రొహింగ్యా ఉగ్రవాదులకు పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు
13-09-2017 19:05:27
న్యూఢిల్లీ : రొహింగ్యా ముస్లింలను భారతదేశం నుంచి బహిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అంతర్జాతీయ సమాజం మన దేశాన్ని తప్పుబడుతోంది. వీరు పశ్చిమ మయన్మార్‌లో హింసాత్మక ఘర్షణల నుంచి తప్పించుకుని ఈశాన్య భారతదేశం గుండా మన దేశంలో ప్రవేశించారు. వీరి విషయంలో వ్యవహరించవలసిన విధానాన్ని నిర్ణయించేందుకు ప్రధాన మంత్రి కార్యాలయంలో మంగళవారం రాత్రి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహిత సలహాదారు నృపేంద్ర మిశ్రా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) సహా వివిధ నిఘా సంస్థల అధిపతులు పాల్గొన్నారు. రొహింగ్యా ఉగ్రవాదులకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు అనేక హెచ్చరికలు వస్తూండటంపై వీరంతా చర్చించారు.
 
మయన్మార్‌లోని రొహింగ్యా ఉగ్రవాద కమాండర్లకు పాకిస్థాన్‌లోని లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రొహింగ్యా ముస్లింలలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలు కలిసిపోతున్నాయని, ఇది మన దేశానికి పెను ముప్పుగా పరిణమిస్తోందని తెలిపాయి. అంతిమంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఈ పరిస్థితులను ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. రొహింగ్యా ముస్లిం మిలిటెంట్లకు లష్కరే తొయిబా నుంచి నిధులు, ఆయుధాలు అందుతున్నాయని తెలిపాయి. రొహింగ్యా ఉగ్రవాద సంస్థనుద్దేశించి 2012 జూలైలో కరాచీలో లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రసంగిస్తున్నట్లు తెలిపే ఫొటోలను నిఘా వర్గాలు ప్రభుత్వానికి అందజేశాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలోని అతి పెద్ద టెర్రర్ నెట్‌వర్క్ అయిన హుజీ చీఫ్ పాకిస్థానీ జాతీయుడైన రొహింగ్యా ముస్లిం అని తెలిపాయి. బంగ్లాదేశ్‌లో 2012లో రొహింగ్యా ఉగ్రవాదులు నిర్వహించిన సమావేశానికి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల టాప్ కమాండర్లు హాజరైనట్లు తెలిపాయి.
 
రొహింగ్యా ఉగ్రవాదులు గత నెలలో మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో సైనిక స్థావరంపై దాడి చేయడంతో సైన్యం దీటుగా బదులిచ్చింది. ఈ సందర్భంగా సుమారు లక్షమందికిపైగా రొహింగ్యాలు మయన్మార్ నుంచి వలసపోయారు.  
Tags : Rohingya Muslims, Pakistan, Mayanmar, terror