ADVT
ప్రశ్నించడమే తప్పా..!: ప్రకాశ్‌రాజ్
29-10-2017 01:31:57
మారుమూల కేరళలో మలయాళ సినిమా షూటింగ్‌లో గడిపిన ప్రకాశ్‌రాజ్‌... చాలా రోజుల తరువాత హైదరాబాద్‌కు చేరుకున్నారు. వరుస నైట్‌ షూటింగులతో ముప్ఫై ఆరు గంటలుగా నిద్ర లేదు. శారీరకంగా అలసట. మరోపక్క రాజకీయవాదులు, సోషల్‌ మీడియాలో వేధిస్తున్న ట్రాలర్లతో అలుపెరుగని మానసిక, సైద్ధాంతిక పోరాటం. ఆగకుండా ఫోన్‌ కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లోనే వాటిని మధ్య మధ్య గమనిస్తూ... నిద్ర లేక మండుతున్న కళ్ళను అరచేతితో అద్దుకుంటూ... ఆపకుండా సిగరెట్లు ముట్టిస్తూ... ఆరగారగ మంచినీళ్ళు, టీ తాగుతూ... ఆ సంధ్యా సమయంలో... ప్రకాశ్‌రాజ్‌ చాలా రోజుల తరువాత తన అంతరంగాన్ని స్వేచ్ఛగా, ఆత్మీయంగా ‘నవ్య’తో పంచుకున్నారు. ఆవేశం, ఆవేదన, ఆగ్రహం, హాస్యం కలగలసిన రెండున్నర గంటల సుదీర్ఘ సంభాషణ నుంచి ముఖ్యాంశాలు...     
 
బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు!
ముప్ఫై ఆరు గంటలుగా నిద్ర లేదు. వరుసగా రాత్రి షూటింగులు. కొద్ది గంటల క్రితమే హైదరాబాద్‌ వచ్చా.
 
మీ వ్యాఖ్యలతో చాలామందికి నిద్ర లేనట్లుంది!
(నవ్వేస్తూ...) అది నిద్రపోని వాళ్ళ సమస్య. నాది కాదు.
 
ఉన్నట్టుండి ప్రధాని మోదీపై విరుచుకుపడుతున్నారు?
ఉన్నట్టుండి కాదు.. మోదీ దేశప్రధాని. ఓటేసినవాళ్ళకూ, వేయనివాళ్ళకూ ప్రజాస్వామ్యంలో ఆయనే ప్రధాని. మరి దేశంలో కల్బుర్గి, పన్సారే, దాభోల్కర్‌, తాజాగా గౌరీలంకేశ్‌ లాంటి మేధావులు వరుసగా హత్యలవుతుంటే, ఆయన మౌనంగా ఉంటే ఎలా? మా గురువు లంకేశ్‌ గారి కుమార్తె గౌరిని ఎవరు చంపారో తెలీదు కానీ, కళ్ళెదుటే ఆ హత్యను సెలబ్రేట్‌ చేసుకుంటున్నవాళ్ళు తెలుసు. పైగా, వారిని సోషల్‌ మీడియాలో మన ప్రధాని ఫాలో అవుతున్నారు. ఆ మౌనంతో ఇలాంటి శక్తులు ఇంకా విజృంభిస్తాయని భయం వేసింది. అందుకే, ‘మీ మౌనం మమ్మల్ని భయపెడుతోంద’న్నా. అది తప్పా? వెంటనే నన్ను ఒంటరివాణ్ణి చేసేందుకు ప్రయత్నిస్తారా? ట్విట్టర్‌లో వెంటాడతారా?
 
దేశంలో వాతావరణం అంత భయానకంగా ఉందా?
 కచ్చితంగా! ఇవాళ్టి పరిస్థితులు చూస్తుంటే, ఒక లౌకికవాద భావన రావట్లేదు. బతికే ప్రతి క్షణం మానని గాయమైతే, అంతకన్నా భయంకరం ఇంకేముంటుంది! ‘భయం’ ఇవాళ నేషనల్‌ డిసీజైంది. ఆలోచనాపరుల హత్యలకు సంబరాలు చేసుకుంటున్నవాళ్ళ స్టేట్‌సను సోషల్‌ మీడియాలో చూసి, క్రౌర్యం విశ్వరూపాలు తీసుకుంటోందని బతకడానికే భయపడాల్సి వస్తోంది. లంకేశ్‌, శ్రీశ్రీ, ఆత్రేయ, సుబ్రహ్మణ్య భారతి లాంటి మహామహుల రచనలు, వాళ్ళ భావాలే నన్ను పెంచాయి. నేను పెరుగుతున్నప్పుడు వ్యవస్థనూ, ప్రభుత్వాన్నీ ఇంతకన్నా తీవ్రంగా ప్రశ్నించినవాళ్ళు ఉండేవారు. అప్పుడు గొంతెవరూ నొక్కలేదు. ఇప్పుడు ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడినా తప్పు అయింది!
 
చనిపోవడానికి ముందు కూడా మాట్లాడా!

గౌరీలంకేశ్‌ హత్య బాగా కదిలించినట్లుంది. ఆ కుటుంబంతో మీ బంధం?
ముప్ఫై ఏళ్ళ పైగా అనుబంధం మాది. వాళ్ళ నాన్న గారు, మా గురువు గారు లంకేశ్‌ ఒక్క వాణిజ్య ప్రకటన కూడా లేకుండా కేవలం చందాదారులతో ‘లంకేశ్‌ పత్రికె’ మ్యాగజైన్‌ నడిపారు. కన్నడసీమలో ‘నవోదయ’ ఉద్యమం సాగుతున్న సమయం అది. బెంగుళూరు బసవన్‌గుడి ఏరియాలోని ఆయన పత్రికా కార్యాలయం అభ్యుదయవాదులకూ, ఆలోచనాపరులకూ, రచయితలకూ అడ్డా. సాయంత్రమైతే ఆ ఆఫీసులో నాటకాలు, సాహిత్యం, సమాజం, చరిత్ర, మానవ సంబంధాలు... ఇలా ఎన్నో చర్చలు. మాకు షేక్స్‌పియర్‌ పాఠాలు చెప్పే మా ఇంగ్లీషు లెక్చరర్‌ జి.కె. గోవిందరావు గారు, నేను... ఇలా పెద్దా, చిన్నా తేడా లేకుండా అందరూ ఆ ఆఫీసు టేబుల్‌ దగ్గర సమానమే. అలాంటి చోట నేను నా కాలేజీ వయసులో పూర్ణచంద్ర తేజస్వి లాంటి ఎందరో పెద్దలను రెగ్యులర్‌గా కలిశా. అబ్బురంగా చూస్తూ, వాళ్ళ మాటలు విన్నా. ఆ క్రమంలో నా వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. లంకేశ్‌ గారిని సైతం ప్రశ్నించేవాణ్ణి. ఒక విషయాన్ని ఎలా చూడాలి, గ్రహించాలి అని నేర్పింది నాకు ఆయనే.
 
