‘పార్టీ నాదేనని త్వరలోనే రుజువు చేస్తా’
13-09-2017 16:51:15
న్యూఢిల్లీ : తనదే నిజమైన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీ అని, ఆ విషయాన్ని త్వరలోనే రుజువు చేస్తానని శరద్ యాదవ్ ప్రకటించారు. వచ్చే నెల 8న జేడీయూ జాతీయసమావేశాన్ని నిర్వహిస్తానని, భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తానని తెలిపారు. పార్టీని విస్తరించే తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుందన్నారు. తనదే నిజమైన జేడీయూ అంటూ పార్టీ ఎన్నికల గుర్తు కోసం చేసిన దరఖాస్తును ఎన్నికల సంఘం పరిశీలించకపోవడంపై శరద్ యాదవ్ మాట్లాడుతూ ఈ విషయంపై తన న్యాయవాది స్పందిస్తారని చెప్పారు.
 
రాజ్యసభ సభ్యత్వంపై తనకు రాజ్యసభ సచివాలయం నుంచి నోటీసు వచ్చిందని శరద్ యాదవ్ తెలిపారు. దీనిపై కూడా తన న్యాయవాది స్పందిస్తారని ఆయన పేర్కొన్నారు. తాను పార్టీ రాజ్యాంగాన్ని, నియమాలను ఎప్పుడూ ఉల్లంఘించలేదన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని వర్గమే మహా కూటమిని ఉల్లంఘించిందన్నారు. మహా కూటమికి ఓటు వేసిన బిహార్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు. గత నెల 27న పాట్నాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నందుకే తనపై తన ప్రత్యర్థి వర్గం విమర్శలు గుప్పిస్తోందని ఆరోపించారు.
Tags : SHARAD YADAV, jdu, Nitish kumar, New Delhi