నాలో ఎప్పుడూ అదే ఆనందం!!
08-09-2017 22:48:41
ఉద్యోగ బాధ్యతల ఒత్తిళ్ల కారణంగా చాలా రోజులుగా క్షణం తీరిక లేకుండా గడిపిన ఒక బ్యాంక్‌ మేనేజర్‌ ఓ 15 రోజులు సెలవు పెట్టి సొంతూరు వెళ్లిపోయాడు. అలా అని రోజంతా ఇంట్లోనే కూర్చుని ఉండిపోకుండా, ప్రతిరోజూ చుట్టు పక్క ఊళ్లల్లో ఏదో ఒక వైపు వెళ్లి ఆ పరిసరాల్ని, పరిస్థితుల్ని సరదగా పరిశీలిస్తూ, వస్తున్నాడు. ఆ క్రమంలో ఒక రోజు పక్క ఊరు చెరువు కట్టమీదుగా నడుస్తున్నాడు. చెరువు వైపు చూస్తే చెరువు అంచున ఒక పాతికేళ్ల యువకుడు గాలంతో చేపలు పడుతున్నాడు. మేనేజర్‌ అతని వద్దకు వెళ్లాడు. ‘‘ఏం బాబూ!ఇలా చేపలు పట్టడానికి రోజూ వస్తావా? ఎప్పుడో వారం పది రోజులకొకసారి వ స్తావా?’’ అన్నాడు. ‘‘ దాదాపు రోజూ వస్తానండి. ఈ వృత్తే నా జీవనాధారం’’ అంటూ సమాధానం చెప్పాడు యువకుడు. ఆ వెంటనే ‘‘రోజుకు సగటున ఎన్ని చేపలు పడతావేమిటి?’’ అడిగాడు మేనేజర్‌. ‘‘ఓ ఏడెనిమిది కిలోల దాకా పడతానండి. అందులోంచి కిలో చేపలు నేను ఉంచేసుకుని, మిగతావి అమ్మేస్తాను. వాటితో జీవితం ఇలా గడిచిపోతోంది’’ అన్నాడు. అందుకు వెంటనే మేనేజర్‌... ‘‘ఇలా ఎన్నేళ్లు పట్టినా నీ జీవితంలో ఎదుగూ బొదుగూ ఉండదనే విషయం నీకు అర్థమయ్యిందా’’ అన్నాడు మేనేజర్‌. అందుకు ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు యువకుడు. ఆ వెంటనే ‘‘ఇదుగో చూడు, నేను బ్యాంక్‌ మేనేజర్‌ను. ఇదుగో నా విజిటింగ్‌ కార్డు. మా బ్యాంక్‌కు వచ్చి పడవ కోసం రుణం కావాలంటూ దరఖాస్తు చేసుకో. ఆ వచ్చిన రుణంతో ఒక పడవ కొనుక్కుని చేపలకు వెళితే, ఇంతకు పదింతలు చేపలు దొరుకుతాయి.’’ అన్నాడు మేనేజర్‌. వెంటనే మేనేజర్‌ కళ్లలోకి చూస్తూ ‘‘ఆ తర్వాత?’’ అన్నాడు ఆ యువకుడు. ‘‘ఆ తర్వాత ఏముంది? సకాలంలో రుణం చెల్లిస్తే, నేను మరో పడవకు రుణం మంజూరు చేస్తాను. అప్పుడు ఒక పడవను ఎవరికైనా అద్దెకు ఇవ్వవచ్చు. ఒక పడవలో నువ్వు చేపలు పట్టవచ్చు. అలా రెండు చేతులా సంపాదించవచ్చు’’ అన్నాడు మేనేజర్‌. అది విన్న యువకుడు క్షణమైనా ఆగకుండా, ‘‘ఆ తర్వాత’’ అనేసాడు మళ్లీ. ‘‘ఆ తర్వాత ఇంకేముందిరా పిచ్చితండ్రీ! కాలు మీద కాలు వేసుకుని ఢంకా భ జాయించుకుంటూ జీవితాన్ని ఫుల్లుగా ఎంజాయ్‌ చెయ్యవచ్చు’’ అన్నాడు మేనేజర్‌. ఆ మాటలు విన్న ఆ యువకుడు. చిరున వ్వుతో ‘‘ఇప్పుడు నేను చేస్తున్న పనికూడా అదే కదా సార్‌!’’ అన్నాడు ఎంతో వినయంగా. ఆ మాటలకు నిరుత్తరుడైన మేనేజర్‌ కాసేపు అలాగే ఉండిపోయి కిమ్మనకుండా వెనుతిరిగి వెళ్లిపోయాడు.