ADVT
శబరిమలలో ‘స్వచ్ఛ ఘోష’
07-11-2017 01:02:07
  • పంబ నుంచి సన్నిధానం వరకూ వాటర్‌ బాటిళ్లపై నిషేధం..
  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ శబరిమల’ ఉద్యమం
అయ్యప్ప భక్తులు శరణుఘోషతో వడివడిగా అడుగులువేస్తూ శబరిమలకు చేరుకుంటారు. శబరిగిరీశుని దర్శనంతో పులకిస్తారు. అయితే తిరిగి పంబకు చేరిన తర్వాత వెనుతిరిగి ఓసారి సన్నిధానం వైపు చూస్తున్నారా? శరణుఘోషతో మణికంఠుడిని దర్శించే భక్తులు.. అయ్యప్ప సాక్షిగా ‘స్వచ్ఛ ఘోష’ చేయాల్సిన సమయమిది! పంబ నుంచి సన్నిధానం వరకూ వాటర్‌ బాటిళ్లపై నిషేధం విధించిన నేపథ్యంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు దరిచేరకుండా శబరిగిరులను కాపాడుకోవాల్సిన తరుణమిది! పరిశుభ్రతే పరమాత్మ అని నమ్ముతూ ‘స్వచ్ఛ శబరిమల’ ఉద్యమానికి ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ పిలుపునిస్తోంది.
 
మాలధారణం..నియమాల తోరణం అంటూ కోట్లాది స్వాములు అయ్యప్పను కొలుస్తారు. భూతల శయనం.. శీతల స్నానంవంటి కఠిన నియమాలతో మణికంఠుడిని కొలుస్తారు. నలభై రోజుల దీక్ష పూర్తిచేసి..మణికంఠుడి దివ్య దర్శనం కోసం శబరియాత్రకు సిద్ధమవుతారు. ఏటా కోట్లాది భక్తులతో శబరిగిరులు కిక్కిరిసిపోతున్నాయి. అంతేస్థాయిలో శబరిమల రిజర్వు ఫారె్‌స్టలో కాలుష్యం కూడా పెరుగుతోంది. దీంతో ఐదేళ్ల క్రితం కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. శబరిమలలో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లపై నిషేధం విధించింది. శబరిమలలో గత ఏడాది నుంచి ఈ ఉత్తర్వులు కఠినంగా అమలవుతున్నాయి. ఏటా అయ్యప్ప దర్శనం కోసం కోట్లాది తెలుగు భక్తులు శబరియాత్ర చేపడతారు. ఎరుమేలి, పంబ, సన్నిధానం..ఇలా శబరియాత్ర పొడవునా ప్లాస్టిక్‌పై నిషేధం అమలులోవున్న విషయాన్ని స్వాములు గుర్తించాలి. అందుకే గ్రామగ్రామానా తెలుగు భక్తులతో స్వచ్ఛ శబరిమలకు ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంకల్పం చేయిస్తోంది.
 
ప్లాస్టిక్‌ వాడితే జరిమానా
అందమైన అడవులు.. జలపాతాల హోరుతో శబరిగిరులు కనువిందు చేస్తాయి. ఇక్కడి రిజర్వు ఫారెస్టు అరుదైన వన్యప్రాణాలకు, వనమూలికలకు నిలయం. ‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’లో అమూల్యమైన ప్రకృతి సంపదను కాపాడటానికి కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ట్రావెన్‌కోర్‌ దేవస్థానం పర్యావరణ చట్టాలను ఖచ్చితంగా అమలుచేస్తోంది. సన్నిధానానికి ఎవ్వరూ ప్లాస్టిక్‌ వాటర్‌బాటిళ్లు తీసుకురావడానికి వీలులేదు. ఏ భక్తుడైనా ప్లాస్టిక్‌ వస్తువులతో కనిపిస్తే దేవస్థానం సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తారు. జరిమానాతోబాటు జైలుశిక్ష విధించే అవకాశం కూడా ఉంది. పెద్దపాదం, చిన్నపాదం ఇలా అన్ని దారుల్లోనూ ట్రావెన్‌కోర్‌ దేవస్థానమే సురక్షిత నీటిని అందిస్తోంది. పంబ, సన్నిధానాల దగ్గర అనేక స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవారు. సంకల్పం మంచిదైనా, కొండను ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నింపేస్తున్నారన్న భావనతో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం అన్నదానాలపై నిషేధం విధించింది. దీంతో చాలా ఏళ్లపాటు అన్నదానం నిర్వహించిన వ్యక్తులు, సంస్థలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అయినా దేవస్థానం వాదనతోనే కోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలో పంబ, సన్నిధానాల దగ్గర స్వాముల కోసం ట్రావెన్‌కోర్‌ వర్గాలే అన్నదానం నిర్వహిస్తున్నాయి.
 
