ADVT
ఇలా ఎలా వెడతావోగదా మోహన్‌!
24-09-2017 23:26:02
(స్మృతి వచనం)
అజంతా, త్రిపుర, పతంజలి, కేశవరెడ్డి, వారి ముందు హరి, చేరా లాంటి పెద్దలంతా వెళ్లిపోతోంటే మోహన్‌ అన్న మాట జ్ఞాపకం వస్తుంది. ‘‘ఏంటబ్బా... టేబులు, సొరుగులు, పుస్తకాల అర అన్నీ ఖాళీగా వున్నట్టుందబ్బా’’. తనూ వెళ్లిపోయిన రోజున ఇదే అనిపించింది.
 
ఏం జ్ఞాపకాలో!? అసలు ఎందుకు ఇవన్నీ? అని వజీర్‌ రెహమాన్‌ లాగా, బైరాగి లాగానో నిశ్శేషంగా అన్నీ వొదిలేసుకుని వైరాగ్యాన్ని పట్టికూచోడమా, లేదా పరిణామ క్రమంలోకి చేరేలోగా మనం మనసులో ఓ సరికొత్త అడవిని పచ్చగా పుట్టించి సరిపడా ఆక్సిజన్‌ని నింపుకోడమా? రెండూ అంత సులువై నవి కావని ప్రతి మరణ ధ్వనీ చెబుతుంది కదూ... మరణం వల్ల విచారం మోహన్‌కి లేనట్టే వుంది. ఎటొచ్చీ మరణం ఒక సందర్భం మాత్రమే అని సరిపెట్టుకుని నల్లసిరాలో క్రొక్విల్‌ ముంచి సరసర గీతలు గీసే మోహన్‌ను గుర్తు చేసుకోవడంలో ఆనందమే వుంది... మిగిలి.
 
అదేదో వాద్యంలా మీసం కొసని కొనగోట మీటుతూ బొమ్మలు గీస్తున్నప్పుడు ఎప్పుడూ మోహన్‌ వంటరిగా లేడు--లేక, వుండనీరు ఎవరూనూ. అదో సత్సంకల్పం లాటి నిత్యదృశ్యం--పూర్వం పత్రికల ఆఫీసుల్లో గానీ, తన సొంత ‘ఆఫీసు’ వంటి ఆశ్రమంలోగానీ. అలాగే ముందు ఇల్లు, ఆ తరువాత ఇల్లంటూ లేనట్టు మిత్ర బృందగానం గల గదిలో గానీ... ఏదైనా ఎప్పుడూ ఆయన మహిమ ఒకటే. ఆయన బొమ్మ వేసేటప్పుడు గదా పతంజలి సిగరెట్టు ధరించి వస్తారు. ‘‘డోంట్‌ వర్రీ మిస్టర్‌ మోహన్‌.. చిన్న ఐడియా చేద్దాం..’’ అంటూ ఏమాత్రం గిట్టుబాటు గాని ఒక ‘ఐడియా’ సరఫరాచేస్తే మోహన్‌ దాన్ని ఓమాత్రంగా కూడా పట్టించు కోక బొమ్మ పనిలోవుండి కొద్దిపాటి చిరునవ్వు కలిపిన తేలిక పాటి వర్షంలా సరదా కురిపించేవాడు. ఐడియా పారని పతంజలిగారు ఆ వెనువెంటనే ఖాళీ గ్లాసులకు అలంకారం కల్పించేదొకటి నింపి, సిగరెట్టు అదనపు విలువలో డాస్టోవ్‌స్కీ నుంచీ నందిగం కృష్ణారావు కథ వరకు సకలం బల్ల మీద పరిచేవారు. నందిగం వొచ్చి నాలుగు రూపాయ లొచ్చే కేసుని వదులుకున్నా నష్టం లేనట్టు ఇష్టమైన కథలని బహుచక్కగా, మనం వేరే చదవనవసరం లేనంత గొప్ప దృశ్యం చేసి చూపెట్టేవారు. కిటికీలోంచి చల్లగాలిలా, నింపాదిగా రామకృష్ణారెడ్డి వచ్చీరాగానే శ్రీమతి నూతన్‌ గారిని దేవానంద్‌ ముద్దు అడిగినట్టు సిగరెట్టు కోరే మోహన్‌కు తగుమాత్రపు సూచన చేరేది ‘రెండు’ అదనమని. ముద్దు బదులు ఇందాకటి నూతన్‌ పువ్వు ఇచ్చినట్టే రామకృష్ణ సిగరెట్లిస్తే మోహన్‌కు పని జరిగినంత పనయ్యేది. రెండో సిగరెట్‌ చేతులు మారేది. అప్పుడే నామిని ‘వచ్చినాడు, పూడ్సినాడు’ అనుకునేలోగా ‘పచ్చనాకు...’లోని తియ్యటి మాటలు దొర్లేవి. దేవిప్రియగారి పద్యానికి సకాలంలో బొమ్మ వేడి ఇడ్లీలా తయారుకావలసిన జరూరు వేళలోనే అట్టే సమయం లేనట్టు అనువాద సమస్యల కొత్త సబ్‌ఎడిటర్‌ కుర్రాడు భయంగా అక్కడికి జొరబడి సందేహ నివృత్తి చేసుకుని పోవటం.. ఆ వెంట స్థానిక మన కోకిల రఘుతో పాటు పాట ప్రవేశిస్తుంది.. సరిగ్గా అక్కడే ‘కవర్‌పేజీ’ కోసం వచ్చే విప్లవ సాంకేతిక నిపుణులు రేపు సాయంత్రంలోగా భారతదేశానికి విప్లవం తెచ్చిపెట్టే బ్లూప్రింట్‌ను మాటల్లో దొర్లిస్తారు. ముద్దుకృష్ణగారు తమ వైతాళికుల పుస్తకం కూర్చేవేళ తెలుగు కవుల పోస్టుకార్డుల కుప్పలతో ఎలా వేగేవారో ఏమోగాని మోహన్‌ మాత్రం సమస్త జంత్ర వాద్య గోష్టిలో బొమ్మలు వేసుకుపోవడంలో ఎంతో వేగవలసి వచ్చేది... ఇష్టంగానే.
 
