ఆ లోకమే శాశ్వతం
07-09-2017 23:21:21
ఒకసారి హజ్రత్‌ ఉమర్‌(రజి), దైవ ప్రవక్త (స)గారి ఇంటికి వెళ్లారు. అప్పుడు దైవ ప్రవక్త(స) ఖర్జూరపు మట్టలతో అల్లిన చాపపై పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. దానిపైన ఎలాంటి పరుపూ పరిచిలేదు. చాప గుర్తులు ఆయన వీపుపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన కింద తోలు తలగడ మాత్రమే ఉంది. అందులో ఖర్జూర బెరడు నింపబడి ఉంది. ఈ పరిస్థితిని చూసిన ఉమర్‌(రజి) ఉండబట్టలేక ఇలా అన్నారు.
 
‘‘ఓ దైవ ప్రవక్తా! మీ ఉమ్మత్‌ కోసం సిరిసంపదలు, సౌభాగ్యాలను ప్రసాదించమని దైవాన్ని ప్రార్థించండి’’ అని చెప్పారు. దానికి సమాధానంగా దైవ ప్రవక్త(స) - ‘‘ఓ ఉమర్‌! ప్రపంచ సుఖాలు అవిశ్వాసుల కొరకు మాత్రమే! విశ్వాసుల కోసం పరలోకపు సుఖాలు ఉన్నాయి. ఇది నీకు సమ్మతం కాదా?’’ అని అన్నారు. అలాగే ముహమ్మద్‌(స) మరోసారి చాపపై పడుకొని ఉండడం చూసిన హజ్రత్‌ ఇబ్నెమస్‌ ఊద్‌ (రజి) దైవ ప్రవక్త(స)తో ‘‘దైవ ప్రవక్తా(స)! మీరు ఆజ్ఞాపిస్తే మీ కోసం ఒక మంచి పరుపును తయారు చేయిస్తాను’’ అని అన్నారు. అప్పుడు దైవ ప్రవక్త(స) ఇలా బదులిచ్చారు.
 
‘‘నాకు ప్రపంచ సౌఖ్యాలతో పనేమిటి? నేను ఇహలోకంలో ఒక బాటసారి లాంటి వాడిని. బాటసారి దారిలో ఏదయినా చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతాడు, ఆ తర్వాత దాన్ని వదిలేసి తన గమ్యం వైపు తిరిగి ప్రయాణం సాగిస్తాడు’’. ఇహలోకం అశాశ్వతం, పరలోకం శాశ్వతం అనే విషయం దివ్య ఖుర్‌ఆన్‌, ప్రవక్త(స) వారి ప్రవచనాల ద్వారా మనకు తెలుస్తుంది. అల్లాహ్‌ ప్రసాదించిన ఈ ప్రాపంచిక వస్తువులు, సౌఖ్యాలు కేవలం మనిషి జీవించడానికి మాత్రమే. దైవాన్నీ మరచి పోయేంతగా ప్రపంచ వస్తువులను అనుభవించరాదు!
 
-మహమ్మద్‌ వహీదుద్దీన్‌, సిద్దిపేట