ADVT
అయ్యప్ప దీక్షకు జ్వరం
15-11-2017 02:54:59
  • మాలధారణకు సీజనల్‌ ఎఫెక్ట్‌
  • జ్వరం నుంచి కోలుకోని గ్రామాలు
  • అనారోగ్యానికి తోడైన ఆర్థిక ఇబ్బందులు
రెండుపూట్లా చన్నీటి స్నానం చేయలేక ఈసారి భారీగా తగ్గిన దీక్షధారుల సంఖ్య
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం అగ్రహారంలో గతేడాది 40మంది భక్తులు అయ్యప్ప మాల వేసుకోగా ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక్కరు కూడా దీక్ష తీసుకోలేదు.
 
బల్లికురవ మండలం సూరేపల్లిలో కూడా గత సంవత్సరం 50మంది వరకు మాల ధరించగా ఈ ఏడాది దీక్ష తీసుకున్నవారు 10మంది కంటే తక్కువే.
 
తాళ్లూరు మండలం లక్కవరంలో నిరుడు 60మంది దీక్ష తీసుకోగా ప్రస్తుతం ఈ సంఖ్య 15కు పడిపోయింది.
 
అద్దంకి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): సీజనల్‌ వ్యాధుల ప్రభావం అయ్యప్ప దీక్ష తీసుకునే భక్తులపై పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా దీక్షాధారులు ఈ ఏడాది బాగా తగ్గారు. అద్దంకి ప్రాంతంలో ఉన్న పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. విష జ్వరాలు, డెంగ్యూ దెబ్బకు జిల్లాలోని అనేక గ్రామాలు ఇప్పటికీ కోలుకోలేదు. రోగాలతో మంచం పట్టిన గ్రామాల్లో ప్రస్తుతం దీక్ష తీసుకున్న భక్తులు సంఖ్య అతి తక్కువగా ఉంది. ఉమామహేశ్వరపురంలో ఈ ఏడాది సుమారు 500మంది విష జ్వరాలు, డెంగ్యూ బారినపడ్డారు. 14మంది వరకూ మృతి చెందారు. వైద్యంకోసం కొన్ని కుటుంబాలకు రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకూ ఖర్చయింది.
 
ఇక లక్కవరంలో కూడా 2వేల మంది జ్వరాల బారిన పడగా, ఏడుగురు మృతిచెందారు. దీంతో అయ్యప్ప దీక్ష తీసుకునేందుకు ఆయా గ్రామాల ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. అద్దంకిలోని పలువురు గురుస్వాముల వద్ద సుమారు 3వేల మంది వరకు మాలధారణ చేస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఈ సంఖ్య 1700కు మించి ఉండదని అంచనా. మకర జ్యోతికి వెళ్లే భక్తుల మాలధారణకు డిసెంబరు 1వరకు సమయం ఉన్నందున మరో వందమంది వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక అద్దంకిలో మూడుచోట్ల నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ఏటా 1500మంది వరకు హాజరవుతుండగా ఈ ఏడాది ఆ సంఖ్య వెయ్యి లోపుగానే ఉంది.
 
దీక్షధారులు తగ్గారు
అద్దంకి ప్రాంతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అయ్యప్ప మాలధారుల సంఖ్య తగ్గింది. జ్వరాల బారిన పడిన అనేకమంది ఇంకా కోలుకోలేదు. మాలధారణ చేస్తే ఉదయం, సాయంత్రం చల్లటి నీటితోనే స్నానం చేయాల్సి ఉంటుంది. గత ఏడాది వెయ్యి మందికి దీక్ష ఇవ్వగా, ఈ ఏడాది ఇప్పటికి 600 మందికి మాత్రమే మాల వేశాను.
- మౌలాలి, గురుస్వామి, అద్దంకి
 
ఆరోగ్యం సహకరించకే...
నేను గత పదేళ్లుగా అయ్యప్ప దీక్ష తీసుకొని శబరిమలై వెళ్తున్నాను. ఇటీవల గ్రామంలో విజృంభించిన విషజ్వరాలు చాలా కుటుంబాలను కోలుకోలేని దెబ్బతీశాయి. ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలతో ఈ ఏడాది గ్రామంలో ఎవరూ దీక్ష తీసుకోలేదు.
- దేవినేని కోటేశ్వరరావు, ఉమామహేశ్వరపుర అగ్రహారం
Tags : Ayyappa, Fever

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.