వ్యక్తిగతంగా గౌరీ లంకేశ్‌తో మీకున్న స్నేహం?
నా కన్నా గౌరి మూడు, నాలుగేళ్ళు పెద్దది. వాళ్ళ చెల్లెలు కవితా లంకేశ్‌ (ఇప్పుడు సినిమా డైరెక్టర్‌) కూడా బాగా తెలుసు. లంకేశ్‌ గారి దగ్గరకు వెళుతున్నప్పటి నుంచి వీళ్ళందరితో చాలా స్నేహం. చనిపోవడానికి మూడు రోజుల ముందు కూడా గౌరితో మాట్లాడా. జర్నలిస్టుగా మొదలై యాక్టివిస్టుగా మారింది. నిజానికి, నాకూ, ఆమెకూ కూడా కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. సమాజం అంటే భిన్నాభిప్రాయాలతో బతికేవాళ్ళ సమాహారం. భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన గౌరి, పన్సారే, కల్బుర్గి లాంటి వాళ్ళను చంపేస్తారా? ఒక గొంతును నొక్కేస్తే, అది వంద రెట్లు అయి ప్రతిధ్వనిస్తుంది. అందుకే, నేను గొంతు విప్పా. నా లాంటి ఎందరో గొంతు విప్పారు. వరుసగా జరుగుతున్న హత్యల్ని చూసి, నా కడుపులో నుంచి కొట్టుకొచ్చిన ఆవేదన అది. 
 
గౌరీ లంకేశ్‌ను పడనివాళ్ళు చంపారని ఓ వాదన!
ఆమెను మీరు (ప్రభుత్వపెద్దలు) చంపారని చెప్పానా? లేదే! ఎవరు చంపారన్నది విచారణలో తేలుతుంది. కానీ, ఎవరు చంపినా హత్య హత్యేగా! దాన్ని ఎందుకు ఖండించరు, మౌనంగా ఉంటారేం అన్నదే ప్రశ్న. గౌరి గళమెత్తిన అంశాలు మంచివైనా, కొన్నిసార్లు ఆ వాయిస్‌ కర్కశంగా ఉండేది. ఆ మాట నేను ఆమెకే చెప్పిన సందర్భాలున్నాయి. గళంవిప్పద్దనీ, పోరాటం చేయద్దనీ చెప్పలేదు కానీ, మాట కర్కశంగా ఉందని చెప్పా. ‘ఇలాగే మాట్లాడతాను’ అంది. అంతమాత్రాన ‘ఆమె ఎక్కువ మాట్లాడింది. శాస్తి జరగాల్సిందే’ అని పైశాచికంగా పండగ చేసుకుంటే తప్పేగా!
 
‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటూ ట్వీట్ల యుద్ధమే మొదలెట్టారే!
మాటల కన్నా ఘోరం... ‘మౌనం’. అలాంటి మౌనం పాటించడానికి నేను సిద్ధంగాలేను. లెటిట్‌ బి ది ఛాయిస్‌ ఆఫ్‌ అవర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌! సమాజంలో ఒక స్థానంలో ఉన్న నా లాంటి చదువుకున్నవాళ్ళు, బాధ్యత గల వాళ్ళు కూడా మాట్లాడకపోతే, ఒక సమాజం పిరికిగా తయారవడానికి కారణమవుతాం. ఆ తప్పు నేను చేయకూడదు! నా లాంటివాడు స్వరం పెంచితే, ఎందరికో ధైర్యం వస్తుంది. అందుకే, ‘టు హూమ్‌ సో ఎవర్‌ ఇట్‌ మే కన్సర్న్‌’ (ఎవరిని ఉద్దేశించి అయితే వారికి) అంటూ తాజ్‌మహల్‌ మొదలు ‘జీఎస్టీ’, ‘భాషతో ఆధిపత్యం’ లాంటి తాజా పరిణామాల దాకా అన్నిటి గురించీ రాస్తున్నా. (నవ్వేస్తూ...) గుమ్మడికాయ దొంగ అంటే... భుజాలు తడుముకుంటే నా తప్పు కాదు.
 
కానీ, మీరు వామపక్ష సంస్థ డి.వై.ఎఫ్.ఐ. పదకొండో మహాసభల వేదిక మీద నుంచి వ్యాఖ్యలు చేశారు కదా!
చూడండి... నేను ఎవరు ఎక్కడకు పిలిచినా, వెళతా. మాట్లాడతా! మీ దృష్టిలో వామపక్ష వేదిక మీద నుంచి మాట్లాడా. కానీ, నా దృష్టిలో నేను భూమి మీద నిల్చొని మాట్లాడుతున్నా. ఐయామ్‌ ఎ గ్లోబల్‌ సిటిజన్‌. నేను ఏం మాట్లాడినా, రైటిస్టునా, లెఫ్టిస్టునా అని వెతకడం మూర్ఖత్వం. నాకు జెండా లేదు... ఏ అజెండా కూడా లేదు!
 
అయితే, మీరు వామపక్షవాదులు కారంటారు?
నేను ఏం చెప్పినా సరే... మీకు ఏది కావాలనుకున్నారో అది మాత్రమే వినడానికి సిద్ధంగా ఉంటే ఏం చేస్తాం. నేనేదో వెతుక్కుంటూ వెళుతున్నా. నాకు నేనే తెలియనప్పుడు మీకెలా తెలుస్తా! అయినా కమ్యూనిస్టు అనో, మరొకటనో పిలవడం, నా మీద ముద్ర వేయడమే మీకు కంఫర్టబులైతే అలాగే వేయండి. మీ సంతృప్తిని నేనెందుకు కాదనాలి!
 
కానీ జీఎస్టీ గత ప్రభుత్వ విధానాలకు కొనసాగింపేనని..
(అందుకొంటూ) దీనికి మాదే బాధ్యత కాదు అని బడా నేతలు నాలుగురోజుల క్రితం అన్నారు. సరే... తప్పు అందరిదీ. ఇవాళ మీరు కుర్చీలో ఉన్నారు. పౌరుడిగా అడుగుతున్నా. నా తండ్రిని, నా దేశ ప్రధానిని అడగకూడదా! అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను అడగాలా? మనల్ని ఎవరు ఏమీ అడగకూడదనుకుంటే కుర్చీలో నుంచి తప్పుకోవాలి!
 
