సెన్సెక్స్‌ @ 32000
13-09-2017 02:27:48
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లలో ఏర్పడిన ర్యాలీ మద్దతుతో స్టాక్‌మార్కెట్‌లో వరుసగా నాలుగో రోజు కూడా బుల్‌రన్‌ కొనసాగింది. సాయంత్రం వెలువడనున్న ద్రవ్యోల్బణం, ఐఐపి గణాంకాలపై మార్కెట్‌ వర్గాలు కన్నేసి కొంత అప్రమత్త వైఖరి అనుసరించినప్పటికీ మార్కెట్‌ దూకుడు ప్రదర్శించింది. ఇండెక్స్‌లు చారిత్రక గరిష్ఠ స్థాయిలకు చేరువలో నెల రోజుల గరిష్ఠ స్థాయిలో ముగిశాయి. సెన్సెక్స్‌ 276.50 పాయింట్లు దూసుకుపోయి 32158.66 పాయింట్ల వద్ద క్లోజయింది. ఆగస్టు ఏడో తేదీ ముగింపు 32273.67 పాయింట్ల తర్వాత సెన్సెక్స్‌ నమోదు చేసిన గరిష్ఠ స్థాయి ఇదే. నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 10093.05 వద్ద ముగిసింది. ఆగస్టు ఒకటో తేదీన నమోదు చేసిన 10114.65 పాయింట్ల గరిష్ఠ స్థాయి తర్వాత ఇండెక్స్‌ ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. మార్కెట్‌ వేళల తర్వాత వెలువడే గణాంకాలపై ఇన్వెస్టర్లలో అప్రమత్త ధోరణి స్పష్టంగానే కనిపించినా అంతర్జాతీయ సంకేతాలందించిన మద్దతు మార్కెట్‌ను ముందుకు నడిపించిందని ట్రేడర్లన్నారు. దేశీయ సంస్థలు భారీగా మార్కెట్‌లో కొనుగోళ్లు నిర్వహించడం కూడా కలిసివచ్చిందని వారు చెప్పారు. సెబి గణాంకాల ప్రకారం సోమవారం దేశీయ సంస్థలు 877.37 కోట్ల రూపాయల విలువ గల షేర్లను కొనుగోలు చేయగా ఎఫ్‌పిఐలు 392.52 కోట్ల రూపాయల విలువ గల షేర్లను విక్రయించారు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు కూడా మార్కెట్‌ జోరులో పరుగులు తీశాయి.
  •  3.30 శాతం లాభపడి టాటా స్టీల్‌ షేరు ఆరేళ్ల గరిష్ఠ స్థాయికి దూసుకుపోయింది. ఈ షేరు బిఎ్‌సఇలో 683.15 రూపాయల వద్ద క్లోజయింది.
 
20న ఎస్‌బిఐ లైఫ్‌ ఇష్యూ
బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బిఐ అనుబంధ సంస్థ ఎస్‌బిఐ లైఫ్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 20న ప్రారంభం కానుంది. 8400 కోట్ల రూపాయల సమీకరణ లక్ష్యంతో ఎస్‌బిఐ లైఫ్‌ రంగంలోకి దిగుతోంది. ఇష్యూ ముగింపు తేదీ 22. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లిస్టింగ్‌ తర్వాత మార్కెట్‌లోకి వస్తున్న రెండో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఇది. షేరు ధరను కనిష్ఠంగా 685 రూపాయలు, గరిష్ఠంగా 700 రూపాయలుగా నిర్ణయించారు. ఒక్కోటి 10 రూపాయల ముఖ విలువ గల 12 కోట్ల షేర్లను ఈ ఇష్యూ ద్వారా విక్రయిస్తున్నారు. ఇందులో ఎస్‌బిఐ 8 కోట్ల షేర్లను, బిఎన్‌పి పారిబా కార్డిఫ్‌ ఎస్‌ఏ 4 కోట్ల షేర్లను విక్రయిస్తున్నాయి.
 
మాట్రిమోని ఇష్యూకి 1.36 రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కిప్షన్‌
ఆన్‌లైన్‌లో వివాహ సంబంధాల వెబ్‌సైట్‌ భారత మాట్రిమోని మాతృసంస్థ మాట్రిమోని డాట్‌కామ్‌ పబ్లిక్‌ ఇష్యూ రెండో రోజు 1.36 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది.
టాటా కెమికల్స్‌లో వాటాలు పెంచుకున్న టాటా సన్స్‌
టాటా గ్రూప్‌ కంపెనీల ప్రమోటర్‌ టాటా సన్స్‌ తమ గ్రూప్‌లోని టాటా గ్లోబల్‌ బెవరేజె్‌సలో వాటాలు 6.84 శాతానికి, టాటా కెమికల్స్‌లో వాటాలు 4.39 శాతానికి పెంచుకుంటోంది. ఈ లావాదేవీల విలువ 1,458 కోట్ల రూపాయలు. అనుబంధ కంపెనీల్లో పెట్టుబడుల పునర్నిర్మాణ ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.