేలుగా స్వీకరిస్తా. భక్తిహీనుడు మేరు పర్వతమంత ధనమిచ్చానా నేను సంతసించను. భక్తితో ఆకుగాని, పువ్వుగాని, పండుగాని, చివరకు జలం సమర్పించినా స్వీకరిస్తా’నని అన్నాడు. భగవద్గీతలోని ‘పత్రం, పుష్పం, ఫలం, తోయం..’ అనే శ్లోకాన్ని యథాతథంగా ఇక్కడ కూర్చాడు వ్యాసమహర్షి. భక్తుని ప్రారబ్ధ కర్మని క్షయింప చేయడానికి పరమాత్మ తానే అటుకులు తీసుకుని ఆప్యాయంగా ఆరగించాడు. బ్రహ్మదేవుడు కుచేలుని నుదుట ‘శ్రీక్షయః’ (దరిద్ర దేవత వరించుగాక) అని రాస్తే.. శ్రీకృష్ణుడు అతని ఫాలదేశంలో తిలకం దిద్దుతూ విధిరాతను చెరిపి.. ‘యక్షశ్రీః’ (కుబేరుని వంటి సంపద కల్గుగాక) అని తిరగవ్రాశాడు.
 
‘అనేక విశ్వాత్మా తృప్యతామ్‌’- సకల ప్రపంచానికి అన్నదానం చేసిన ఫలం కల్గించాడు. కుచేలుని అటుకులు ప్రేమ రసార్ర్దాలు. భగవంతుడు తప్ప అంత అవ్యాజంగా ప్రేమించి, అభిమానించి అనుగ్రహించేవాడుంటాడా? ఎవడికి ఇచ్చినా పుచ్చుకునే వానికి తెలియకుండా ఇవ్వడం భగవంతుని వ్యవహారశైలి! కుచేలుని సేవ ద్వారా కృష్ణుడు - ‘జ్ఞాన భక్తుడు నాకు ఆత్మస్వరూపుడే!’ అన్న తన గీతా వాక్యాన్ని లోకానికి నిరూపించి చూపాడు.
 
 తంగిరాల రాజేంద్ర ప్రసాద్‌ శర్మ

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.