కానీ, సినిమావాళ్ళకు ఇవేం తెలుసని ఓ విమర్శ!
ఏం... ఒక ఊరిని బాగు చేయడానికీ, మీ ప్రచారాలకూ సినిమావాళ్ళుగా మేము కావాలి. మేము మీకు నచ్చినట్లు మాట్లాడితే ఓకే. బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే ఓకే. కానీ, అడిగితే మాత్రం తప్పు అట! అడగడమే తప్పయితే, అది నా తప్పు కాదు. నన్ను, నా లాంటి ఎందరినో పెంచిన గాంధీ, శ్రీశ్రీ, లంకేశ్‌, చెగువేరాల తప్పు. ఆ అమ్మలు నాకు కలిపిపెట్టిన ముద్దలో భయం లేదు! అయినా, కళాకారులు, జర్నలిస్టులు, మేధావులు స్పందించకపోతే ఇంకెవరు స్పందిస్తారు! కర్ణాటకలో హస్తకళలపై మాట్లాడినా, తమిళనాట సినిమా టికెట్లపై రెండు పన్నుల విధానం గురించి ప్రశ్నించినా, అసహనమైతే ఎలా? ఏమడిగినా, ‘నీకేం తెలుసు? నువ్వు ఫలానా పార్టీ వాడివి’ అంటే ఎలా? ఓకే నా తెలియకపోతే చెప్పండి! అందరం కలసి జవాబులు వెతుకుదాం. ఓటరుగా అడుగుతూనే ఉంటా! ఆపను.
 
కానీ, మీరు ఇప్పటి పాలకులకే ఓటేశారా?
ఎవరికి ఓటేశానన్నది వ్యక్తిగతం. గోప్యమైన విషయం. కానీ, నేనింత వరకూ ఓటేయని ఎన్నికలు లేవు. అయితే, మనదేశంలో చాలామందికి పోలింగ్‌ డే అంటే హాలీడే! ఓటును అమ్మకున్నవాళ్ళు, హాలీడే అనుకొంటూ ఓటేయనివాళ్ళకూ అడిగే హక్కు ఉండదు. ఇవాళ ఎంతమందికి వాళ్ల ప్రజాప్రతినిధులు తెలుసు. కులం, మతం, ప్రాంతం, జాతి అంటూ ఓటేస్తుంటే, మనకు రాంగ్‌ లీడర్సే వస్తారు.
 
మీరు యాంటీ మోడీనా?
నేనేమీ మోడీ వ్యతిరేకినని చెప్పలేదే! మీరంటున్నారు.
 
పెద్ద నోట్లు రద్దు చేసి, ఏడాదైంది.. మీ అభిప్రాయం?
దాని వల్ల ఏం మంచి జరిగిందో కనబడట్లేదు. మధ్యతరగతి నానా అవస్థ పడుతోంది. మరోపక్క పెద్దవాళ్ళ దగ్గర బ్లాక్‌ మనీ అలానే ఉంది! పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి కొన్ని భరించాలన్నారు ప్రభుత్వ పెద్దలు. భరించాం, భరిస్తున్నాం. కానీ, భరించడానికీ, ఒప్పుకోవడానికీ తేడా ఉంది. ఆ సంగతి పాలకులు గ్రహించాలి.
 
మీ ఫ్రెండ్‌ కమలహాసన్‌ ఒకప్పుడు పెద్ద నోట్ల రద్దును సమర్థించి ఇప్పుడు అభిప్రాయం మార్చారు.
(నవ్వేస్తూ...) ఆయన నాకు మంచి సహనటుడు.
 
మొన్నటిదాకా మాట్లాడని మీరు ఉన్నట్టుండి ఏ ప్రయోజనాల కోసం గొంతు విప్పుతున్నారని కొందరి ప్రశ్న!
ఇప్పుడు నిద్ర లేచి, వినడం మొదలెట్టినవాళ్ళకు నేను ఇప్పుడే మాట్లాడుతున్నట్లు అనిపించవచ్చు. కానీ, నేను చాలాకాలంగా చాలా విషయాలపై మాట్లాడుతున్నా! కావాలంటే వెరిఫై చేసుకోండి. అయినా, జనం అలా అప్రమత్తమై, నన్ను కూడా అనుమానంగా చూడడం, ప్రశ్నించడం మంచిదే! అది ఆరోగ్యవంతమైన లక్షణం.
 
కర్ణాటకలో, తమిళనాడులో మీరు గొంతు విప్పలేదని...
(అందుకుంటూ...) శుద్ధ తప్పు. ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఘాటుగా రాస్తున్నాడంటూ రవి బెళగిరే అనే కన్నడ జర్నలిస్టుపై ఆ మధ్య శాసనసభ స్పీకర్‌ శిక్ష వేశారు. అప్పుడు అందరి కన్నా ముందు నేను గొంతు విప్పా! జయలలిత చనిపోగానే, ‘ఇక్కడ ప్రభుత్వం లేదు. ఉన్నది గవర్నమెంట్‌ కాదు’ అని అందరి కన్నా ముందు చెప్పిందీ నేనే! అప్పుడు వీళ్ళంతా నిద్రపోయారేమో! (నవ్వుతూ...) ప్రపంచమంతా పడుకున్నప్పుడు మనం మెలకువగా ఉండాలిగా!
 
ఇంతకీ, తమిళనాట ప్రస్తుతం పాలన పడకేసిందట?
(నవ్వుతూ...) ఎడ్లబండిని నడిపేవాడు బండిలోనే పడుకొని నిద్రపోయినా, సాయంత్రానికల్లా ఎద్దు తనంతట తాను ఇంటికి తీసుకువెళుతుంది. అక్కడున్న పరిస్థితి అదే!
 
తమిళ భాషా, సంస్కృతులపై ఉత్తరాది దాడికి ప్రయత్నం జరుగుతోందని ఓ ఆరోపణ. నిజమా?
నిజమే! ప్రతి మట్టికీ తనదైన రాజకీయ సంస్కృతి ఉంటుంది. అందుకే, ఏ భాష, ప్రాంతం వాణ్ణి ఆ భాష, ప్రాంతం వాడే పాలించాలి. వాడికే ఆ సమస్యలు, భాష తెలుసు. హిందీ జాతీయ భాష కాకపోయినా, అంతలా దాన్ని రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నానికి తమిళనాట నిరసన వచ్చింది అందుకే! మన దేశంలో అన్నీ (రాష్ట్రాలూ) ఒకటే కాదు. పైగా, ఇది అమెరికాలా ఏ రెండొందల ఏళ్ళ చరిత్ర మాత్రమే ఉన్న సమాజమో కాదు. వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి. ఆ విషయం గ్రహించకపోతే ఎంత పెద్ద జాతీయ పార్టీకైనా, నేతకైనా ఇబ్బందే! వాళ్ళను నేను అడిగేది ఒకటే... మీరు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి, ఏలడానికి వస్తున్నారా? లేక పాలన బాగు చేయడానికి వస్తున్నారా? మీ అజెండా ఏంటో చెప్పండి!... జస్ట్‌ ఆస్కింగ్‌!
 
