ఇర్మా, హార్వే వల్లే పెట్రోల్ ధరలకు రెక్కలట..!
13-09-2017 19:47:55
న్యూఢిల్లీ: దేశ ప్రజలను లూటీ చేసి ఖజానా నింపుకోవడానికే ఇటీవల కాలంలో ఇబ్బడిముబ్బడిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తున్నారంటూ కాంగ్రెస్ చేసిన ఘాటు విమర్శలకు కేంద్రం స్పందించింది. అమెరికాను అతలాకుతులం చేసిన హరికేన్ ఇర్మా, హార్వే కారణంగానే గత మూడు నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిపోయినట్టు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారంనాడు తెలిపారు. త్వరలోనే ధరలు తగ్గుముఖం పడతాయన్నారు. టెక్సాస్ హరికేన్ కారణంగా రిఫైనరీలలో ఉత్పత్తి 13 శాతం పడిపోయిందన్నారు.  పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో ధరల హేతుబద్ధీకరణకు జీఎస్‌టీనే మార్గమని, రోజువారీ ధరల యంత్రాంగం పారదర్శకంగా ఉంటూ వినియోగదారుడికి దీర్ఘకాలిక ప్రయోజానాలు చేకూరుస్తుందని తెలిపారు. గత జూలై నుంచి లీటర్ పెట్రోల్ ధర రూ.7.03కు పెరగడంపై అడిగినప్పుడు రోజువారీ ధరల రివిజన్‌‌ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రభుత్వం అనుకోవడం లేదని, సంస్కరణలు కొనసాగుతాయని చెప్పారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ పన్నును సమీక్షించే ఆలోచన ఏదీ లేదని కూడా ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు.
Tags : DHARMENDRA PRADHAN