15 రోజులైనా డేరా బాబాను చూడ్డానికి ఒక్కరూ రాలేదు..
13-09-2017 20:55:32
న్యూఢిల్లీ: చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహదేవా అన్నట్టుంది డేరా బాబా పరిస్థితి. అత్యాచారాలు, సుఖభోగాలతో అంటకాగిన డేరా బాబా రామ్ రహీమ్‌‌ జైలు పాలై 15 రోజులైనా ఇంతవరకూ ఆయనను చూసేంతకు ఆయన కుటుంబానికి చెందిన విజిటర్ ఒక్కరూ జైలుకు రాలేదు. వెరిఫికేషన్ కోసం జైలు అధికారులు పంపిన జాబితాలోని ఒక్కరూ ఇంతవరకూ డేరా బాబాను కలవలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. రామ్ రహీమ్ ఇటీవల జైలు అధికారులకు అందించిన 10 మంది సభ్యుల జాబితాలో ఆయన కుమారుడు జస్మీత్, దత్తపుత్రిక హనీప్రీత్ తదితరులున్నారు. అయితే రామ్ రహీమ్‌కు జైలుశిక్ష పడినప్పటి నుంచి హనీప్రీత్ ముఖం చాటేసి పరారీలో ఉంది. ఆమె కోసం లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన హర్యానా పోలీసులు నేపాల్ సరిహద్దుల్లోని పోలీస్ స్టేషన్లు అప్రమత్తం చేశారు. హనీప్రీత్ పోస్టర్లూ అంటించి గాలిస్తున్నారు. కాగా, జైలు వర్గాల సమాచారం ప్రకారం డేరా బాబా జైలులో డిప్రషన్‌లో ఉన్నారని, గత వారంలో రెండు సార్లు ఆరోగ్యం బాగోలేదంటూ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (పీజీఐఎంఎస్) వైద్యుల బృందాన్ని కూడా ఆయనకు వైద్య పరీక్షల కోసం జైలుకు పంపినట్టు కూడా చెబుతున్నారు. బాబా సెక్స్‌కు బానిసై తీవ్రంగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారనీ, తన కోరికలను సంతృప్తి పరచుకునే అవకాశాలు అందుబాటులో లేనందున అది విపరీత పరిణామాలకు దారితీసే అవకాశాలుండొచ్చని ఒక సైకియాట్రిస్ట్ పేర్కొన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే పీజీఐఎంఎస్ సైకియాట్రిస్ట్ విభాగం వైద్యులు మాత్రం రామ్ రహీమ్‌ను పరీక్షించేందుకు తమ డాక్టర్లెవరూ జైలుకు వెళ్లలేదని చెబుతున్నారు.