ఇప్పుడు అవన్నీ నీకే సొంతం!!
10-09-2017 23:18:46
గౌతమ బుద్దుడు ఉదయమే లేచి స్నాన, ధ్యానాలన్నీ పూర్తి చేసుకుని, బిక్ష కోసం ఊళ్లోకి బయల్దేరాడు. ఒక ఇంటి ముందు నిలుచుని ‘భవతీ బిక్షాందే హి’ అన్నాడు ఆ ఇంట్లోంచి ఒక మహిళ బయటికొచ్చి, బుద్దున్ని చూసింది. అంతే క్షణాల్లో ఆమె చండ్రనిప్పైయిపోయింది. ‘‘ఏమయ్యిందయ్యా నీకు? కాలు వంకరా? చేయి వంకరా? దుక్కలా ఉన్నావు. కష్టం చేసి బతకొచ్చుకదా! నిస్సిగ్గుగా ఇల్లిల్లూ తిరుగుతూ ఈ బిక్షం అడుక్కోవడమేమిటి? నీ లాంటి వాళ్ల వల్లే అసలు బిచ్చగాళ్లకు అన్నం దొరక్కుండా పోతోంది. ’’ ఇలా ఒకటేమిటి నోటికొచ్చినట్టు, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసింది.
 
అయినా ఆ మాటలకు ఏ మాత్రం చలించకపోవడమే కాకుండా లోలోపల పగలబడి నవ్వుకుంటున్నాడు బుద్దుడు. పైగా, ఆమె ఇంటికి ఎదురుగా ఉన్న ఒక పెద్ద రాయిమీదే ఆమె దూషణలన్నీ వింటూ అలా కూర్చుండిపోయాడు. ఎందుకంటే చివరగా తాను చెప్పాల్సిన నాలుగు మాటలు ఆమెకు చెప్పే వెళ్లాలని అలా ఉండిపోయాడు. అందుకు కారణం, సాధువులు, బిక్ష కోసం ఈ రోజు వచ్చిన వీధిలోకి చాలా రోజుల దాకా మళ్లీ రారు. అలా రాకూడదనే నియమం కూడా వారికి ఉంటుంది.
 
అందుకే ఈ రోజు ఆమెకు ఏమైనా చెప్పాలనుకుంటే ఈ రోజే చెప్పేయాలి. అందుకే తిట్టీ తిట్టీ అలసిపోయేదాకా అక్కడే ఆమెకు ఎదురుగా ఉండిపోయాడు. తన శక్తి అంతా హరించుకుపోయినట్లు ఆ ఇల్లాలు గొంతు ఆగిపోయింది. అప్పుడు బుద్దుడు లేచి మెల్లగా ఆమె వద్దకు వెళ్లి. తిట్టడం అయిపోయిందా తల్లీ? ఇంకేమైనా మిగిలిపోయిందా? అన్నాడు. ఆమె అప్పటికీ వెటకారంగానే ‘‘ మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ’’ మనిషన్న వాడికి ఈ మాటలు చాలవా?’’ అంది. ఆ మాటలకు బుద్దుడు చిరునవ్వు నవ్వుతూ ‘‘ అమ్మా నువ్వు అన్ని మాటలన్నావు కదా! నా మాట కూడా ఒకటి నువ్వు వినాలి మరి! నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలి’’ అన్నాడు తాను అంత పరుషంగా తిట్టినా ఒక ప్రశాంత చిత్తంతో అతడు మాట్లాడటం చూసి ఆమె మనసు లోలోపల ఆశ్యర్యపడసాగింది.
 
అయినా అదేమీ బయటికి కనిపించనీయకుండా.... ఏమిటా ప్రశ్న? అడిగి ఏడువు అన్నట్లు చూసింది. ఆ వెంటనే బుద్దుడు.. ‘‘అమ్మా! నువ్వు ఏదైనా వస్తువును ఎవరికైనా ఇవ్వాలనుకున్నావనుకో! అప్పుడు ఆ అవతలి వ్యక్తి వాటిని తీసుకోకుండా తిరస్కరించాడనుకో అప్పుడు ఆ వస్తువు ఏమైపోతుంది?’’ అన్నాడు బుద్దుడు. దానికి వెంటనే ’’నా వస్తువు నా వద్దే ఉండిపోతుంది’’ అని బదులిచ్చింది. ఆ వెంటనే బుద్దుడు అమ్మా! నేనిప్పుడు ఆ పనే చేస్తున్నాను. నువ్వు తిట్టిన తిట్లలో ఏ ఒక్కటీ తీసుకోవడం లేదు. ఇప్పుడు ఆ తిట్లన్నీ నీ వద్దే కదా ఉండిపోతాయి. తల్లీ! వాటిని నీ జీవితమంతా నీ వద్దే భద్రంగా దాచుకో! నేనింక వెళ్లిపోతున్నాను’’అంటూ బుద్దుడు చేతులెత్తి నమస్కరించి తనలో తాను నవ్వుకుంటూ తన దారిన తాను వెళ్లిపోయాడు