ఊరికే ఉంచితే ముప్పే!
15-07-2017 00:45:50
మనసు చంచలమైనది. ఏ వ్యాపకమూ లేకపోతే మనసు... మనిషిని మాయ చేస్తుంది. సత్కర్మలు ఆచరిస్తే ఫర్వాలేదు. కానీ, ఊరికే ఉంటే.. మనసు వ్యర్థమైన సంకల్పాలు చేసి... జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుందని చెప్పే కథ ఇది..
పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. పొలాలు, మిల్లులు, ఇతర వ్యాపారాలతో క్షణం తీరిక లేకుండా గడిపేవాడు. ఈ పనులన్నీ ఒక్కడే చూసుకోలేక వ్యాపారికి మనశ్శాంతి కరువైంది. ఇక లాభం లేదనుకొని.. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. ‘స్వామీ! నాకు పనిలో సహాయం చేయడానికి ఒక సహాయకుడు కావాల’ని కోరాడు. అందుకు సరేనన్నాడు బ్రహ్మ. అయితే ‘ఆ సహాయకుడు ఒక రాక్షసుడు. వాడికి నిరంతరం పని చెబుతూనే ఉండాలి. పని లేకపోతే నిన్ను మింగేస్తాడ’ని షరతు పెట్టాడు.
 
ఇరవై నాలుగు గంటలు పని చేసే సేవకుడు దొరికాడని వ్యాపారి సంతోషించాడు. మర్నాడు ఆ రాక్షసుడు వ్యాపారి ఇంటికి వచ్చాడు. వ్యాపారి ఏ పని చెప్పిన అరక్షణంలో ముగించి.. మళ్లీ పని చెప్పమని వేదించసాగాడు. ఆ రాక్షసుడి వేగాన్ని వ్యాపారి తట్టుకోలేపోయాడు. పని చెప్పకపోతే తినేస్తాడు.. చెబుదామంటే అన్ని పనులూ చిటికెలో చేసేస్తున్నాడు. చేసేది లేక బ్రహ్మ దేవుడిని శరణు వేడుకున్నాడు. ‘ఈ పని రాక్షసుడు నా కొద్దు మహాప్రభూ’ అని వేడుకున్నాడు. వ్యాపారి ఆవేదనని అర్థం చేసుకుని రాక్షసుడి నుంచి వ్యాపారికి విముక్తి కలిగించాడు. వ్యాపారి ఊపిరి పీల్చుకున్నాడు.
 
మన మనసు కూడా ఆ రాక్షసుడి వంటిదే. సత్కర్మలను కాదని వ్యసనాలు, ఇతర వ్యాపకాలు దానికి అలవాటు చేశామా! అది మన మాట వినదు. ఎప్పుడూ ఆ పాపకర్మలు చేయమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అవి చేయకపోతే.. మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మనోవ్యాధితో మనిషినే మింగేస్తుంది. అందుకే సత్కర్మలు, దైవారాధన, సత్సంగత్వం వంటివి మనసుకు అలవాటు చేయాలి. అప్పుడే అది మన మాట వింటుంది.