శశికళకు వీడ్కోలు!
13-09-2017 04:12:25
తమిళనాడులో అంతా అనుకున్నట్టుగానే మంగళవారం జరిగిన అన్నాడీఎంకె పార్టీ సర్వసభ్యసమావేశం శశికళను పార్టీ ప్రధానకార్యదర్శి పదవినుంచి ఏకగ్రీవంగా తొలగించింది. ఆమె నియామకాలనూ, నిర్ణయాలనూ రద్దుపరచింది. సమావేశంలో పార్టీ ప్రతినిధులు అత్యధికంగా పాల్గొనడం ఇటీవలే చేతులు కలిపిన రెండువర్గాల నాయకులకు పెద్ద ఊరట. అన్నాడీఎంకె ప్రధానకార్యదర్శి పదవి శాశ్వతంగా అమ్మదే తప్ప మరెవరూ దానికి అర్హులు కారంటూ ఆ స్థానాన్ని అమ్మకే వదిలేయడం సాంకేతికంగా సరైనది కాకపోవచ్చును కానీ చిన్నమ్మను గెంటేయడానికి ఉపకరించింది. కన్నుమూసిన అమ్మ చేతిలో ఈ కీలకమైన బాధ్యత ఉంచటాన్ని రేపు న్యాయస్థానాలు ఎలా చూస్తాయో తెలియదు కానీ, చీఫ్‌ కో ఆర్డినేటర్‌ హోదాలో ప్రస్తుతానికైతే చక్రం తిప్పబోయేది పన్నీరు సెల్వమే. ముఖ్యమంత్రి పళనిస్వామి సహాయక హోదాతో పార్టీకి పరిమితమైన సేవలే అందించబోతున్నారు. చిన్నమ్మను తప్పించడమనే ఒక సుదీర్ఘకాలపు డిమాండ్‌ ఎట్టకేలకు ఇలా నెరవేరినప్పటికీ, ఆరు తీర్మానాలకు అసలు విలువ ఉన్నదీ లేనిదీ నిగ్గు తేల్చవలసింది అంతిమంగా చెన్నయ్‌ హైకోర్టు. అక్టోబర్‌ 23న న్యాయస్థానం ఈ సమావేశాన్ని ఎత్తిపట్టవచ్చు, నేలకొట్టవచ్చు.
 
హైకోర్టు కాదంటే పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందన్న విషయాన్ని ప్రస్తుతానికి అలావుంచితే, కేవలం తొమ్మిదినెలల్లో శశికళ రాకపోకలు విచిత్రంగా, విషాదంగా ముగిసిపోయాయి. దినకరన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు ఈ సమావేశాన్ని ఆపమంటూ చివరి ప్రయత్నంగా హైకోర్టును ఆశ్రయిస్తే, ఆ పని జరగకపోగా న్యాయమూర్తి పడచీవాట్లు పెట్టి ఓ లక్షరూపాయల జరిమానా కూడా విధించారు.
 
మంగళవారం కూడా మరోమారు దినకరన్‌ వర్గం న్యాయస్థానం మెట్లెక్కినా ఫలితం లేకుండా పోయింది. దినకరన్‌ పార్టీకి చెందిన 18మంది ఎమ్మెల్యేలు సర్వసభ్య సమావేశానికి హాజరు కాకపోయినా, వారిలో తొమ్మిదిమంది తమకు ఇప్పటికే చాటుగా మద్దతు ప్రకటించారని పన్నీరు చెబుతున్నారు. నిజానికి ఇప్పుడు ఈ లెక్కలతో పనిలేదు. దినకరన్‌ గవర్నర్‌ను ఎన్నిసార్లు వేడుకున్నా, ప్రతిపక్ష డిఎంకె ఎన్ని డిమాండ్లు చేసినా ప్రభుత్వాన్ని పడదోయాలన్న ఎవరి సంకల్పమూ ఏ మాత్రం నెరవేరదు. సభను సమావేశపరిచి దినకరన్‌ బలాన్ని కళ్ళారా వీక్షించాలన్న ఆలోచన రాజ్యాంగ పరిరక్షకులకు ఎన్నడూ లేదు. పన్నీరు, పళని చేతులు కలిపినందుకు మోదీతో పాటు, ఆ రెండు చేతులూ స్వయంగా కలిపిన గవర్నర్‌కు కూడా ఎంతో సంతోషించారు. సభలో పళనిని దెబ్బకొట్టాలన్న వ్యూహం ఎప్పటికీ నెరవేరదని తేలిపోయిన దినకరన్‌ ఇక న్యాయస్థానం మీదే ఆశలు పెట్టుకున్నారు. ఇక, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో గురువారం స్పీకర్‌ సమావేశం కాబోతున్నారు కనుక హఠాత్‌ విన్యాసాలు అనేకం జరిగిపోయి చివరకు జైల్లో శశి, వీధిలో దినకరన్‌ మాత్రమే మిగలనూవచ్చు.
 
