అన్నీ ఒక్కరే!
07-09-2017 23:25:20
నాలుగైదు ఆయుధంబులు కేలదాల్చి
నిలిచియుందువు దేనికో నిశ్చలముగా
ఎవ్వరిని రక్షసేయని ఎవ్వరికిని శిక్షవేయని
నిర్లిప్త సాక్షివేమో!
 
ఎన్నో ఘోరాలు, నేరాలు ప్రపంచంలో జరిగిపోతున్నాయి. దేవుడు వాటిని అరికడుతున్నట్లు కనిపించడం లేదు. అలాగే ఎంతో మంది సాధువులను, భక్తులను దుర్మార్గులు అవమానిస్తున్నారు. దైవభక్తి ఉన్న వాళ్లు బాధపడుతున్నారు. కానీ వాళ్లను దేవుడు కాపాడుతున్నట్లు కనపడటం లేదు. మన దేవతలను చూస్తే ఏదో ఒక ఆయుధం ధరించి ఉంటారు. బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి, సరస్వతి...లాంటి కొంత మంది దేవతలు తప్పితే అందరూ ఆయుధాలు ధరించే ఉంటారు.
 
మరి దేవతల చేతుల్లో ఆ ఆయుధాలు ఎందుకు? దాని ద్వారానే మనం జగత్‌తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు అసంతృప్తులు, అత్యాశలు అన్నీ దూరమవుతాయి. అన్ని సమస్యలకు అది వైద్యం. నేరం చేసిన వాడికి వెంటనే శిక్ష వేసి, మంచి పని చేసిన వాడికి వెంటనే శుభపరిణామాన్ని ఇచ్చేస్తే అక్కడకు దేవుడు ఉన్నట్టా? ఆయనే ఆ పని చేస్తే లోకంలో న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు ఎందుకోసం ఉన్నట్టు? మనిషి విచక్షణా జ్ఞానం దేనికి? క్రీడ కోసమే భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆట ఆడుతున్నది ఆయనే, ఆడుకుంటున్నది ఆయనే. ఆడుకోవడానికి ఉపయోగపడుతున్న పావులు కూడా ఆయన రూపాలే. సృష్టి ప్రారంభంలో కర్మ ఫలాలు ఏమున్నాయి? ప్రాథమిక ప్రశ్న ఇది. ఎవరికీ ఏ కర్మ లేనప్పుడు ఆయన సృష్టించిన వారికి కర్మఫలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అందుచేత భౌతికశాస్త్రం చెప్పిన ప్రకారం సృష్టి ఒక పరిణామక్రమంలో నడుస్తున్నదైనా కావాలి. దేవుడితో సంబంధం లేకుండా! లేదంటే అద్వైతం చెప్పినట్టుగా సృష్టి ఉన్నదని అనుకోవడం ఒక మాయ అయినా కావాలి. ఈ రెండూ సమన్వయం జరగాలంటే కచ్చితంగా అది పరిణామక్రమంలోనే ఏర్పడింది. రాముడు వశిష్ఠుడిని ఒక ప్రశ్న వేస్తాడు. ‘‘మహర్షీ! మహాప్రళయంలో ఈ జీవులన్నీ భగవంతునిలో కలిసి పోతాయంటారు కదా! ఇది నిజమేనా?’’ అని అడిగాడు. వెంటనే వశిష్టుడు ఒక నవ్వు నవ్వి ‘‘అంటే... కలవనప్పుడు అంతకుముందు భగవంతునితో వేరుగా ఉన్నట్టేనా?’’ అని అన్నాడు. మళ్లీ ప్రశ్నతోనే సమాధానం చెప్పాడు. మహాప్రళయం కంటే ముందు వేరుగా ఉంటే కదా వచ్చి కలవడానికి!
 
భగవంతుడు ఆయుధాలు చేతపట్టి ఎవరినైతే రక్షించాలని కోరుకుంటున్నారో వాళ్లు కూడా భగవత్‌ స్వరూపమే. బాధపెట్టే వాడు కూడా భగవత్‌ స్వరూపమే. పెడుతున్న బాధ కూడా అదే. ధ్యానం, ధ్యేయం, ధ్యాత... మూడూ ఒక్కటే. మూడు ఒక్కటే అంటే అర్థం ఏంటి? జరుగుతున్నది మాయ. సృష్టికి ప్రళయం అనేది ఉండదు. ఎక్కువ జీవులు ఒకేసారి పోవడం వల్ల వినాశనం అని అనిపిస్తుంది. అంతే తప్ప ప్రళయం అనేది లేదు. శంకరాచార్యస్వామి వారు ఇలా చెబుతారు.
 
‘‘యన్నాదౌ యచ్ఛనాస్యంతే
తన్మధ్యేభ్రాంత్యమపి అసతౌ
అథోమిధ్యా జగత్‌ సర్వం’’
 
ఈ సృష్టి మొదట లేదు. చివరా లేదు. మొదటా, చివరా లేనిదీ మధ్యలో ఎలా ఉంటుంది. మధ్యలో ఉన్నట్టు నీకు కనిపిస్తున్నప్పటికీ లేనిదానితో సమానం. కాబట్టి జగత్తు మొత్తం మిధ్య అని చెప్పారు. కాబట్టి దేవతల రక్షణ, శిక్ష అవన్నీ మన మనోభావాలు. మనం ఆరాధన కోసం పెట్టుకున్నటువంటి శిల్పం, మనం ఒకటే అని తెలుసుకోగలిగితే మనకు రక్షణ అవసరమే లేదు. ఇది కొంత విచిత్రంగా ఉండొచ్చు కానీ నిజం. మనం ఏ శిక్షా పొందడం లేదు. జరుగుతున్నది ఒక లీల. ఆయనతో ఆయనే ఆడుకుంటున్నాడు. నువ్వు అనుకుంటున్నది అంతా భ్రమే. అందుచేత జరుగుతున్నది ఒక నాటకం. నీ పాత్రేదో నువ్వు చేయి. అప్పుడు ఏ పరిణామం జరిగినా కంగారు ఉండదు. ఒక చిరునవ్వు నవ్వి చేయవలసిందేదో చేసుకోవచ్చు. మనందరి రూపంలో భగవంతుడు సాగిస్తున్న లీలలను అర్థం చేసుకుంటూ హాయిగా, ఆనందంగా ఉందాం.
 
 
- డా. గరికిపాటి నరసింహారావు