ఒక కాలంలో మోహన్‌ ప్రాంగణం సకల కవి సమ్మేళనం, రచయితల సదస్సు, పుస్తక విక్రేతల, సంపాదకుల చిరునామా, ఆల్‌పార్టీ హిల్‌ లీడర్స్‌ కాన్ఫరెన్స్‌ లాగ వివిధ పార్టీల పోస్టర్‌ ఫ్యాక్టరీ! ఆపై పోరాటాల పురిటిగడ్డలు ఉత్పత్తిచేసిన పాటల రికార్డింగ్‌ హోరు సెంటర్‌, కాలమిస్టుల ‘కచ్చేరీ’. వాద, వివాదాల, పరిష్కారాల సామరస్య కేంద్రం-- అన్నిటి గోష్టికి అవతల ‘పైసా వసూల్‌’ మాట ఎలా వున్నా, ఎలాగో ఓలాగ అక్కడ నేరేడు చెట్టుగావచ్చు, నందివర్థనం మొక్క కావచ్చు, తంగేడుపూలు కావచ్చు డబ్బునోట్లు పూసి రాల్చేవి. అడపాదడపా పుస్తకావిష్కరణ సభాస్థలిగా అదే ప్రాంగణం కొందరికి అచ్చివచ్చేది. మోహన్‌ కార్యాలయం చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు సర్వ మిత్రుల అవసరాలు తీర్చి, దిద్ది పెట్టేది. అందుకే నగరంలో మోహన్‌ అడ్డా, రెండవో, డెన్‌ (ఈమాట ఎవరో అన్నారు) వగైరాలకు దగ్గర, దూరం అంటూ లేదు. ప్రయాసపడి జిజ్ఞాస భారం మోయువారంతా స్థానిక రైలో, బస్సో, స్వీయ కారో, పర కారో, పరస్పర వాహనమో పట్టుకుని వచ్చి, ఆలస్యంగానే ఏ మూలకైనా చేరుకునేవారు. నన్నొక్కని బ్రోవ భారమా అన్నట్టు సాహిత్య, సాంస్కృతిక, కళా వర్గాల వారే గాక శృతపాండిత్యం సాధించడం కోసం ఏరికోరి వచ్చేవారూ ఉండేవారు. కనుక మోహన్‌ సహనం ‘‘రక్కసి తాల్మి’’ వంటిదే. ఎప్పుడేనా సి. రామచంద్రరావు గారో, నగ్నమునో, సురేంద్రరాజో, కేశవ రెడ్డో, చేరా వారో వచ్చి పోతుంటారని తెలిస్తే మోహన్‌ ప్రాంగణానికి చేరనివారెవరు గనుక. నిజవాగ్గేయకారుడు గోరటి వెంకన్న నాట్యముద్రలో పాడుతోంటే మోహన్‌ కుంచె సాగుతోంటే ప్రేక్షక శ్రోతలు, పాఠక, పాత్రికేయూరబాహులూ వచ్చిపోనిదెవరన్నట్టే వుండే సమాశ్రయం మోహన్‌ ఆశ్రమం. ఇదంతా చూస్తోంటే ‘‘మోహన్‌ ఇక బొమ్మలు ఎలా వేస్తాడ్రా నాయనా, వీని పని అయిపోయినాది’’ అనుకునేవారి నోరు మూయించినట్టే పుస్తకం అచ్చుయంత్రానికి చేరే వేళకి మోహన్‌ బొమ్మలు విచ్చేసేవి, సదరు రచయిత శాంతించే వాడు. ‘‘నాకు అదేం లేదబ్బా ఎక్కడ యినా, ఎలావున్నా బొమ్మ వేసేస్తా... ఇంకు, బ్రెష్షు, క్రొక్విల్‌తో పాటు నోటికి కూడా ఏదేనా వుంటే సరి... లేకుంటే సరేసరి... పని ఆగదబ్బా’’ అనే మోహన్‌ ఇప్పుడు గడపదాటి అవతలికి ఎక్కడికో వెళ్లిపోవటం.. ఖాళీచేసిన రంగస్థలంలా.. పెరవారికి చోటొసంగుచు... త్వరపడి వెళ్లినట్టే కదా!
 
