వదలకపోతే ఇంకెందుకు?
12-09-2017 23:54:12
రెండు దేశాల సరిహద్దుల్లో జరిగే యుద్ధంలో అనేకమంది సైనికులు అమరులవుతారు. మరికొందరు ప్రాణాలతో బయటపడినా అవయవాలు కోల్పోయి జీవచ్ఛవాలుగా మిగిలిపోతారు. అలా ఒక కాలూ, ఒక చేయీ పోగొట్టుకుని భారతీయ సైనికుడొకడు ప్రాణాలతో బయటపడ్డాడు.
 
అయితే ఆ స్థితిలో కూడా అతడు తన ఆత్మ స్థైర్యాన్నేమీ కోల్పోలేదు. అమ్మానాన్నలు, భార్యాపిల్లల మధ్య గడిపే ఆ తర్వాత జీవితాన్ని తలుచుకుంటూ, మనసులో ఆనందాన్నే నింపుకున్నాడు. ఆ ఆనందంతోనే ఇంటికి ఫోన్‌ చేసి, భీషణమైన యుద్ధం చేసి కూడా నేను ప్రాణాలతో మిగిలిపోయాను. కొద్ది పాటి జ్వరం కారణంగా ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాను. కేవలం 10 రోజుల్లో డిస్చార్జ్‌ అయి ఇంటికి వచ్చేస్తున్నానంటూ ఇంటికి కబురంపాడు, ఆ విషయం తెలిసిన తలిదండ్రులు, భార్యాపిల్లలు సంతోషడ్డారు. అయితే నాలుగు రోజుల తర్వాత మళ్లీ తనే ఫోన్‌ చేసి పరోక్షంగా అసలు విషయం చెప్పాడు.
 
తనకేదో అయ్యిందని కాకుండా ఒక మిత్రుడి పేరున చె ప్పాలనుకున్నాడు. ఎంతో ఉదాత్త భావాలున్న, ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగిన తన తండ్రి మాత్రమే ఇలాంటి సంక్లిష్టమైన విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాడు అనుకున్నాడు. అందుకే ప్రత్యేకించి తన తండ్రికే చెప్పాలనుకుని ఫోన్‌ కలిపాడు. ఎలా స్పందిస్తారో తెలుసుకుందామనుకున్నాడు. ‘‘నాన్నా! యుద్ధంలో నా దగ్గరలోనే ఉన్న నా తోటి సైనికుడు యుద్ధంలో ఒక కాలూ, ఒక చెయ్యీ కోల్పోయాడు. అతనికి తన వాళ్లంటూ ఎవరూ లేరు.
 
అందుకే అతన్ని జీవితమంతా మనతోనే ఉండేందుకు తీసుకు వస్తున్నాను’’ అన్నాడు. ఆ మాటకు తండ్రి ఏదో ఉలిక్కిపడ్డట్లు బదులిచ్చాడు. ‘అదేమిటి నాయనా! ఒక కాలూ, ఒక చేయీ పోగొట్టుకుని చివరికి తన పనులైనా తాను చేసుకోలేని స్థితిలో ఇప్పుడు అతడున్నాడు.
 
ఆ స్థితిలో అతన్ని ఇక్కడికి తీసుకువస్తే అతడు మనకు భారమవుతాడు. అందుకే ఏదో ఒక కారణం చెప్పి వదిలించుకో తప్ప ఎట్టి పరిస్థితిలోనూ ఇంటికి తీసుకురావద్దు’’ అన్నాడు. తండ్రి మాట్లాడి న ప్రతి మాటా అతని గుండెలో ఈటెల్లా దిగిపోయాయి. ఇంటికి వెళితే నేను వీళ్లందరికీ భారమవుతానన్న మాట.. అలాంటప్పుడు నేనింక ఇంటికి ఎందుకు వెళ్లాలి? అనుకున్నాడు. హాస్పిటల్‌లోంచి డిస్చార్జ్‌ అయిన రోజునే ఒక లాడ్జ్‌ బుక్‌ చేసుకుని అందులో చేరి, ఆ మరుసటి రోజే ఉరేసుకుని చనిపోయాడు.
 
ఆ విషయాన్ని పోలీసులు వెంటనే ఇంటికి చేరవేశారు. కుటుంబ సభ్యులంతా వచ్చారు. ఒక కాలూ, ఒక చేయీ లేని కొడుకు శవాన్ని చూసి తండ్రి నిర్ఘాంతపోయాడు. తన మిత్రుడినెవరినో తీసుకు వస్తాను అన్నప్పుడు. ‘తీసుకురా నాయనా అతడ్ని నా రెండో కొడుకు అనుకుంటాను. మన కుటుంబంలో ఒకడిగా మనం జీవితాంతం చూసుకుందాం’ అనే ఆ ఒక్క మాట అని ఉంటే ఈ రోజు కొడుకు ఇలా ఆత్మహత్యకు పాల్పడే వాడే కాదు. తన, పర భేద భావాన్ని వదిలేయడమే కదా! ఆధ్యాత్మికతలోని మౌలికాంశం. ఇన్నేళ్ల ఆధ్యాత్మిక జీవనం తర్వాత కూడా ఆచర ణలో అక్కడే ఘోరంగా విఫలమైపోయానని గుండెలు బాదుకున్నాడు తండ్రి.