ఇంతకీ మీరు కన్నడ, తమిళ దేశాల్లో ఎక్కడివారని, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారని అనుకోవాలి?
ఎవరైనా ఎదుగుతున్నప్పుడు ఎవరూ పట్టించుకోరు. కానీ, ఒకసారి ఎదిగాక మా ఊరు, మా కులం, మా పిల్లాడు అంటూ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. కన్నడ, తమిళ, తెలుగు సాహిత్యాలు, సినిమా, రంగస్థలం అన్నీ, అందరూ కలసి నన్ను పెంచారు. నా ఈ ఎదుగుదలకు కారణం చాలామంది ప్రేమ. కాబట్టి, నేను అందరికీ సమానంగా బాకీ తీర్చే దశలో ఉన్నా. అలాంటి నన్ను ఒక ప్రాంతానికీ, పక్షానికీ కట్టేయకండి. అందుకే, తెలంగాణలో కొండారెడ్డిపల్లి ఒకటే కాదు, తమిళనాట కోవళం, సెమ్మంజెరికుప్పమ్‌ లాంటి ఊళ్ళను దత్తత తీసుకున్నా. కర్ణాటకలో రంగస్థల అభివృద్ధికీ నిలబడ్డా.
 
నటుడైన ప్రకాశ్‌ ఇంతగా ఎలా పరివర్తన చెందారు?
ఇది మనిషికి నైసర్గికంగా జరిగే ప్రక్రియ. నటన నా అస్తిత్వం, అభివ్యక్తి స్వాతంత్య్రం. నటుడి నుంచి నిర్మాతనయ్యా, దర్శకుడినయ్యా, రాయడం మొదలుపెట్టా. రైతునయ్యా. కాలమిస్టయ్యా. ఇటీవలే నా తొలి కన్నడ కథ ‘కన్నడప్రభ’ దీపావళి సంచికలో ప్రచురితమైంది. ప్రయాణంలో ఒక దిగంతానికి చేరాక మరో దిగంతం కనిపిస్తుంది. ఆ వైపుగా సాగిపోవడమే! అలా ఇది అనేక దిగంతాలకు ప్రయాణం. నాకు లక్ష్యాలు లేవు. గమనంలోనే బతుకుతా!
 
ఇలా అవుతానని మీరెప్పుడైనా ఊహించారా?
లేదు! నాకూ తెలీదు... నేనిలా అవుతానని! అయితే, ఒకటి నిజం. మొదటి నుంచీ ప్రతిఘటనే నా ఊపిరి!
 
మీ వ్యాఖ్యలు మీకు ఏం చేశాయి? మంచా, చెడా?
బతుకుకు అర్థమిస్తున్నాయి. నిజాయతీగా బతుకుతున్నాననే గర్వమిస్తున్నాయి. బతికున్నాననిపిస్తున్నాయి.
 
మిమ్మల్ని ట్రాలింగ్‌ చేసేవాళ్ళకు ఏమైనా చెబుతారా?
ఒక్కటే చెప్పదలిచా. ఎవరినీ బ్లాక్‌ చేయను. ఎవరు ఏమిటో, రోగం ఏమిటో తెలియాలంటే బ్లాక్‌ చేయకూడదు. నేను నాలా బతుకుతా! మీ అవగాహనను బట్టి మీరు నన్ను మెచ్చుకోవచ్చు, విమర్శించవచ్చు. మీ భావం ఏదైనా దాన్ని నేను గౌరవిస్తా. (నవ్వుతూ...) ప్రేమించినా, ద్వేషించినా ఫరవాలేదు. పట్టించుకోకపోతేనే... సమస్య!
 
విజయ్‌ తమిళ చిత్రం ‘మెర్సల్‌’ సినిమాలో డైలాగులు, సీన్లు కట్‌ చేయాలన్న వివాదంపై మీ కామెంట్‌?
నన్నడిగితే సెన్సారింగే నాకు నచ్చదు. యు కెన్‌ సర్టిఫై ఎ ఫిల్మ్‌. బట్‌ యు కెన్‌ నాట్‌ బ్యాన్‌ ఎ ఫిల్మ్‌. అయినా, ఒకసారి సెన్సారై, రిలీజ్‌ కూడా అయిన ‘మెర్సల్‌’కు మళ్ళీ ఏమిటీ గోల? మీరు బాధ్యత ఇచ్చిన సెన్సార్‌ బోర్డును మీరైనా నమ్మాలి కదా! అయినా, అసభ్యమైన, అసహ్యమైన సినిమాలను డబ్బు తీసుకొని సెన్సార్‌లో వదిలేసిన సంగతులు నాకు తెలుసు! వాటితో పోలిస్తే, జీఎస్టీ లాంటి జరుగుతున్నవాటి మీద డైలాగులున్న ‘మెర్సల్‌’ తప్పేముంది!
 
సెన్సార్‌ మాట సరే. సినిమాలు తీస్తుంటేనే... భన్సాలీ ‘పద్మావతి’ లాంటి వాటిపై దాడుల్ని ఏమంటారు?
సినిమా సెట్స్‌పై దాడి చేస్తారా? గోహత్య పేరుతో రోడ్డు మీద వాళ్ళను కొడతారా? ప్రేమికులు కనపడితే, కొట్టి పెళ్ళి చేస్తారా? వాళ్ళకు అంత ధైర్యం రావడానికి కారణం, పరిస్థితులు ఏంటి? ఎలా, ఎందుకు వచ్చిందన్నదే నా ప్రశ్న.
 
కొన్ని పొందడానికి కొన్ని కోల్పోవాలి.
నేను డబ్బు పోయినా, కోలుకునేంత శ్రీమంతుణ్ణి. తిరిగి పొందేంత పేదవాణ్ణి.

నాకు గమనమేతప్ప..
గమ్యం, లక్ష్యం లేవు..
అయామ్ నాట్ ఎ టూరిస్ట్ హియర్!
అయామ్ ఎ ట్రావెలర్ హియర్! 
 