సరే, పోనే పోయాడు గానీ పోతూ పోతూ ఒక ఉత్సవాన్ని, ఒక చిరునా మాను, ఒక కూడలిని లాల్చీజేబులో వేసుకుపోవడం ఏంబావుందని మోహన్‌ గురించి అనుకుని ప్రయోజనముందా?! ఎప్పటికీ ఒకటే ఆశ్చర్యం... మూడవ తరగతి పేసింజరు రైలు పెట్టె వంటి కార్యాలయంలో సకల ధ్వనుల మధ్య బహుచంచలతర సుఖ సిద్ధుల మధ్య బొమ్మ ఎలా సాగుతుందో నా సామి రంగా! మోహన్‌ చేతివేళ్లు అంత బాహాటంగా, భోళాగా, నట్టనడిరోడ్డున, నట్టింటి వంటలా ఎలా పని జరిపి స్తాయో గదా దేవుడా!
 
కార్టూనిస్టు సురేన్ద్ర, రాజు, శంకర్‌ ఇలాగే విస్తుపోతారు. ఇప్పుడేవీ మోహన్‌ బృందం, చేతివేళ్లూ, క్రోక్విల్‌! ఎక్కడికో... ఆకాశపు లోతుల కావలో, ఆ పైనో, మహర్వాటి దాటి... పోతే పోనిస్తురూ! లెల్లె సురేష్‌ గొంతు, వసంత మాటలు, రమాకాంత్‌ మొహమాటం, రాజు జోకు, నాయుడు కవిత చదవటం ఎప్పుడేనా గదా కనిపించి వినిపించేవి. అవన్నీ కోరుకునేవారికి ఒక దగ్గర అందుబాటులో తెచ్చిపెట్టగల్రా ఇప్పుడు ప్రకాషూ?! (‘‘చిన్నా’’)
 
మర్రిచెట్టు నీడలో మరేవీ పెరగవని చెప్పే సామెతకి పూర్తి విరుద్ధ దృశ్యం మోహన్‌ అనే వటవృక్షం. ఆయన నీడనే స్త్రీ పురుషులు అనేకానేకులు బొమ్మలు వేయడం ఆరంభించి, వున్నది మరింత పెంపొందిం చుకుని, తెలుసుకుని ఎదిగిపోయారు. వారిలోనే గదా ముఖ్యులు శంకర్‌, అన్వర్‌లు! పరోక్షంగా మోహన్‌ ప్రోత్సాహం పొంది కదా లక్ష్మణ్‌ ఏలె లక్ష్మణ్‌ అయ్యారు. రమాకాంత్‌ ప్రదర్శనలకు ఎదిగారు.
 