‘స్వచ్ఛ శబరిమల’ కోసం యాక్షన్‌ప్లాన్‌
శబరిమల పరిత్రత, పరిశుభ్రతను కాపాడటానికి ట్రావెన్‌కోర్‌ దేవస్థానం యాక్షన్‌ప్లాన్‌ తయారుచేసింది. పవిత్ర పంబాతీరం కాలుష్యమయం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ‘స్వచ్ఛ పంబ’ చర్యల్లో భాగంగా ఘాట్లను విస్తరించి ఒకేసారి వందలాది స్వాములు పుణ్య స్నానాలు చేయడానికి ఏర్పాట్లు చేసింది. సన్నిధానంలో అయ్యప్పను దర్శించి పంబ దగ్గర దీక్షను విరమించే భక్తులు ఇకపై నిబంధనలు పాటించాల్సివుంటుందని స్పష్టం చేస్తోంది. తమ మాలలు, నల్ల దుస్తులు, వ్యర్థాలు ఇకపై పంబలో వేయడానికి వీలులేదు. శబరిమలను పరిశుభ్రంగా ఉంచే చర్యల్లో భాగంగా మాజీ సైనికులు కూడా రంగంలోకి దిగారు. స్వచ్ఛ శబరిమల కోసం మాజీ సైనికోద్యోగులను కాంట్రాక్టు పద్ధతిలో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం నియమిస్తోంది.
 
‘స్వచ్ఛ శబరిమల’ కోసం ఆంధ్రజ్యోతి పిలుపు
స్వచ్ఛ శబరిమల స్ఫూర్తిని కాపాడాలని ఆంధ్రజ్యోతి పిలుపునిస్తోంది. శబరిగిరుల్లో పర్యావరణ పరిరక్షణకు నినదిస్తోంది. తెలుగురాష్ట్రాల్లో గ్రామగ్రామానా శబరియాత్రకు బయలుదేరుతున్న భక్తులకు, గురుస్వాములకు అవగాహన కల్గిస్తోంది. పంబ, సన్నిధానాలను పరిశుభ్రంగా ఉంచాలనీ, ప్లాస్టిక్‌రహిత శబరిమలకు సహకరించాలని చైతన్యపరుస్తోంది. ఇది కార్తీకమాసం. ఈ పుణ్యకాలంలో భక్తికి పరిశుభ్రతను జోడిస్తే మనస్సు పంబా తీరంలా ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛ శబరిమలతోనే యాత్ర పరిపూర్ణమవుతుంది.
 
సెలబ్రిటీలతో ప్రచారం
స్వచ్ఛ శబరిమలను ఉద్యమంగా తీసుకువెళ్తున్నారు. కేరళలోని వివిధ రైల్వేస్టేషన్లలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి స్వాములకు స్వచ్ఛతపై అవగాహన కల్గిస్తున్నారు. పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు జారీచేస్తున్నారు. శబరిమలను పరిశుభ్రంగా ఉంచాలని సినీతారలతో కూడా ప్రచారం చేస్తున్నారు.
Tags : Ayyappa, Sabarimalai, CAMPAIGN

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.