ఒకే ప్రాంగణంలో ..ఆంజనేయస్వామి.. సాయిబాబా
15-07-2017 09:22:36
  • నిత్యపూజలు, యజ్ఞాలు, అన్నదానం
హిమాయత్‌నగర్‌/హైదరాబాద్: పచ్చటి పరిసరాలు.. చుట్టూ పార్కు.. విశాలమైన ప్రాంగణంలో సాయిబాబా, ఆంజనేయస్వామి కొలువుదీరారు! నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విశేషమైన రోజుల్లో య జ్ఞాలు, కల్యాణోత్సవాలు జరుగుతున్నాయి.
హిమాయత్‌నగర్‌లోని జీఎ్‌స.మెల్కోటే పార్కుకు వెనుకవైపు, హరివిహార్‌కాలనీకి ఆనుకుని ఆలయం ఉంది. ఇక్కడ మొదట ఆంజనేయస్వామి ఆలయం మాత్రమే ఉండేది. దశాబ్ద కాలం కిందట సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. మొదట సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించి, తర్వాత మండపం మాదిరిగా చిన్న ఆలయాన్ని నిర్మించారు. సాయిబాబా మందిరానికి ఎదురుగా దునిని కూడా నిర్మించారు. స్థానికులు, ఆలయ కమిటీ ప్రతినిధులు చెబుతున్న ప్రకారం ఐదు దశాబ్దాల కిందట ఇక్కడ ఉన్న రావిచెట్టు కింద ఆంజనేయస్వామి రూపం ఉన్న బండరాయి బయటపడడంతో నాడు చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆలయం పక్కన ఉన్న స్థలం ప్రభుత్వ డిస్టిల్లరీకి చెందినది కావడంతో పదేళ్ల కిందట హెచ్‌ఎండీఏ జీఎ్‌స.మెల్కోటే పార్కును ని ర్మించింది. దీంతో ఆలయం కూడా పార్కులో భా గంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పార్కు ఏర్పాటు తర్వా త చుట్టూ పచ్చని చెట్లతో ఆలయ ప్రాంగణం ఆహ్లాదంగా మారిపోయింది. ప్రాంగణంలో ఉన్న రెండు ఆలయాలు ఇప్పటికి వేరువేరుగానే ఉన్నప్పటికీ మొత్తాన్ని కలుపుతూ తాత్కాలిక పందిరి ఏర్పాటు చేశారు.
 
శనివారం.. గురువారం భక్తుల రద్దీ
నిత్యం ఆంజనేయస్వామి చుట్టూ ప్రదర్శనల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఉదయం, సాయంత్రం వస్తుంటారు. శనివారం, మంగళవారం స్వామి దర్శనం కోసం రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రదక్షణ చేయడానికి భక్తులు క్యూకట్టాల్సి వస్తుంది. ప్రత్యేక అర్చనలు, విశేష పూజలు ఈ రోజుల్లో నిర్వహిస్తారు. ఇక గురువారం సాయిబాబా దర్శనం కోసం వచ్చే భక్తులతో ఆలయ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోతుంది. గురువారం మధ్యాహ్నం హారతి పూజలో వందలాదిగా భక్తులు పాల్గొంటారు. హారతి తర్వాత అన్నదానం చేస్తారు. అన్నదాన ప్రసాద స్వీకారానికి స్థానికంగా ఉండే వారితోపాటు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయ కమిటీ లెక్కల ప్రకారం వెయ్యి నుంచి 12వందల మంది అన్నదాన ప్రసాదం స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతివారం ఆలయానికి వచ్చే భక్తులలో ఎవరో ఒకరు అన్నదానం కోసం కావాల్సిన సామగ్రిని అందజేస్తున్నారు. వంటలు చేయించే సమయంలేని భక్తులు అన్నదానం కోసం అయ్యే మొత్తం ఖర్చును డబ్బురూపంలో చెల్లిస్తున్నారు. ఎవరూ ముందుకు రాని పక్షంలో ఆలయ కమిటీనే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మొత్తం మీద ప్రతివారం అన్నదానం మాత్రం కచ్ఛితంగా కొనసాగుతుందని కమిటీ ప్రతినిధులు చెప్పారు.
 
వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న సాయిబాబా!
ఆలయంలో ఉన్న దునిలో ఒకసారి పాదాల రూపాలు దర్శనమిచ్చాయి.. ఒకసారి బాబా ముఖరూపం దునిలో దర్శనమిచ్చింది. స్వామి ఇలా తమను కటాక్షిస్తున్నాడని, మనుషులు దూరలేని దునిలో పాదాలు, బాబా ముఖరూపం దర్శనమివ్వడమే ఇందుకు నిదర్శనమని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పలు ఘటనలు తమకు వ్యక్తిగతంగా కలిగాయని పలువురు భక్తులు కూడా చెబుతుంటారు. మొత్తం మీద ఇక్కడ సాయిబాబా ప్రత్యక్షంగా కొలువుదీరారనే నమ్మ కం భక్తుల మనసుల్లో పెనవేసుకుపోయింది.