పుస్తకాల జోలికొస్తే వాహకం, వాహనం మోహన్‌, ఆయన అడ్డా. ఎందరెందరికో సోవియెట్‌ సాహిత్యం, బొమ్మల పుస్తకాలు, వస్తుమార్పిడిలో నీ పుస్తకం వారికి, వారి పుస్తకం మరొకరికి, వేరెవరిదో పుస్తకం మనకి, మన మహాగ్రంథం ఇంకెవరెవ్వరికో వెళ్ళి రావటం జరగనే జరిగింది. ఇక లేనిదల్లా లేదన్నట్టు ఎన్నెన్నో పుస్తకాల్ని మిత్రులంతా మహానందించగా కొన్నాళ్లకి కొందరు మిత్రుల వంటి శత్రువులు, హితులు, సన్నిహితులూ అపురూపమైన ఆర్ట్‌పుస్తకాలని, ఇతర గ్రంథాలని అమాంతం తరలించిం దేగాక, అమ్మిపడేసేరు, అవతల పారేసేరు. మోహన్‌కు కడుపు గంగాధర్‌గారు శ్రమించి అందించిన ఎన్నో పుస్తకాలు ఎన్ని పోలేదూ?! చదివి ముచ్చటపడటం కోసం అయితే మోహన్‌ ప్రాంగణం అనే ఉచిత గ్రంథాలయం తాళం పాడూ లేకుండా నిరంతర సరఫరా చేసిన రోజులే రోజులు. మోహన్‌కి ఇచ్చిన పుస్తకాలు ఆయన అతి ఉదారత వల్ల ఓ చేత్తో అందుకుని మరో చేత్తో ఇంకెవరి కోసమో ఇచ్చిన సహృదయుల జాబితా లేదు. ఏదీపట్టనితనం మంచి కోణంలో, మరో కోణంలోనూ మోహన్‌కి అసహజ కవచకుండలాలయ్యాయి మరి... ‘‘అలాగని పెద్ద బాధా లేదు’’ మోహన్‌కు.
  
కార్టూన్‌ స్ట్రిప్‌లు, కామిక్కులు, కేరికేచర్లు, డ్రాయింగులు, స్కెచ్‌లు, కేలెండర్‌లు, పోస్టర్‌లు, కవితల వంటి సనసన్నటి రెపరెపలాడే గీతలు వేలాదిగా మోహన్‌ సృష్టించినవన్నీ ఒక ఎత్తు... అయితే బాపు తర్వాత అవే అక్షరాల్లో సరికొత్త విరుపులు సృష్టించి దశాబ్దాలుగా ఉభయ రాష్ట్రాల్లోని మారుమూల ఊళ్లలో గోడల మీద మోహన్‌ సంతకం అన్నట్టే స్లోగన్‌లు కనిపిస్తూ వచ్చాయి. మరి క్రమంగా ఇకపై ‘‘వెల్ల వేసిన గోడలేమో తెల్లబోతాయి’’ కాబోలు! అజంతా, త్రిపుర, పతంజలి, కేశవరెడ్డి, వారి ముందు హరి, చేరా లాంటి పెద్దలంతా వెళ్లిపోతోంటే మోహన్‌ అన్న మాట జ్ఞాపకం వస్తుంది. ‘‘ఏంటబ్బా... టేబులు, సొరుగులు, పుస్తకాల అర అన్నీ ఖాళీగా వున్నట్టుందబ్బా’’. తనూ వెళ్లిపోయిన రోజున ఇదే అనిపించింది.
 