మోడీనే పెద్ద నటుడనీ, అవార్డులు ఇవ్వాలనీ అన్నట్లున్నారు!
(నవ్వేస్తూ...) నటుణ్ణి కాబట్టి, అవతలివాళ్ళ నటన నాకు బాగా అర్థమవుతుంది. అయినా నేను ప్రశంసే కదా ఇచ్చింది! (నవ్వులు). మనిషన్నాక కొద్దిగా వెటకారం, హాస్యం ఉండాలి. నాలో ఉన్న ఆవేదనను నవ్వుతూ చెప్పాను. చార్లీ చాప్లిన్‌ కూడా అలానే కదా అన్నాడు.
 
అవార్డులు వెనక్కి ఇచ్చేస్తారన్నట్లు వార్తలు వచ్చాయి!
నేను వెనక్కి ఇచ్చేస్తానని కూడా వాళ్ళే సృష్టించారు. అవి నా కష్టార్జితం. నటనకు గుర్తింపుగా వచ్చినవాటిని వెనక్కి ఇచ్చేసేంత మూర్ఖుణ్ణి కాదు. పుకార్లు టీవీలో వస్తున్నాయి. అప్పటికప్పుడు ట్విట్టర్‌లో నా స్టేట్‌మెంట్‌ వీడియో చేసి, రిలీజ్‌ చేశా. నా ప్రకటన తరువాత కూడా తమకు కావాల్సినట్లే తాము ప్రచారం చేసినవాళ్ళూ ఉన్నారు (నవ్వులు).
 
గతంలో సాహిత్య అకాడమీ అవార్డులు మీ మిత్రులే వెనక్కిచ్చారు!
అది వాళ్ళ తాలూకు భావ ప్రకటన విధానం. వాళ్ళు వ్యక్తపరిచే విధానం తప్పనీ నేనూ వాళ్ళకూ చెప్పాను. వ్యక్తపరిచే విధానం తప్పు కావచ్చేమో కానీ, వాళ్ళ కోపం, దాన్ని వ్యక్తపరచడం తప్పు అనలేం కదా!
 
దర్శకుడిగా, నిర్మాతగా ఇటీవల చేసిన ‘ఉలవచారు బిర్యాని’, ‘మన ఊరి రామాయణం’తో డబ్బు పోగొట్టుకున్నట్లున్నారు?
నాకు నచ్చినవి చేయాలనుకున్నా, చేశాను. కొన్ని పొందడానికి కొన్ని కోల్పోవాలి. నేను డబ్బు పోయినా, కోలుకొనేంత శ్రీమంతుణ్ణి. తిరిగి పొందేంత పేదవాణ్ణి. ఏం పోయినా, వచ్చినా నాకు నచ్చిన నా ప్రయాణం, ప్రయత్నాలు ఆగలేదు.. ఆపను! (నవ్వులు...) ఎప్పుడూ బతకడం ఆపకూడదు. ఇది పోతే, ఆ తరువాత మరొకటి చేసేయాలి. అంతే.
 
అయితే, మళ్ళీ సినిమాలు తీస్తానంటారు!
ఇన్ని పనుల మధ్య సమయం దొరకదు కాబట్టి, ఈ ఏడాదికి దర్శకత్వం చేయాలనుకోవడం లేదు. కాకపోతే, ఈ డిసెంబర్‌ చివర నుంచి రాధా మోహన్‌ దర్శకత్వంలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ఒకటి నిర్మిస్తూ, నటిస్తున్నా. ‘అరవై ఏళ్ళు... చామనఛాయ... మిస్సింగ్‌’ ఇదీ టైటిల్‌. పూర్తిగా మతిమరపు వచ్చే అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడే ముసలి తండ్రికీ, ఆయనను వెతుక్కొనే కొడుకుకూ మధ్య కథ. తండ్రి పాత్ర నేను వేస్తున్నా.
 
ఇన్నిచోట్లకు తిరుగుతున్నారు. సినిమాల మాటేంటి?
తెలుగులో మహేశ్‌బాబు ‘భరత్‌... అను నేను’, రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’, మలయాళంలో మోహన్‌లాల్‌తో ‘ఒడయన్‌’, అలాగే మరో సినిమా, తమిళంలో శివకార్తికేయన్‌ సినిమా (షూటింగ్‌ అయిపోయింది), మణిరత్నంతో సినిమా, కన్నడంలో పునీత్‌ రాజ్‌కుమార్‌తో సినిమా, హిందీలో ‘టెంపర్‌’... బోలెడున్నాయి. సినిమాలు సినిమాలే... జీవితం జీవితమే.
 
ఎన్టీయార్‌ బయోపిక్‌లో నటిస్తారంటూ ఆ మధ్య పుకార్లు వచ్చాయి!
అవి వట్టి పుకార్లు. వర్మ, నేను తరచూ కలుస్తుంటాం. రోజూ మాట్లాడుకుంటాం. మా మధ్య అసలు ఈ సినిమా, పాత్ర కబుర్లే రాలేదు.
 
పోనీ, బాలకృష్ణ తీస్తున్న బయోపిక్‌లో అవకాశం వస్తే చేస్తారా?
కథ, పాత్ర, దర్శకుడి తీరు నచ్చితే ఏ సినిమాలోనైనా చేస్తా!
 
బయోపిక్‌లు మీకు కొత్త కాదు. మణిరత్నం ‘ఇరువర్‌’లో ప్రముఖ తమిళ నేత కరుణానిధి పాత్ర వేశారు. అప్పుడింత గొడవైనట్లు లేదు!
నేను ఆయనను అనుకరించలేదు. ఆయన ఎత్తు, రంగు కూడా నాకు లేవు. అయితే, ఆ సినిమా సమకాలీన తమిళ రాజకీయ నేతలైన ఇద్దరి (ఎమ్జీయార్‌, కరుణానిధి) జీవితఘట్టాలను ఆధారంగా చేసుకున్నా, దాన్ని ఇద్దరు మనుషుల కథగా, ఇంకో కోణంలో చూస్తూ దర్శకుడు మణిరత్నం కథ రాసుకున్నారు. అది సృజనాత్మక కళాకారుడి హక్కు.
 
ఆ తరువాత కరుణానిధిని కలిసినప్పుడు ఏమీ అనలేదా?
లేదు. ఆ తరువాతనే ‘కల్కి’ సినిమాకు నాకు రాష్ట్ర అవార్డు ఇచ్చారు. అయితే, ‘ఇరువర్‌’లో నాకు జాతీయ అవార్డు వచ్చినా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు ఆయన ఇవ్వలేదు. ఆ సమయంలో ఆయనతోనే, ‘ఇప్పుడు కాకపోయినా, ఏదో ఒకరోజున చరిత్రకారులు ఈ అన్యాయాన్ని చరిత్రబద్ధం చేస్తారు. అప్పటికీ మీరూ, నేనూ ఉన్నా లేకపోయినా, ఆ క్షణం మాత్రం అది మీకు మాయని మచ్చ అవుతుంది’ అన్నా. కరుణానిధి నవ్వేశారు. ముఖం మీద విమర్శించినా, దాన్ని సహృదయంతో అర్థం చేసుకొనే ఆ తరహా నాయకులు రానురానూ వేదికపై తగ్గిపోతున్నారు.
 
