నా ఫొటో ఎలా తీయగలవు?
11-09-2017 23:29:58
దేశ విదేశాల్లో ఎంతో పేరున్న ఒక సాధువు తాలూకు ఒక ఆల్బమ్‌ తయారు చేయాలని ఒక ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నాడు. అతని ఫొటోలను జనం మధ్యలో కాకుండా విడిగా తీయాలనే అతని కోరిక ఎంతకూ తీరడం లేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఆయన చుట్టూ గుంపులు గుంపులుగా ఆయన భక్తులు ఉంటున్నారు. ఆ భక్తులను దూరంగా వెళ్లమని చెప్పలేడు, ఆ సాధువును దూరంగా తీసుకుపోలేడు. అందుకే ఏళ్లు గడుస్తున్నా ఆ ప్రయత్నం ఫలించడం లేదు.
 
అయితే రెండు మూడు రోజులుగా కుండపోతగా వర్షం కురవడంతో భక్తుల రాక బాగా తగ్గిపోయింది. ఇదే సరియైున సమయమని సాధువు వద్దకు పరుగెత్తాడు ఫొటోగ్రాఫర్‌. దగ్గరగా వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి ‘‘స్వామీ! నాదో కోరిక. ఎన్నో ఏళ్లుగా అది తీరడం లేదు. మీరు అనుమతిస్తే ఇదుగో, ఈ రోజు తీరే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. అందుకు అనుమతిస్తారా స్వామీ!’’ అన్నాడు.
 
అందుకు మందహాసంతో సాధువు ‘‘అసలు నీ కోరికేమిటో చెప్పు నాయనా!’’ అన్నాడు. అప్పుడు ఆ ఫొటోగ్రాఫర్‌ ‘‘స్వామీ! మీ ఫొటోలు కొన్ని తీసి దాన్ని ఒక గొప్ప ఆల్బమ్‌గా తయారు చేయాలన్నది నా కోరిక. ఆ ఆల్బమ్‌లో మీరు తప్ప మరెవరూ ఉండకూడదనేది నా ఆకాంక్ష. ఇదుగో ఈ భారీ వర్షాల పుణ్యమా! అని పెద్దగా మీ భక్తులెవరూ లేకుండా మీరు దొరికారు. ఇప్పుడు మీరు కాదనకుండా అనుమతిస్తే ఇన్నేళ్ల కోరిక ఈ రోజు తీరిపోతుంది అన్నాడు! ’’ అందుకు స్వామీజీ ‘‘ఇంతకూ నీకిప్పుడు ఏం కావాలో చెప్పు’’ అన్నాడు.
 
‘‘మీ పోటోలు తీయడానికి మీరు అనుమతించాలి స్వామీ!’’ అన్నాడు ఫొటోగ్రాఫర్‌ ఎంతో వినమ్రంగా. ఆ వెంటనే ‘‘అనుమతి సరే గానీ, నువ్వు నా ఫొటో ఎలా తీయగలవు?’’ అన్నాడు స్వామీజీ! ఆ మాట విని దిగ్భాంతికి గురయ్యాడు ఫొటోగ్రాఫర్‌. తట్టుకోలేక ‘‘స్వామీజీ నేను దేశ విదేశాల్లో ఎంతో పేరున్న ఫొటోగ్రాఫర్‌ను. జాతీయ స్థాయిలోనే కాదు. అంతర్జాతీయ స్థాయిలో నాకెన్నో అవార్డులు, రివార్డులూ వచ్చాయి.
 
నేను తీసిన కొంత మంది ప్రముఖుల ఫొటోలు ఇవిగో చూడండి’’ అంటూ, బ్యాగులోంచి కొన్ని ఆల్బమ్స్‌ తీసి చూయించసాగాడు. వాటిని చూసి సాధువు నవ్వుతూ, ‘‘ఇవన్నీ వాళ్ల శరీరాల ఫొటోలు నాయనా! వాళ్ల ఆత్మల్ని తీసిన ఫొటోలు ఏమైనా ఉంటే చూపించు! నేను అంటే శరీరం కాదు... ఆత్మ. ఆత్మ ఫొటోలు ఎలా తీయగలవు? అన్నాడు సాధువు. ఆ మాటలు విన్న ఫొటోగ్రాఫర్‌కు దిమ్మతిరిగినట్లయ్యింది. అతని నోట మాట పెగల్లేదు. మెల్లమెల్లగా సాధువు మాటల్లోని అంతరార్థం బోధపడ సాగింది.
 
అంతలోనే సాధువు అతని భుజాల మీద చేయి వేసి, ‘‘నాయనా! ఇన్నేళ్ల నీ జీవితంలో ఆత్మను ఎప్పుడైనా చిత్రించావా చెప్పు, నువ్వే కాదు ప్రపంచంలో ఎవరూ చిత్రించలేరు. అందుకే శరీరాల్ని చిత్రించే ఈ ఆరాటం వదిలేయ్‌. వీలైతే నీ అంతరాత్మనూ, ఆ పరమాత్మనూ దర్శించే ప్రయత్నం చెయ్యి. నీ కెమెరాను పక్కన పెట్టి ఆ దర్శనం కోసం సాధన చెయ్యి. ఆలా మాత్రమే నీ జన్మ ధన్యమవుతుంది సార్థకమవుంది’’ అన్నాడు సాధువు.