మోహన్‌ రాసినవన్నీ కలబోసి జ్ఞాపకం చేసుకుంటే ఆయనలో కార్టూనిస్టు, చరిత్ర పాఠకుడు, కళా పరిశోధకుడు, సద్విమర్శ కుడూ, నిర్మొహమాటంగా ముందుకొచ్చి క్యూలో నిలబడతారు. కాలక్షేపపు సరదా చెణుకులు, వెర్రివాగుళ్లకి ప్రతివిసుర్లు, ఏవో ఈసడింపు మాటల్లాటి, నేలబారు విమర్శ ల్లాటి కార్టూన్లు విదేశీయుల కంటే మన తెలుగు వారికి మరింత పరిచయం గనుక అసలు కార్టును సమస్య ఏమిటో, ఆవశ్యకత ఏమిటో, సకల పత్రికలకు మెయిన్‌ హెడ్డింగ్‌ లాంటి కార్టూన్‌ ప్రయోగంలో జర్నలిజపు సిసలు రూపాన్ని కొన్ని స్ట్రోకుల్లా తాపీగా విశ్లేషించే మోహన్‌ చాలా రోజులుగా ఆ పనికి పదును పెట్టకుండా వుండిపోవటమే దిగులనిపిస్తుంది. బొమ్మల పనితనానికి సంబంధించిన స్వస్వరూప జ్ఞానం, ప్రపంచ రాజకీయ విశ్లేషణ దృష్టి లేని కార్టూనిస్టుల కార్టూన్‌లు చీకటి మహాసముద్రంలో వెలిగించని అగ్గిపుల్లలు విసిరేసినట్టేనని తన మాటల్లో మోహన్‌ చెప్పినప్పుడు ముందు మనకి మామూ లుగా కబుర్లాడినట్టున్నా కాస్త నిదానించి చూస్తే కళ కోసం, దాని పర్యవసానం కోసం పడి గింజుకునేవాడి అసహనం, హద్దుల్లేని కోపం అర్థమయి, విషయం విస్తారంగా కనిపిస్తుంది. అది మోహన్‌ చదివిన, చూసిన, పరిశీలించిన పుస్తకాల సారం, బొమ్మ సారం, కళ సారం. మోహన్‌ రాతలంటే చేరాకి మహా యిష్టం. నిలవ వాసనవేసే నాసిరకం నూనె మరకల్లాంటి వట్టి మాటల పోగుల కాలమ్‌లు, వ్యాసాలు, పాంప్లెట్లు మోహన్‌ రాతల ముందు, మాటల ముందూ నోరు కుట్టేసినట్టు పడి వుండాల్సినవే ననిపిస్తుంది. పరమత సహనం వంటి స్థాయిలో ప్రతివారి బొమ్మలు, గీతలూ పైపైన చూస్తున్నట్టే కనిపించినా నిశితంగా లోతు చూసి చెప్పే మోహన్‌ మాటలు ఎప్పుడూ పొట్టివే. అందుకే కుర్ర కార్టూనిస్టులు, ఇలస్ట్రేటర్‌లు, భావి సెలబ్రిటీలూ మోహన్‌ వచనం కోసం, ఉదహరించే చిన్న గీత కోసం, ఆయన సగం బొమ్మ గీసి అవతల పడేసిన కాగితాల ట్రోఫీల కోసం ఎదురుచూసేవారు. వీరందరి స్వానుభవరాసులన్నీ ఒక పుస్తకంగా వస్తే ‘ఇల్యూషన్‌ ఆఫ్‌ లైఫ్‌’ పుస్తకంలో యానిమేటర్‌ల స్వగతాల వలె ఆసక్తి పెంచే మోహనిజం కొత్త తరం ఆర్టిస్టులకు పనికొస్తుందనిపిస్తుంది. పొయెమ్స్‌ ఇన్‌ మేకింగ్‌, పొయెట్రీ అండర్‌ కన్‌స్ట్రక్షన్‌ వంటి కవిత్వ పరిణామ దశల పుస్తకాలని అచ్చువేసినట్టే! ఇందరి ఆర్టిస్టుల అనుభవాల్లో మోహన్‌ సూచనలు, కోప్పడిన తీరూ పాఠాల్లాంటివే.
 
ఒక్కోసారి పికెడెల్లీ ముచ్చట్ల వలె మోహన్‌ - పతంజలి, మోహన్‌ - కేశవరెడ్డి, మోహన్‌ - చందు సుబ్బారావు గారో, చేరాగారో, మరొకరో సాగించిన కబుర్లలోని ఆప్త వాక్యాల్లా ్లటివో, శ్రమ తెలీకుండా మురిపించే సహృదయపూర్వక జోకులో స్నిప్పెట్లలా సేకరిస్తే అచ్చుపోయవచ్చనిపించిన సందర్భాలెన్నో జ్ఞాపకాల్లా వున్నాయి. ‘‘హమ్మ! నిన్నటితో రెండోసారి ‘క్వయట్‌ ఫ్లోస్‌ ది డాన్‌’ పూర్తి చేసేనబ్బా... అందులో గురూ...
కిక్కురుమనకుండా వినండబ్బా’’ అంటూ మోహన్‌చెప్పే మాటల్లో పుస్తకాల పాత పేజీల సువాసనతో సహా రష్యన్‌ మ్యూజియంలో వెచ్చని కోటువేసుకుని నడుస్తు న్నట్టుండేది. కాన్‌డిస్కీ బొమ్మల్లో రంగురంగుల మనుషులు ఎగురుతున్న వివరాలు, బిర్చి చెట్ల నీడలు, జార్జియన్‌ చిత్రకారుల రంగుల కంబళి వంటి జానపద బొమ్మల అసాధ్యపు వివరాలూ ఎన్నో ఏరులా మన భుజం పక్క నుంచీ పారినట్టవుతుంది. ఫేసుబుక్కులో నున్నా, అన్వర్‌లు రాసినవి గతంలోవీ, ఇప్పటివీ చూస్తోంటే అవన్నీ మళ్లీ మోహన్‌తో తిరగతోడించుకుంటే ఎంత బావుండున నిపిస్తుంది.
 