గతంలో గిరీశ్‌ కర్నాడ్‌ నాటకం వేదికపై ప్రదర్శిస్తానన్నారు!
‘మంత్రపుష్పర’ నాటకం రంగస్థలంపై వేయాలని ఆలోచన. అయితే, టైమ్‌ కేటాయించలేకపోతున్నా. పెంచిపెద్ద చేసిన రంగస్థలాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికీ కర్నాటకలో అనేక బృందాలతో అనుబంధం ఉంది.
 
పత్రికల్లో కాలమిస్టుగా కూడా బిజీ?
(నవ్వేస్తూ...) అవును. గతంలో ప్రముఖ తమిళ వీక్లీ ‘ఆనంద వికటన్‌’ లో ‘సొల్లాదదుమ్‌ ఉన్మై’ (చెప్పనివి కూడా నిజాలే) అంటూ 49 వారాల పాటు కాలమ్‌ రాశా. మోస్ట్‌ పాపులర్‌. పుస్తకంగా బెస్ట్‌ సెల్లర్‌. ఇప్పుడు కన్నడ దినపత్రిక ‘ఉదయవాణి’ వాళ్ళు బలవంతపెట్టడంతో ప్రసిద్ధ కన్నడ కవితా పంక్తులకు తగ్గట్లు ‘ఇరువుదెల్లవ బిట్టు’ (ఉన్నవ న్నీ వదలి అని అర్థం) శీర్షికన కాలమ్‌ రాస్తున్నా. 14 వారాలుగా వస్తోంది. బాగా స్పందన ఉంది. ఆపుదామన్నా... వదలడం లేదు.
 
ఇంతకీ ప్రకాశ్‌ రాజ్‌ నటుడా, రచయితా, రైతా, ఉద్యమకారుడా?
(నవ్వేస్తూ...) మామూలు మనిషిని. ప్రపంచ పౌరుణ్ణి.
 
కానీ మీలోని మల్టీ ట్యాలెంట్‌... మీ మల్టీ టాస్కింగ్‌ చూస్తే...!
(అందుకుంటూ) ఏదైనా చేయగలను. రేపటి నుంచి సినిమాలు లేవంటే హాయిగా రైతుగా బతికేయగలను. ఈమధ్యే కోయంబత్తూరులో 400 మంది రైతులను ఉద్దేశించి, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ గురించి సదస్సులో మాట్లాడా. కేర ళలో యూనివర్సిటీలో ఇంగ్లీష్‌ గెస్ట్‌ లెక్చరర్‌గా వెళుతున్నా. నవంబర్‌ 26న బెనార్‌సలో ఇండియాస్‌ రైటర్స్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రారంభోపన్యాసం చేయమని పిలిచారు. వెళ్ళాలి. ఫోన్‌ కాంటాక్ట్స్‌ చూస్తే నటులు, దర్శకులు, రైతులు, యాక్టివిస్టులు.. అందరూ కనిపిస్తారు. ప్రతి క్షణం గాఢంగా బతుకుతున్నా.
 
అయితే, మీ ప్లేట్‌ ఫుల్‌ అన్నమాట!
(క్షణం ఆగి... సాలోచనగా) అయామ్‌ ఫుల్‌. (నవ్వుతూ) ఇటీజ్‌ ఫుల్‌ ఫిల్లింగ్‌ (ఆత్మసంతృప్తిగా ఉంది). నాకు గమనమే తప్ప, గమ్యం, లక్ష్యం లేవు. అయామ్‌ నాట్‌ ఎ టూరిస్ట్‌ హియర్‌! అయామ్‌ ఎ ట్రావెలర్‌ హియర్‌!
 
వీటన్నిటికీ మీకు టైమ్‌ ఉందా? ఎలా అడ్జస్ట్‌ చేస్తున్నారు?
ఇంకా కొద్దిగా టైమ్‌ మిగిలే ఉంది. బిజీగా ఉన్నవాడికి టైమ్‌ ఉంటుంది. సోమరిపోతుకే టైమ్‌ ఉండదు. టైమ్‌ లేదనేవాడు నా దృష్టిలో సోమరి.
 
మీకంటూ ఏదైనా కల!
నాకూ ఒక కల ఉంది. ‘దిల్‌ ఢూంఢ్తా హై... ఫిర్‌ వహీ పుర్సత్‌ కీ రాత్‌...’ అని కవి గుల్జార్‌ రాశారో చోట. అలాగే, పది పదిహేనేళ్ళ తరువాత నా పిల్లల లానే, నేను నాటిన చెట్లు కూడా పెరిగి పెద్దవైనప్పుడు, వాటి కింద ఖాళీగా కూర్చొని, పక్షులనూ, ప్రకృతినీ చూస్తూ, మీ లాంటి మిత్రులతో హాయిగా కబుర్లాడుకొనే క్షణాలు గడపాలని ఉంది. బతికినంత కాలం మనిషిలా బతకాలి. యముడొస్తే మనసారా ఆహ్వానించేలా జీవించాలి.
 
ఇటీవల మీరు చదివిన, మిమ్మల్ని కదిలించిన పుస్తకం?
పాలగుమ్మి సాయినాథ్‌ రాసిన ‘ఎవ్రీబడీ లవ్స్‌ ఎ డ్రాట్‌’. దుర్భిక్ష పరిస్థితులను కూడా భారీగా సొమ్ము చేసుకొనే మన ప్రభుత్వాలు, వ్యవస్థలోని డొల్లతనాన్ని గురించి రాసిన ఆ పుస్తకం చదివితే, కదిలిపోతారు.
 
మోదీపై వ్యాఖ్యల కాంట్రవర్సీ ఎక్కడికి దారి తీస్తుంది?
ఏమో... నాకూ తెలీదు. చూద్దాం... ఏ కొత్త దిగంతం చూస్తానో!
 
ఈ సంఘటన ద్వారా మీకు తెలిసిందేమిటి?
(ఠక్కున...) నేను ఒంటరిని కాదని తెలిసింది. ఇప్పటి వరకు ప్రకాశ్‌రాజ్‌ నటుడిగానే చాలామందికి తెలుసు. కానీ, ప్రకాశ్‌రాజ్‌లో ఈ సామాజిక కోణం కూడా ఉందని జనానికి తెలిసింది ఈ ట్రాల్‌ చేస్తున్నవాళ్ళ వల్లే!
 
