అందరికీ జ్ఞాన దీపావళి
19-10-2017 01:54:07
లోకకంటకుడైన నరకాసుడిని వధించిన రోజు దీపావళి. హరివంశము ప్రకారం- సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుడిని తన దివ్య శస్త్రాలతో వధిస్తాడు. ఆ రాక్షసుడి మరణంతో ప్రజలందరూ ఆనందంతో దీపాలు వెలిగించుకొని పండుగ చేసుకుంటారు. ఇది ఒక కథ. దీపావళికి మరో విశిష్టత కూడా ఉంది. ఆశ్వయుజమాసంలో వచ్చే చిట్టచివరి తిథి అమావాస్య. సాధారణంగా అమావాస్యను పితృ సంబంధమైన తిథిగా భావిస్తారు. ఆశ్వయుజమాసంలో వచ్చే ఈ అమావాస్యను ప్రేత అమావాస్య అని కూడా అంటారు. ఆ రోజు యజపూజను ఆచరించి.. దేవతలను పూజిస్తే- పితృదేవతలకు స్వర్గప్రాప్తి లభిస్తుందని ఒక నమ్మకం. దీని గురించి భవిష్యత్పురాణం- ‘ఆశ్వయుజకృష్ణపక్షస్యచతుర్దాశ్యాం విధూదయే! తిలతైలేన కర్తవ్యం స్నానం నరక భీరుణా (ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం ఆచరించి).. ‘నరకాయ ప్రపదాతవ్యో దీపః సంపూజ్య దేవతాః(నరకంలో ఉన్న పూర్వీకులు స్వర్గానికి చేరటం కోసం దేవతలను పూజించాలి).. ‘చతుర్దశ్వాన్తుయే దీపాన్‌ నరకాయ దదన్తిచః తేషాం పితృగణాస్పర్వే నరకాత్స్వర్గమాప్నురయః (నరకం వైపు దీపం పెట్టి యమరాజును పూజిస్తే పితృదేవతలు నరకం నుంచి స్వర్గానికి చేరుతారు)- అని చెబుతుంది. ఇప్పుడు చాలా మందికి- కేవలం నూనె దీపం వెలిగించినంత మాత్రాన నరకనివృత్తి ఎలా అవుతుందనే సందేహం వస్తుంది. దీనికి ఒక విస్తృతార్థం ఉంది. దక్షిణామూర్తి ఉపనిషత్తులో శ్రీ మార్కండేయ మహాముని శౌనకాదులకు ఈ దీపం వెలిగించటం వెనకున్న తత్వాన్ని బోధించారు. వైరాగ్య తైలసంపూర్ణే భక్తి వర్తిసమన్వితే
ప్రబోధపూర్ణపాత్రేతు క్షిప్తిదీపం విలోకయేత్‌.. అని వివరిస్తారు. ఆశ్వయుజ అమావాస్య తర్వాత కార్తీక మాసం వస్తుంది. కార్తీకమాసమనే శబ్దం కృత్తికా నక్షత్రప్రధానమైనది. ఈ నక్షత్రానికి అధిదేవత అగ్ని. ఈ నక్షత్రం జ్ఞానదీపాన్ని సూచిస్తుంది. ఇక కృష్ణపక్షం అంటే నల్లటి రంగు. నలుపు అవిద్యకు చిహ్నం. ఇక చతుర్దశి అంటే పదునాల్గవది అని అర్థం. జ్ఞానేంద్రియాలు అయిదు, కర్మేంద్రియాలు అయిదు, నాలుగు అంతఃకరణాలు కలిపి పద్నాలుగు అవుతాయి. వీటిలో పద్నాలుగోది అధ్యాసరూపమైన అహంకారం. దీనిక ప్రతీక నరకాసురుడు. ఈ అహంకారాన్ని తొలగించేది జ్ఞానమనే దీపం. ఈ దీపాన్ని వెలిగించటం ద్వారా మన అజ్ఞానాన్ని పారద్రోలుతాం.
శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.