అదే నిజమైన పాండిత్యం!
16-11-2017 23:04:37
పద్యంతో వైద్యంలో భాగంగా అత్యాశకు మందు వేస్తున్నాం. అత్యాశకు మందు వేసుకోవడానికి భౌతికంగా తీసుకోవలసిన చర్య ఒకటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఆదాయానికి మించి ఖర్చు పెట్టొద్దు. అప్పు కూడా తీసుకోవద్దు అది బ్యాంక్‌ లోనైనా సరే! ఇవ్వాళ అప్పు అభివృద్ధికి చిహ్నం అని ప్రచారం చేస్తున్నారు. అది చాలా దుర్మార్గం. వందల కోట్ల టర్నోవర్‌ ఉన్న సంస్థలు కొన్ని ఉంటాయి. అవి కొత్త విభాగం పెట్టడానికి డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకు లోన్‌ తీసుకుంటాయి. దాని ప్రయోజనాలు వేరు. దాని నష్టాలు, కుదుపులు ఒడుదొడుకులు వేరు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. బ్యాంకు లోన్‌ పెట్టి ఏదీ కొనకూడదు. డబ్బులు ఉంటే కొనుక్కోవాలి లేదా మానేయాలి. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెబుతాడు ఆ విషయాన్ని.
 
అయమేవ పరోధర్మః, ఇయమేవ విదగ్ధత!
ఇదమేవ హి పాండిత్యం, యదాయాన్నాధికోవ్యయః!!
వ్యక్తులకు ఇది బాగా వర్తిస్తుంది. రాజ్యం విషయంలో ఒక్కోసారి అప్పు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ నేడు ఉద్యోగాలు చేసే వాళ్లే కాదు, విద్యార్థులు సైతం బ్యాంక్‌ లోన్‌ తీసుకుని చదువుకుంటున్నారు. ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకుంటే దాన్ని చదువు కోసమే వాడుతున్నారా? ప్రతి రూపాయి సద్వినియోగం అవుతోందా? చిత్తానికే తెలియాలి! అందుకే కౌటిల్యుడు ‘‘ఇంతకు మించిన ధర్మం లేదు. ఇంతకు మించి తెలివి లేదు. అదే నిజమైన పాండిత్యం. అదేమిటంటే, ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టకపోవడమే!’’ అంటాడు.
 
ఈ రోజు మధ్యతరగతి వాళ్ల ఆదాయం కూడా నెలకు నలభై, యాభై వేలు ఉంటోంది. వాళ్లు బడ్జెట్‌ ప్రణాళిక వేసుకోలేరా? వాయిదాల పద్ధతిలో వస్తోందని ఎందుకు కొనాలి? నిజంగా ఆ వస్తువు అవసరమా? కొన్నాళ్లు పోతే ఆ వస్తువు అవసరమే లేకపోవచ్చేమో! బ్యాంకుల్లో లోను తీసుకున్న వాళ్ళు, వాయుదాల పద్ధతిలో వస్తువులు కొన్న వాళ్లు జీతం వచ్చిన రోజున హాయిగా ఉంటున్నారా? జీతం వచ్చిన ఆనందం వారిలో ఉంటోందా? వాటివల్ల అన్ని వాయిదాలతో పాటు సంసారంలో సుఖం కూడా వాయుదా పడుతోంది. ఉన్న డబ్బులను ప్రణాళికాబద్ధంగా వ్యయం చేసుకోగలిగితే చాలు. అత్యాశలకు పోకుండా ఉంటే అలా చేసుకోవచ్చు. డబ్బు ఉన్న వాళ్ల ఆనందం దేనిమీద ఆధారపడి ఉంటుంది? భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణ కవి ఇలా చెబుతాడు.
 
‘‘దానము భోగము నాశము
పూనికతో భువి ధనమునకున్‌ 
దానము భోగమునందని
దీనుని ధనమునకు
గతి తృతీయమే పొసగున్‌’’
 
ఎప్పుడూ ధనానికి మూడు స్థితులుంటాయి. అవి దానము, భోగము, నాశము. నువ్వు ధనవంతునివి కాబట్టి ముందు నువ్వు అనుభవించు. పది మందికి పెట్టు. హాయిగా భోగాలన్నీ అనుభవించు. పండుగ పేరుతో పదిమందిని పిలిచి పెట్టు.
 
‘‘హరిభుక్తము ఆత్మభార్య భక్తినిడ భుక్తికొనుచున్‌ ముక్తిగాని
నిదురయును గాదు రాతివంటిదియు గాదు’’
 
అంటాడు పాండురంగమహత్యంలో తెనాలి రామకృష్ణుడు. అన్నీ చేస్తూనే ఉండాలి. ఏదీ చేతికి అంటుకోకూడదు. అందుచేత భోగాలన్నీ అనుభవించాలి. భోగాలన్నీ భగవంతుడు ఇచ్చినవే అనుకోవాలి. ఎవరు ఆకలితో బాధపడుతున్నా, ఎవరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా వారిని విష్ణు స్వరూపాలుగా భావించి ఆదుకోవాలి. అలా ఆదుకోవడానికి కొంత, భోగాలకు కొంత ఖర్చుపెట్టాలి. నలుగురికీ పెట్టాలి, నువ్వూ తినాలి. అలా కాకుండా నిదురపోవడం, రాయిలా ఉండటం ముక్తి కాదు. కనీసం ఆదాయంలో నాలుగో వంతు దానం చేయమని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆ నాలుగో వంతు దానం చేస్తే మనకు నాలుగు వందల రెట్లు కలుస్తుంది. ఇవన్నీ చేయని పిసినిగొట్టువాడి ధనం నాశనం కావడం ఖాయం. ఆ స్థితి మన ధనానికి, మనకు పట్టకుండా చూసుకోవాలి.
 డా. గరికిపాటి నరసింహారావు
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.