చినికి చినికి గాలివానై ఈ కాంట్రవర్సీలో కొట్టుకుపోతారేమో?
ఒకటి నిజం. ఈ కాంట్రవర్సీ వల్ల నేను కొట్టుకుపోను. అలాగని అదే పనిగా కాంట్రవర్సీల్లోనూ పడి కొట్టుకుపోను. కాంట్రవర్సీకి ఉన్న బలం ఏమిటో, నా బలం ఏమిటో చూద్దాం. అయినా, ఇప్పుడే కదా... మ్యాచ్‌ స్టార్ట్‌ అయింది. కొన్ని ఫౌల్స్‌ ఉంటాయి. అంపైర్లు చేసే తప్పులుంటాయి. కొన్నిసార్లు మ్యాచ్‌ డ్రా అవుతుంది. ఏమవుతుందో చూద్దాం. నా దృష్టిలో గెలవడం కాదు... బతకడం ముఖ్యం. ప్రశాంతంగా, ఊపిరి తీసుకోవడానికి కూడా భయపడని సమాజం కావాలి. నా ఉద్దేశం కూడా అదే!
 
నా వయసు ఓ పదేళ్ళు తగ్గించాడు
మీ కుటుంబ జీవితం ఎలా ఉంది?
అమ్మ, భార్య, పిల్లలు... బ్రహ్మాండంగా ఉంది.
 
మీ పెద్దమ్మాయి లండన్‌ చదువెందాకా వచ్చింది?
పెద్దమ్మాయి పూజ లండన్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌ చదువు పూర్తి చేసుకొని వచ్చింది. తను పెయింటరే కాక మంచి సింగర్‌ కూడా. పై చదువు చదువుకోమంటున్నా. పాతికేళ్ళు వచ్చేదాకా హాయిగా ప్రపంచాన్నీ, జీవితాన్నీ నాలుగైదు కోణాల నుంచి చదువుకోమని చెప్పా. ఇంకొకరి కింద పనిచేయడం కాకుండా, మనసుకు నచ్చిన పని చేసుకుంటూ, జీవనం సాగించమని చెబుతుంటా. బ్రాడ్వేలో మ్యూజికల్‌ థియేటర్‌లో చేరాలా, లేక డిస్నీ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ చదువుకోవాలా అనేది తను ఇంకా నిర్ణయించుకోలేదు. ఒక ఎడ్యుకేషనిస్టుతో మా అమ్మాయిని కూర్చోబెట్టి, మాట్లాడించి, మంచీ చెడు గైడెన్స్‌ ఇప్పించా. వచ్చే జనవరిలో ఎక్కడో అక్కడ చేరాలి. నాలుగేళ్ళ క్రితం లండన్‌లో చదువుకు చేర్పిస్తున్నప్పుడూ నేను, తనూ అక్కడికి వెళ్ళి, పదిహేను రోజులు చూసుకొని, వచ్చా. ఈసారీ ఈ నవంబర్‌, డిసెంబరుల్లో ఆ పని చేయాలి.
 
చిన్నమ్మాయి మాటేంటి?
రెండో అమ్మాయి మేఘనకు పన్నెండేళ్ళు. ఇక్కడే... ఇప్పుడు ఏడో తరగతి చదువుతోంది. ఇక మా బుడ్డోడు... వేదాంత్‌. ఇంకా ఇరవై నెలలే. వాడి అల్లరంటే అల్లరి. వాడికి తమిళం, కన్నడం కన్నా ముందు ఇప్పుడిప్పుడే తెలుగు వస్తోంది. (నవ్వుతూ...) వాడు నా వయసు ఓ పదేళ్ళు తగ్గించాడు. మా అమ్మకు డెబ్భై ఏడేళ్ళు. నాతోనే ఉంటుంది. ...ఉంటే నీ లాంటి కొడుకుండాలిరా... అంటూ ఉంటుంది. ఇక, నా భార్య (పోనీ వర్మ) నాకు మంచి ఫ్రెండ్‌. నన్ను గాఢంగా ప్రేమిస్తుంది. లత (ప్రకాశ్‌ రాజ్‌ మొదటి భార్య) కూడా నాకు ఇప్పటికీ చాలా మంచి ఫ్రెండ్‌. యోగ క్షేమాలు కనుక్కుంటూ ఉంటా. మా ఇద్దరమ్మాయిలతో చాలా బాగుంటుంది. వాళ్ళమ్మ బర్త్‌డే రోమ్‌లో చేయాలని మా చిన్నమ్మాయి అడిగింది. సరే అన్నా... అందరూ అక్కడకు వెళ్ళి, హాయిగా గడిపి వచ్చారు.
 
చుట్టాలు పక్కాలను కలుస్తుంటారా?
ఇప్పటికీ ప్రతి డిసెంబర్‌లో ఒక పది రోజుల పాటు మా సిస్టర్స్‌, పిన్నమ్మలు, చుట్టాలు... ఇలా మా పెద్ద ఫ్యామిలీ అంతా ఒక చోట కలుస్తాం. హైదరాబాద్‌లోని మా ఫార్మ్‌ హౌస్‌లోనే అందరం కలసి గడుపుతాం. ఏటా అదో పెద్ద పండుగ. ఇప్పటి నుంచే దానికి సన్నాహాలు చేస్తున్నాం.
 
కమల్‌, రజనీలకు ఓటేయను!
మీ సహనటులు కమల్‌, రజనీకాంత్‌, తెలుగులో పవన్‌ కల్యాణ్‌, కన్నడంలో ఉపేంద్ర... చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు. ఏమంటారు?
 
ఏమనాలి? వ్యక్తిగతంగా కమల్‌, రజనీలకు నేను అభిమానిని. వాళ్ళు ఏం చేసినా నా అభిమానం తగ్గదు. కానీ ఓటేసేటప్పుడు ఎవరికో అభిమానిగా ఓటేయను. ఎన్నో సమస్యలున్న మన లాంటి దేశంలో ప్రజాప్రతినిధి కావడానికి నటుడనే అర్హత ఒక్కటీ చాలదు.
 
రాజకీయాల్లోకి వస్తే పవన్‌ కల్యాణైనా, మరొకరైనా తమ ప్రణాళికలతో జనంలో నమ్మకం కలిగించాలి. సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి. ఒక వ్యక్తి ఒక కొత్త రంగంలోకి దిగినప్పుడు అందంగా అవుతారో, అసహ్యంగా మారతారో అన్నది ఆ వ్యక్తి చేతుల్లోనే ఉంది. ఏదైనా ఒకటి నిజం... ఎవరైనా తనను తాను నాయకుణ్ణి అనుకుంటే కుదరదు. జనం అనుకొంటేనే ఎవరైనా లీడర్‌!
 