కేరళలో వాగమన్‌ కొండల టీతోటలు, లవంగాల వాసన మోసుకొచ్చే గాలి, బొంబాయిలో పికాసో ఒరిజినల్స్‌ ప్రదర్శన స్థలంలో నడక, కారు, రైలు ప్రయాణాల్లో కబుర్లూ వెరసి మోహన్‌ సైడ్‌లైట్‌లు ఏవో విచిత్ర దీవుల్ని చూపే లైట్‌హౌస్‌ వెలుగుల్లా వుండేవి. చిన్ననాటి సర్కస్‌ సెర్చి లైట్‌లా మోహన్‌ గీతలు, రాతలు కలగలసిపోయి ఏవో డిజావులో ముందుకీ వెనక్కీ లాగించే స్వప్నవాహనంలా వుండేవి. చెట్టుకొమ్మకి కట్టిన ఉయాల్లా ‘రారారాబ్బా’ అని పిలుస్తాయవి. ఆయనతో కార్టూన్‌ స్ట్రిప్‌లు, బొమ్మలూ మాత్రమే కాదు, యానిమేషన్‌ స్టోరీ బోర్డుకు, ఐడియాలకు పనిచేసిన నాలోని చిన్న కుర్రాడికి ముచ్చట తీరలేదు. నా వరకు ఆర్ట్‌ పుస్తకాలు, తన బొమ్మలు, వాటి ముందు వెనుకల ముచ్చట, యానిమేషన్‌ ఫెయిల్యూర్‌ ఘటనలూ ఆక్సిజన్‌ ఇచ్చేవీ, తీసేసేవీనూ. మోహన్‌ ఒక అడవి. అడవిలో వుండాల్సినవన్నీ వుండేవే, దారి చూపే చెట్ల భాష, దారి తప్పించే దృశ్య సమూహం సైరన్‌లలాగ వుంటేనేం.. ఏది ఏమో గమనించుకుపోడంలో మోహన్‌ గురించిన జ్ఞాపకాలు చెట్ల పచ్చదనమే నింపాయి, నాలా ఎందరికో.
 
పదేళ్లపైగా మోహన్‌ ఏం చదివేరో, ఏమంత బొమ్మలు వేసేరో గానీ, రొహింగ్యాలో, దొంగ సన్మానపు సాహిత్య ప్రయోజనాలో, ఢిల్లీ కేంద్రపు దేశవాళీ ద్రోహమో, ఏది పత్రికల్లో ఎదురయినా, చక్కని చిరునవ్వే చెట్టువలె మోహన్‌ గుర్తొస్తాడు--వాటికి కార్టూనో, బొమ్మో గీస్తాడేమో నని జ్ఞాపకం చేస్తున్నట్టు అపరాత్రి వేళల్లోనూ ఫోన్‌ చేసి చూసేను--ఏం లాభం?! చేయాల్సిన పని భారం బోలెడు పోగులు పడివుండగా మోహన్‌ వడివడిగా ఇదేం వెళ్లిపోవడం? తమ ‘ఒక వెళ్లిపోదాం’ ఇక రానట్టే కదా, మరి లేనట్టే కదా--సుదూరంగా కొండల నీడల్లో పొలాల గట్ల కవతల నుంచి ఎవరో ఎవర్నో కేకేస్తున్నట్టు అర్థమయీ అవని సాంధ్య భాషలా... తను విసవిసా వెళ్లనే వెళ్లాడు. చిత్తప్రసాదు బొమ్మల కోసం పడ్డ శ్రమ వంటి దేదీ గొంతెత్తి ఎంత పిలిచినా తిరిగిరాని చోటికి వెళ్లిపోతే మేం మాత్రం నిన్ను ఏమని పిలుస్తాంలే మోహన్‌...
 శివాజీ
99591 78453

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.