జ్యోతిష్యుడి సమయస్ఫూర్తి!
20-10-2017 22:23:25
పూర్వం చంద్రాపురం గ్రామంలో భద్రయ్య అనే జ్యోతిష్యుడు ఉండేవాడు. జాతకాలు చెప్పటంలో తనను మించిన వాడు లేడని విర్రవీగేవాడు. ఎవరైనా జ్యోతిష్యుడు ఆ వూరులోకి వస్తే వాళ్లను పదిమందిలోనూ పరీక్షకు పెట్టి నవ్వుల పాలు చేసేవాడు. ఒకరోజు రామశాస్ర్తి అనే పండితుడు ఆ వూరు వెళ్లాడు. రామశాస్త్రిని చూసిన భద్రయ్య ‘‘నీదే వూరు, నీకు జ్యోతిష్యం నేర్పిన గురువెవరు, ఏ పుస్తకాలు చదివావు’’ అంటూ ప్రశ్నించాడు. దానికి రామశాస్ర్తి వినయంగా బదులిచ్చాడు. అయినా రెచ్చిపోయిన భద్రయ్య ‘‘నా గురించి నీకు తెలియదు, జాతకాలు చెప్పటంలో దిట్టను, ఈ వూళ్లో నీకు మంచి నీరు కూడా పుట్టదని బెదిరించాడు. దీంతో రామశాస్ర్తి భద్రయ్య పొగరు అణచాలను కున్నాడు. గ్రామస్తులు ఇరువురికి పోటీ పెట్టారు. దారెంట వెళ్తున్న ఒక అపరిచితుడిని పిలిచి విషయం వివరించి చేయి చూపమని కోరారు. మొదట చంద్రయ్య ఆ వ్యక్తి చేయి చూసి ‘‘మీరు బాగా ధనవంతులు కానీ పరమ పిసినారిలు. మీ భార్య మాట జవదాటరు’’ అని జ్యోతిష్యం చెప్పాడు. ఆ వ్యక్తికి కోపం నషాళానికి అంటింది. అబద్దాలు చెప్పి అవమానిస్తావా అని మండిపడ్డాడు. తరువాత రామశాస్ర్తి అతని చేయి చూసి ‘‘ ఇతను లక్ష్మీపుత్రుడు, అడిగినవారికి లేదనకుండా దానం చేస్తాడు. మంచి అనుకూలవతి భార్యగా లభించింది’’ అని చెప్పాడు. ఈ మాటలకు పొంగిపోయిన ఆ వ్యక్తి ‘‘శభాష్‌ అంతా దగ్గరుండి చూసినట్టు చెప్పావు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం, ఈ భద్రయ్యకు ఏమీ తెలియదు’’ అన్నాడు. వెంటనే రామశాస్త్రి మీరు ‘‘నా శాస్త్రజ్ఞానానికి మెచ్చి బంగారు ఉంగరం కానుకగా ఇవ్వబోతున్నారు, పైగా మీకు దానకర్ణుడనే పేరు కూడా ఉంది.’’ అన్నాడు. దీంతో అతను ఇరకాటంలో పడ్డాడు. మనసులో తిట్టుకుంటూ ఉంగరం తీసిచ్చి తన దారిన పోయాడు. దీంతో రామశాస్ర్తి పరీక్షలో నెగ్గాడు. రామశాస్ర్తి గ్రామస్తులతో ‘‘నిజానికి ఈ భద్రయ్య గారు హస్తసాముద్రికంలో చాలా గట్టివారే. కానీ దానికి తోడు సమయస్ఫూర్తి ఉండాలి. లేకపోతే అర్థం లేని అహంకారం పెరుగుతుంది. అహంకారం అనర్థాలను తెచ్చిపెడుతుంది’’ అని హితవు చెప్పాడు.
 
 కె.కె.రావు
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.