నాకూ, వారికీ ఒకటే ట్యాక్సా!
జీఎస్టీ మీద మీ వాదనేంటి?
చేనేత వృత్తికారులు, హస్తకళల మీద జీఎస్టీ ఏమిటండీ! కమ్మరులు, కుమ్మరులు, రైతుల లాంటి వాళ్ళు ఎలా బతకాలి! ఇవాళ గ్రామీణవ్యవస్థ అల్లకల్లోలమైపోయింది. సింగపూర్‌ లాంటి చోట్ల ఒకే పన్ను విధానం ఓ.కె. కానీ, ఒక పక్క గ్రామాలకూ, నగరాలకూ మధ్య అంతరం పెరిగిపోతున్న ఇక్కడెలా కుదురుతుంది. లక్షలు సంపాదించే నాకూ, కుమ్మరికీ, కమ్మరికీ ఒకటే ట్యాక్సా! ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ అంటూ, ఇదా చేసే పని! వియ్‌ ఆర్‌ ఆల్రెడీ ఇన్‌ బ్రోకెన్‌ ఇండియా. ఎప్పుడైతే రైతు, గ్రామీణ జీవితం బాగాలేదో నా దేశం బాగా లేనట్టే!
 
తమిళ రైతు సమస్యల మీదా ఢిల్లీలో ధర్నా చేశారే!
రైతు ఎక్కడైనా రైతే! పొలం పండిస్తున్న రైతును. ఆ కష్టం నాకూ తెలుసు. ఇవాళ రైతులు కూలీలయ్యే దుఃస్థితి ఎందుకు దాపురించింది? అన్నం పెట్టే రైతులు ఢిల్లీలో వారాల తరబడి, జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తే ప్రభుత్వాలు, మీడియా పట్టించుకోలేదు. నడిగర్‌ సంగం కార్యదర్శి, నటుడు విశాల్‌తో రాత్రికి రాత్రి చెప్పా. మేము వెళ్ళి, ధర్నాలో కూర్చోగానే, టీవీలు, ప్రభుత్వాల హడావిడి. గడ్కరీ సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలు పిలిచి, మేము చూస్తాం. అయినా ఇది రాష్ట్రాల అంశం అన్నారు. నీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనేమో కేంద్ర అంశం అంటావు. మరో పార్టీ ఉంటే, రాష్ట్ర అంశం అంటావు. ఇదెక్కడి న్యాయం? కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలతో పోలిస్తే, రైతులకు విదిలిస్తున్నది ఎంత!
 
నేను చనిపోయిన వార్త నాకే రాకూడదు!
నా ఫ్రెండ్‌, దర్శకుడు రాధామోహన్‌ ఎనిమిదేళ్ళ కూతురు వాళ్ళ నాన్నతో,... డాడీ! ప్రకాశ్‌రాజ్‌ అంకుల్‌ను కాస్త సైలెంట్‌గా ఉండమని చెప్పండి. నాకు భయంగా ఉంది... అందట. డెబ్భై ఏడేళ్ళ మా అమ్మ దేవుడి ముందు కూర్చొని, మా అబ్బాయికి ఏమీ కాకూడదని ప్రార్థిస్తోంది. మా అమ్మాయిలు ఎక్కడున్నా సరే, ...డాడీ... ఆర్‌ యు ఓకే... అని రోజూ మెసేజ్‌లు పెడుతున్నారు. మా ఆవిడ జాగ్రత్తలు చెబుతోంది. మా అమ్మకూ, నా భార్యకూ, చెల్లికీ చెప్పాను... ‘నా వల్ల మీకు అవమానం తీసుకురాను. ఆ హామీ మీకిస్తా. నాకు ఏదో జరుగుతుందనే కదా... మీ భయం. జాగ్రత్తగానే ఉంటా’. అయినా... మనిషికి చావు ఒకేసారి వస్తుంది. అంతేకానీ, రోజూ చావకూడదు, చావలేం. మనిషిగా నేను చనిపోయిన వార్త నాకే రాకూడదు. చావుకు ఒక అర్థం ఉండాలి. బతుకులో ఒక తీవ్రత ఉండాలి. అవి లేకపోతే, ఎందుకు బతకడం!
 
దత్తత గ్రామం కొండారెడ్డిపల్లి పనులు ఎందాకా వచ్చాయి?
తెలంగాణలో హైదరాబాద్‌ శివార్లలో రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని షాద్‌నగర్‌ దగ్గరుందీ గ్రామం. దత్తత తీసుకొని అప్పుడే రెండేళ్ళయింది. కొన్ని ఇళ్ళు కట్టించా. స్కూలు కట్టించా. ప్రభుత్వ సహకారంతో భూమనపల్లి చెరువు పనులు చేయడంతో, ఈసారి వర్షాలకు చెరువు నీళ్ళతో నిండింది. చాలా పనులు జరిగాయి, జరుగుతున్నాయి. కానీ అనుకున్న స్పీడులో, అనుకున్న టైములో జరగవు. ఒక గ్రామాన్ని బాగు చేయాలంటే, మనకు ఎంత డబ్బు, ప్రేమ ఉన్నా తరతరాలుగా మోసపోయిన జనంలో నమ్మకం కలిగించడం ముఖ్యం. మనం ఏదో ప్లాన్‌ వేసేసుకున్నంత మాత్రాన అయిపోదు. పైగా, ఇదేమీ కేవలం రెండు, మూడేళ్ళలో ముగిసిపోయే ప్రాజెక్టూ కాదు. ఇటీజ్‌ ఎ వెరీ లాంగ్‌ ప్రాసెస్‌. దానికి చాలా ఓపిక, సహనం కావాలని అర్థమైంది. నేను ఆ ఊరికి ఇచ్చినదాని కన్నా, నేర్చుకున్నది ఎక్కువ. అయామ్‌ లవింగ్‌ ఇట్‌.
 
చాలామంది గ్రామాలు దత్తత తీసుకుంటున్నారు. కానీ...
మనం ఎవరికో ఏదో నిరూపించడానికి దత్తత తీసుకుంటున్నామా, లేక జీవితానికి పరమార్థం కావాలని తీసుకుంటున్నామా అన్నది ముఖ్యం. మరేదో ప్రయోజనాన్ని ఆశించినా ఈ పని చేయలేం.
 
ఇంతవరకూ వీటిలో ఎంత ఇన్వెస్ట్‌ చేశారేమిటి?
డబ్బు చాలా చీప్‌! కానీ, ఐ హ్యావ్‌ ఇన్వెస్టెడ్‌ లాట్‌ ఆఫ్‌ టైమ్‌.
 
-డాక్టర్‌ రెంటాల జయదేవ 
 
 

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.