ప్రఖ్యాత శాస్త్రవేత్త, పద్మభూషణ్‌ పీఎం భార్గవ కన్నుమూత
02-08-2017 02:56:11
  • హైదరాబాద్‌ సీసీఎంబీ వ్యవస్థాపనలో కీలక పాత్ర
  • 17 ఏళ్ల పాటు విశేష సేవలు
  • సీఎం చంద్రబాబు సంతాపం
ఉప్పల్‌, ఆగస్టు 1: శాస్త్రీయరంగంలో భారతఖ్యాతిని ప్రపంచానికి చాటిన ప్రఖ్యాత శాస్త్రవేత్త, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ పీఎం భార్గవ పరమపదించారు. ఆయన వయసు 90 ఏళ్లు. కొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం సాయంత్రం ఉప్పల్‌లోని స్వగృహంలో మృతి చెందారు. కణ జీవశాస్త్రవేత్తగా పేరుగాంచిన ఆయన ఎన్నో గొప్ప గొప్ప పరిశోధనలు చేశారు. హైదరాబాద్‌లో సెంటర్‌ ఫర్‌ మాలిక్యూలర్‌ బయోలజీ(సీసీఎంబీ)ని స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ సంస్థకు 17 ఏళ్లపాటు డైరెక్టర్‌గానూ పనిచేశారు. నేషనల్‌ నాలెడ్జి కమిషన్‌ ఉపాధ్యక్షునిగా పనిచేశారు.
 
శాస్త్ర పరిశోధన రంగంలో ఆయన అందించిన విశేష సేవలకు గాను 1986లో ఆయనను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. ఉప్పల్‌లోని ఐదు అంతస్తుల నివాసంలో ఒక అంతస్తును పరిశోధనశాలకు, మరో అంతస్తును లైబ్రరీకి కేటాయించారు. ఇటీవల వరకూ ఆయన అనేక ఫార్మా కంపెనీలకు సలహాదారుగా పనిచేస్తున్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశ వ్యాప్తంగా అసహనం, దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని నిరసన వ్యక్తం చేస్తూ.. 2016లో పద్మభూషణ్‌ అవార్డును వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆయన భార్య మనోరమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 4న అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం. పీఎం భార్గవ పూర్తి పేరు పుష్పమిత్ర భార్గవ. యూపీలోని అజ్మీర్‌లో 1928 ఫిబ్రవరి 28న జన్మించారు. వారణాసి, అలహాబాద్‌, లక్నోలో చదువును కొనసాగించారు.
 
లక్నో యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో ఎంఎస్సీ పూర్తి చేసి అదే యూనివర్సిటీలో 1946లో తన 21వ ఏట కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పొందారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి 1950 నుంచి 1953 మధ్య కాలంలో ప్రస్తుతం ఉన్న ఐఐసీటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో పరోశధకుడిగా పనిచేశారు. తర్వాత 1953 నుంచి 56 వరకు అమెరికా వెళ్ళి అక్కడి యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కానిసన్‌, మెడిసన్‌లో ప్రఖ్యాత శాస్త్రవేత్త హెడెల్‌ బర్గర్‌తో కలిసి విస్తృతమైన పరిశోధనలు చేశారు. 1956- 57 వరకు లండన్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ రిసెర్చ్‌లో పని చేసి 1957లో ఇండియాకు వచ్చి తిరిగి ఐఐసీటీలో చేరారు. తర్వాత ఐఐసీటీలో పనిచేస్తూనే సీసీఎంబీ పరిశోధన సంస్థను స్థాపించారు.
 
భార్గవ మృతి తీరని లోటు: చంద్రబాబు
అమరావతి: సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్‌ పీఎం భార్గవ మృతి పట్ల ఏపీ సీఎం ఎన్‌.చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. భార్గవ మృతి ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగానికి తీరని లోటని తెలిపారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.