మరణాన్ని కట్టడి చేస్తారా?
13-09-2017 23:26:46
ఒక రాజుకు ఉన్నట్లుండి మరణ భయం పట్టుకుంది. శత్రు రాజ్యం నుంచి గానీ, మరెవరి నుంచి గానీ తనకు ప్రాణాపాయం ఏర్పడకుండా, దుర్భేద్యమైన ఒక భవనాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా, పకడ్బందీగా సువిశాలమైన ఒక భవనాన్ని నిర్మించాడు. తన ఆలోచనలకు తగ్గట్లుగా అంత పెద్ద భవనానికి, ఒకే ఒక్క త లుపు, ఒకే ఒక్క కిటికీ పెట్టించాడు. ఆ త లుపు వద్ద, కిటికీ వద్ద వేలమంది సైనికులను పహరాగా ఉంచాడు. ఆ విషయం తెలిసిన అతని సన్నిహితుడైన మరో రాజు ఆ భవనాన్ని దర్శించడానికి వచ్చాడు.
 
ఆ భవనాన్ని చూసి అతడు ఎంతో సంతోపడటమే కాకుండా తాను కూడా అలాంటి భవనం ఒకటి నిర్మించుకోవాలనుకున్నాడు. అందుకు మీ నుంచి అందించగలిగే సహకారాన్ని అందించండి అన్నాడు. అందుకు సరేనన్నాడు రాజు. ఆ భవనాన్నంతా అణువణువూ పరిశీలించి ఆ భవన విశేషాల గురించి మాట్లాడుకుంటూ ఇద్దరు రాజులు బయటికి వస్తున్నారు. ఇంతలో ఆ భవనానికి కాస్తంత దూరంగా ఉన్న ఒక బిచ్చగాడు ఈ రాజు కేసి చూస్తూ పగలబడి నవ్వసాగాడు. రాజుకు చిర్రెత్తిపోయింది.
 
‘‘ఎందుకు నవ్వుతున్నావు?’’ అని కోపంతో ప్రశ్నించాడు. రాజు. అయినా మళ్లీ నవ్వాడు బిచ్చగాడు. ఆగ్రహం రెట్టింపయిన రాజు ‘‘రాజదండన ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియదా? అయినా ఎందుకు నవ్వుతున్నావసలు? ఏమైనా ఇంకోసారి నవ్వావంటే, చాలా తీవ్రమైన శిక్షపడటం ఖాయం’’ అంటూ హుంకరించాడు. అది విన్న బిచ్చగాడు ‘‘ రాజా! ఇన్నిన్ని ఏర్పాట్లు ఎందుకు? లోనికి వెళ్లిపోయి ఆ ఒక్క తలుపూ, ఆ ఒక్క కిటికీ కూడా మూసేసుకుని, మృత్యువునుంచి బయటపడ్డానని అనుకుంటే సరిపోతుంది కదా!’’ అన్నాడు.
 
ఆ మాటలకు ఆగ్రహం కట్టలు తెంచుకున్న రాజు, ‘‘ఒరే మూర్ఖుడా! అలా చేస్తే బతికి ఉండగానే సమాధి అయిపోయినట్లు కదరా?’’ అన్నాడు. అందుకు బిచ్చగాడు ‘‘ఇప్పుడు మీరు చేస్తున్న పని కూడా అదే కదా రాజా’’ అన్నాడు. అంతటితో ఆగకుండా ‘‘ఎన్నాళ్లు బతికినా మృత్యువు ఎవరినీ వదిలిపెట్టదు కదా! అప్పుడెప్పుడో వచ్చే మృత్యువును ఈ ప్రయత్నాలతో మీరు మరింత ముందే దగ్గరగా తెచ్చేసుకుంటున్నారు? రాజా ఇంత కంటే వింత ఏముంది చె ప్పండి’’ అన్నాడు బిచ్చగాడు. అది విన్న రాజుకు ఇది నిజమే కదా అనిపించింది. ఖైదీలా దశాబ్దాలు బతకడం కన్నా, స్వేచ్చగా కొద్ది రోజులు బతికినా చాలు కదా! అనిపించింది. బిచ్చగాడైతేనేమిటి రాజ్యమేలే రాజుకే ఇలా జ్ఞానబిక్ష పెట్టాడు.