కలలు కన్నవారితోనే లోక కల్యాణం
13-07-2017 23:03:25
చిన్నారి జేమ్స్‌ గదిలోకి తల్లి వెళ్లేటప్పటికి.. కిటికీలో నుంచి పౌర్ణమినాటి నిండు చంద్రుడిని తదేకంగా చూస్తూ కనిపించాడు. ‘పడుకో నాన్నా! ఆలస్యమైంది’ అంది తల్లి. ‘ఒక రోజున నేను చంద్రుని దర్శిస్తాను’ అన్నాడు జేమ్స్‌. 18 ఏళ్ల వయసులో జరిగిన బైక్‌ యాక్సిడెంట్‌లో జేమ్స్‌ దాదాపు చనిపోయి, బతికాడు. అయితే పట్టువదలకుండా వ్యోమగామి అయ్యాడు. ఇంతవరకూ చంద్రునిపై కాలుమోపిన 12 మందిలో ఒకడుగా జేమ్స్‌ ఇర్విన్‌ చరిత్ర పుటలకెక్కాడు.
 
నాటి మెసొపటేమియా అంటే ఇప్పటి ఇరాక్‌ ప్రాంతంలో నివసిస్తున్న అబ్రహాముతో దేవుడు.. ‘నీవు నీ పరివారంతో సహా నేను చూపించే దేశానికి వెళ్లు. అక్కడ నీ జనాంగాన్ని గొప్పగా దీవించి, లోకానికంతటికీ నీ జనాంగాన్ని ఆశీర్వాదంగా చేస్తాను’ అన్నాడు. దేవుడి వాగ్దానాన్ని నమ్మి, ఆ స్వప్నాన్ని గుండెల నిండా నింపుకొని అబ్రహాము తన దేశాన్ని వదిలి.. ఈనాడు ఇజ్రాయిల్‌గా పిలిచే కనాను దేశానికి పరదేశిగా వెళ్లాడు. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరికి దేవుడు అతని కలను సాకారం చేశాడు. అతని జనాంగమే అయినా ఈనాటి యూదులు అత్యంత తెలివైనవారు. ప్రతిభావంతులుగా పేరుపొంది ప్రపంచ గతినే మార్చే ఎన్నో పరికరాలు, వ్యవస్థలను కనుగొన్నారు. ప్రపంచానికి క్షమా సిద్ధాంతాన్ని, ప్రేమ తత్వాన్ని ఆచరించి బోధించిన జగద్రక్షకుడైన యేసుక్రీస్తు కూడా శరీరరీత్యా అబ్రహాముడైన యూదు సంతానమే (ఆది 12:1-9) కలలు కనడం తప్పుకాదు. కాని పగటి కలలు మాత్రం కంటూ, అందులోనే కాలం గడపడం తప్పు. కలల సాకారానికి కఠినమైన క్రమశిక్షణ, ధ్యేయ సాధనా పటిమ అవసరం. అడ్డుగోడలున్నా, అగాధాలున్నా, అవమానాలు ఎదురైనా.. స్వప్న సాకారమే గమ్యంగా అడుగులు ముందుకుపడాలి. తమ స్వప్న సాకారంతో లోక కల్యాణాన్ని సాధించిన మహానీయులంతా నడిచిన బాట ఇది. స్వప్న సాకారానికి ‘షార్ట్‌కట్స్‌’ అంటే దగ్గరి దారులు ఉండవు. అన్నిటికీ తెగించిన వాడి స్వప్నం చెదిరిపోవడమన్న ప్రసక్తే ఉండదు. కాబట్టే మనిషి చంద్రునిపై కాలుబెట్టాడు. ఎన్నో వేల మైళ్ల దూరంలోని వ్యక్తిని చూస్తూ.. అరక్షణంలో ‘కనెక్ట్‌’ అయి మాట్లాడగలుగుతున్నాడు. ఇదంతా కలలుగన్న మేధావులు సాధించి పెట్టినదే!
 
అయితే లోకంలో ఆకలి కేకలు వినబడకుండా అంతా గౌరవంగా న్యాయంగా బతికే వ్యవస్థ కోసం యేసుక్రీస్తు కన్న కలలు మాత్రం ఇంకా సాకారం కాలేదు. ‘నన్ను బలపర్చువానియందే నేను సమస్తం చేయగలను’ అన్న మాటలు చర్చికి, క్రైస్తవానికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు (ఫిలిప్స్‌ 4:13)
 
- సుశీల్‌ సందేశ్‌