శశికళ కారణంగా చీలిపోయిన అమ్మపార్టీ ఒక్కటయ్యే ప్రక్రియ ఈ సమావేశంతో అధికారికంగా పూర్తయింది. పార్టీనీ, ప్రభుత్వాన్నీ తన అధీనంలోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమై శశికళ జైల్లోనే మిగిలిపోయింది. 75 రోజులపాటు ఆసుపత్రిలో ఉన్న జయలలిత కన్నుమూయగానే ఆమె స్థానాన్ని భర్తీచేయడానికి నెచ్చెలిగా శశికళ ప్రయత్నించారు. ఎవరు ఔనన్నా కాదన్నా, అన్నాడీఎంకెలో చిన్నమ్మ కాక అమ్మ స్థానాన్ని భర్తీచేయగలిగేవారు ఇంకెవరూ లేరన్నది వాస్తవం. పార్టీని నడిపించడంలోనూ, అభ్యర్థులను నిర్ణయించడంలోనూ, వ్యూహాలు పన్నడంలోనూ జయలలిత ఉండగానే శశికళ కీలకపాత్ర పోషిస్తూ వచ్చారన్నది తెలిసిన విషయమే.
 ఎమ్మెల్యేలే కాదు, అధికశాతం జనం కూడా అమ్మ తరువాత చిన్నమ్మేనని మానసికంగా సిద్ధపడటమూ కనిపించింది. మోదీ–అమిత్‌ షాలు ఈ ద్రవిడభూమిమీద కన్నువేయకపోయివుంటే శశికళ అభీష్ఠం నెరవేరి వుండేది. అమ్మ పార్టీ అంతా ముక్తకంఠంతో చిన్నమ్మను ప్రధానకార్యదర్శిగా ఎన్నుకున్నది. ఫిబ్రవరిలో ఎమ్మెల్యేలంతా ఏకకంఠంతో ఆమెను శాసనసభాపక్ష నాయకురాలిని చేశారు. ఆమెను స్వయంగా ప్రతిపాదించిన పన్నీరు సీఎం పదవికి రాజీనామా చేసి మార్గం సుగమం చేశారు. ఇంతలో బీజేపీ పెద్దల ఆశీస్సులతో జయ సమాధిముందు పన్నీరు కన్నీరు కార్చి తిరుగుబాటు చేయడం తెలిసిన విషయమే. మూడేళ్ళుగా మూలపడివున్న అక్రమ ఆస్తులకేసు విషయంలోనూ సుప్రీంకోర్టు వచ్చే వారమే తీర్పుచెబుతున్నట్టు ముందే ప్రకటించడం ఆమెను కుర్చీలో కూచోనివ్వకుండా ఆపడానికి బీజేపీ పెద్దలకు ఉపకరించింది. నిజానికి రాబోయే తీర్పుతో నిమిత్తంలేకుండా శశికళను ప్రమాణం చేయనివ్వాలి, ఆమె జైలుకుపోతే పార్టీ ఆమె స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలి. కానీ వడ్డించేవాడు మనవాడు కాదు కనుక ఆమెకు అధికారం దక్కలేదు. నాలుగేళ్ళ జైలుశిక్షతోనూ, పదేళ్ళపాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేకుండానూ ఆమె రాజకీయజీవితాన్ని కోల్పోవలసి వచ్చింది.
 
తన స్థానంలో దినకరన్‌ను ప్రతిష్ఠించాలన్న ప్రయత్నాలకు కూడా ఎదురుదెబ్బలు తగిలాయి. పన్నీరు, శశికళ వర్గాల వివాదంతో ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల సంఘం రెండాకుల గుర్తును స్తంభింపచేసింది. ఎన్నిక ముందురోజు చెన్నయ్‌లో ఐటీదాడులు జరగడం, దినకరన్‌ వర్గం ఓటర్లకు డబ్బులు పంచుతున్నందుకు ఆ ఎన్నికను నిలిపివేయడం మరో పరిణామం. ఈ గొలుసుకట్టు చర్యలు అక్కడితోనూ ఆగలేదు. రెండాకుల గుర్తుకోసం ఎన్నికల సంఘం అధికారులకు డబ్బు ఎరవేశారన్న అభియోగంపై దినకరన్‌ జైలుకు పోవలసివచ్చింది. ఆయన తిరిగివచ్చి పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలను కూడగట్టగలిగినా చేయగలిగిందేమీ లేకపోయింది. శశికళ కుటుంబాన్ని పార్టీనుంచి తరిమికొట్టందే పళని ప్రభుత్వం బతికిబట్టకట్టలేదు. దినకరన్‌ వెంట పాతికమంది ఎమ్మెల్యేలు ఉన్నా, పన్నీరు వెనుక ఉన్న ఆ ఇద్దరు పెద్దలూ వందమంది పెట్టు. పన్నీరును ముందుపెట్టి బీజేపీ సుదీర్ఘకాలంగా నడిపిన రాజకీయం ఎట్టకేలకు ఫలించింది. శశికుటుంబం వెలితో తమిళనాట కాలూనడానికి దానికి మార్గం సుగమమైంది.