ADVT
అలసిపోకుండా కథలు చెబుతూనే ఉంది
17-10-2017 01:34:59
హిందువులంతా భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని తమ ఇంటికి ఆహ్వానిస్తూ జరుపుకొనే పండుగ ధన త్రయోదశి. ఆ రోజున ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయడం కద్దు. దీనివల్ల లక్ష్మీదేవి తమ ఇంట్లోనే కొలువై ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పండుగ ఎలా ప్రారంభం అయిందో తెలిపే కథ ఒకటుంది. అదేంటంటే.. ఒకప్పుడు ఉత్తరభారతదేశాన్ని హిమ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతనికి లేక లేక ఒక అబ్బాయి పుట్టాడు. యువరాజుకు యమగండం ఉందని.. పెళ్లయిన నాలుగోరోజుకే పాము కాటుతో మరణిస్తాడని జ్యోతిష్కులు చెప్పడంతో.. రాజు ఆ బాలుణ్ని అతి జాగ్రత్తగా పెంచాడు. ఎక్కడికీ ఒంటరిగా వెళ్లనిచ్చేవాడు కాదు. యువరాజు యుక్తవయస్సుకు వచ్చాక.. మంచి రాకుమారినిచ్చి వివాహం జరిపించారు. పెళ్లయిన మర్నాడు రాజు తన కోడలిని పిలిచి- ‘‘అమ్మా! నీ భర్తకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. జాతకం ప్రకారం వివాహమైన నాలుగోరోజున నీ భర్తకు మరణగండం ఉంది. అతనిని కాపాడుకొవాల్సిన బాధ్యత నీదే..’’ అని చెప్పాడు. యువరాజు భార్య బాగా ఆలోచించి.. తన వద్ద ఉన్న అన్ని ఆభరణాలను, బంగారు వస్తువులను తీసుకువెళ్లి ద్వారం ముందు కుప్పగా పోసింది. దీంతో ఆ ద్వారం మూసుకుపోయింది. ఆ తర్వాత శయనమందిరం నిండా దీపాలు వెలిగించి కాంతితో నింపేసింది. ఆ తర్వాత యువరాజు నిద్రపోకుండా రకరకాల కథలు చెప్పటం మొదలుపెట్టింది. మరోవైపు.. యువరాజు ప్రాణాలు తీయటానికి యమధర్మరాజు ఒక పాము రూపంలో కోటలోకి ప్రవేశించాడు. యువరాజు శయనగారం దగ్గరకు వెళ్లే సరికి- అక్కడ తళుక్కుమంటున్న ఆభరణాలు కనిపించాయి. వాటిని చూసి అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. లోపలికి తొంగి చూసేసరికి- అక్కడ దీపాల వెలుగులో యువరాజుకు కథలు చెబుతున్న మహిళ కనిపించింది. ఆయనకు విషయం అర్థమైంది. భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు తనకు చేతనైనంతలో ప్రయత్నిస్తున్న ఆ యువరాణిని చూసి ముచ్చట వేసింది. దీంతో.. ఆమె ఎంత పట్టుదలగా ఉంటుందో పరీక్షించటానికి గుమ్మం దగ్గరే వేచి చూడటం మొదలుపెట్టాడు. ఇలా మూడు రోజులు గడిచిపోయాయి.
కానీ యువరాజు భార్య మాత్రం అలసిపోకుండా కథలు చెబుతూనే ఉంది. ఆమె పట్టుదలకు, పతిభక్తికి మెచ్చి యమధర్మరాజు యువరాజు ప్రాణాలను తీయకుండా వదిలేసి వెళ్లిపోయాడు. అలా బంగారు ఆభరణాలను అడ్డుగా పెట్టి యువరాణి తన భర్తను రక్షించుకుంది కాబట్టి.. ఆ రాజ్యంలో ఉన్నవారందరూ ఏటా ఆ రోజున బంగారం కొని పండుగగా జరుపుకోవడం మొదలుపెట్టారని లోకోక్తి. ఆశ్వయుజ మాసంలో పదమూడో రోజు వచ్చే పండుగ కాబట్టి ధనత్రయోదశిగా వ్యవహరిస్తున్నారు. దక్షిణ భారత దేశంలో తక్కువ కానీ ఉత్తర భారతంలో దీపావళి అమవాస్యకు రెండు రోజుల ముందు నుంచి వేడుకలు జరుపుకొంటారు. అవి ధనత్రయోదశితో ప్రారంభమై భగిని హస్త భోజనం (భాయ్‌దూజ్‌)తో ముగుస్తాయి.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.