భగవంతుడి లెక్కలు
15-10-2017 01:51:35
ఇవాళ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు. గతంలో ఇదే జీవుడు ఏ శరీరంలో ఉన్నాడో తెలియదు. ఏదో శరీరంలో వుండి ఏదో తప్పిదం చేశాడు, ఏదో పాపం చేశాడు, పుణ్యం చేశాడు. ఆ పాపమైనా, పుణ్యమైనా అనుభవించే పోవాలి. పాపం అనుభవ స్వరూపంగా పోవటానికి దుఃఖం; అలాగే పుణ్యం అనుభవంగా పోవటానికి సుఖం, రెండింటికీ లెక్క ఇవ్వాలి. వీడు గతంలో చేసిన పాపమెంత, పుణ్యమెంత? ఎంత సుఖపెట్టవచ్చు? ఎంత దుఃఖపెట్టవచ్చు? ఇది లెక్క కట్టగలిగినవాడే లెక్కచెప్పి నీ ఎదుట నిలబడి నీ పాపపుణ్యాల ఫలితాన్ని నీకివ్వడు.
 
ఆయన వెనక నిలబడి గమ్మత్తుగా లెక్కకట్టి, ఆ లెక్క సారాంశంగా సుఖదుఃఖములనిస్తాడు. ఆ పరమేశ్వరుని మనం పట్టుకొని నిలదీయడానికి ఆయన మన కన్నుల ఎదుట కనబడేవాడు కాడు. మాంస నేత్రాలకు గోచరము కాడు. కాబట్టి ఈశ్వరుణ్ణి నిలబెట్టి ప్రశ్నించడం సాధ్యం కాదు. ఆయన ఏ ఫలితాన్నిచ్చాడో ఆ ఫలితాన్ని పరతంత్రులమై అనుభవించటమొక్కటే మనం చేయగలిగిన పని. అది కూడా భక్తితో కూడుకున్నది.
 
దుఃఖం వచ్చిందనుకోండి, నాకు భగవంతుడు దుఃఖమిచ్చాడని బాధ పడకుండా, నేను ఏ జన్మలోనో ఏదో పాపం చేసి వుంటాను, దానికిప్పుడు దుఃఖమిచ్చాడు. ఈశ్వరా! ఇప్పుడు దుఃఖం ఎంత బాధాకరమో తెలుసుకున్నాను కాబట్టి దుఃఖమునకు కారణమైన పాపం నాచేత చేయబడకుండుగాక. కాబట్టి నాకు దైవం నందు పూనిక కలుగుగాక! అని భగవంతునికి నమస్కరించగలిగిన ప్రజ్ఞ అంకురించటం నిజమైన పరిణతి కలిగిన భక్తిని పొంది వుండటం. అందుకే ధూర్జటి
‘నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్నఈ
జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసారమోహంబు పై
కొననీ, జ్ఞానముగల్గనీ, గ్రహగతుల్‌ కుందింపననీ, మేలు వ
చ్చినరానీ, యవినాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా!’
 
అని అంటాడు. అలా ఉండగలిగిన పరిణతి ఈశ్వరుని కృపచేత మాత్రమే సంభవమవుతుంది.
అటువంటి కాలం పరమ బలవత్తరమైన స్వరూపం. అది ఈశ్వర స్వరూపంగా వుండి, ఈ సుఖదుఃఖముల రూపాల్లో పాపపుణ్యాలను అనుభవించేసి, దాని వల్ల కంటికి కనబడని ఈశ్వరుని ప్రజ్ఞని గుర్తెరిగి ఆయన పాదాల యందు నిరతిశయమైన భక్తిని పెంపొందింపజేసుకుని కృతార్థుడు కాగలిగిన వ్యక్తి ధన్మాత్యుడు.
(కార్తీక మాస మహత్యం పుస్తకం నుంచి)
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.