కురవాల్సింది జ్ఞానవర్షం!
13-07-2017 23:02:16
సంచుల్‌ పెట్టెల నిండ శాస్త్రముల్‌, విజ్ఞానంబుల్‌ మూల్గుచున్‌
వచింపింపబడె శుష్క హస్తములతో, వాగ్దాన వర్షంబుతో
పంచాంగంబున వర్షపాతమని చెప్పన్‌ నేల దున్నింతుర
పంచాంగంబును పిండుకునుచు దినముల్‌ వ్యర్థంబుగా పుత్తుర
 
పంచాంగంలో ‘కురుస్తుంది వాన’ అని పంచాంగం పిండినట్టుగానే మనం పుస్తకాలు పిండుతున్నాం. అది పారాయణం చేస్తే వానలు కురుస్తాయి. ఇది పారాయణం చేస్తే పంటలు పండుతాయి అంటాం. శాస్త్రీయంగా దాన్ని నిరూపణ చేయలేం. విరాటపర్వం చదివితే కచ్చితంగా వానలు పడతాయి. ఎలా పడతాయి? అందులో లక్షణాలు చెప్పాడు. మనుషులు ఎలా ప్రవర్తిస్తే వానలు పడతాయో చెప్పాడు. విరాటపర్వం మొత్తం మీద అటు వ్యాసభారతంలోగానీ, ఇటు తెలుగు తిక్కనగారి భారతంలో గానీ విరాటపర్వం చదివితే వానలు కురుస్తాయన్న మాట ఎక్కడా పద్య రూపంలో గానీ, గద్యరూపంలో గానీ చెప్పలేదు. మనం పుట్టించుకున్నాం ఆ మాట. సంప్రదాయంలో ఓ నమ్మకం కింద వచ్చింది. నమ్మకం నమ్మకమే! దాన్ని విశేషమైన మహిమ కింద ప్రచారం చేస్తే ప్రజలు మూర్ఖులు అవుతారు.
 
మనుషులు కొన్ని లక్షణాలు కలిగి ఉంటే, ప్రకృతిని ప్రేమిస్తే, పర్యావరణాన్ని కాపాడితే, నీటి పొదుపును పాటిస్తే, పంటలు పండించడంలో అన్ని నియమ నిష్ఠలు ఉంటే కచ్చితంగా వర్షాలు కురుస్తాయి. ఆ లక్షణాలే మహాభారతంలోని విరాటపర్వంలో చెప్పాడు భీష్ముడు దుర్యోధనునికి. అలాంటి లక్షణాలన్నీ ధర్మరాజులో కనిపిస్తాయి. విరాటపర్వం చదివితే ఆ లక్షణాలన్నీ అవగాహన చేసుకుంటామనీ, చేసుకుంటే అన్వయం చేసుకుని పాటిస్తామనీ అలా చెప్పారు.
 
వానలు కురుస్తాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడటానికి కారణమైన మరో పద్యం ఏమిటంటే... కంకుభట్టుగా అజ్ఞాతవాసంలో ఉన్న ధర్మరాజును విరాటరాజు పాచికతో కొడతాడు. అప్పుడు ద్రౌపది అతని నెత్తుటి బొట్టు కింద రాలకుండా చీర కొంగు చించి, కట్టు కడుతుంది. అది చూసి విరాటరాజు ఆశ్చర్యపోతాడు. అప్పటికి ఇంకా పాండవుల అజ్ఞాతవాసం ముగియలేదు. అది బయటపడే ప్రమాదం ఉంది. అప్పుడు ద్రౌపది వెంటనే అంటుంది.
 
‘‘విమల వంశబునను, పుణ్యవృత్తమునను
వరలు నీతని రక్తము వసుమతీశా!
ధరణిపై ఎన్ని బిందువులు దొరలెనో
అన్ని వర్షములు కలుగు ఇంద నా వర్ష భయము’’
 
‘ఇతనిది చాలా నిర్మలమైన వంశ పరంపర. ఇతని ప్రవర్తన చాలా గొప్పది. ఇతని రక్తంలో సత్యం, ధర్మమే ఉన్నాయి. ఇటువంటి మహానుభావుని రక్తం ఎన్ని బిందువులు నేల మీద రాల్తాయో, అన్ని ఏళ్లు వర్షం పడదు. అందుకే నేను నెత్తురు నేల మీద పడకుండా అడ్డుకున్నా. మాకు ఆశ్రయం ఇచ్చిన మీ రాజ్యం బాగుండాలి’ అన్నది ద్రౌపది మాట! విరాటపర్వం జ్ఞానం కోసం చదవాలి. వర్షం కోసం కాదు. విరాటపర్వం చదివితే జ్ఞాన వర్షం కురుస్తుంది.
 
 
 
 
 
 
 
 
 
 
- డా.గరికిపాటి నరసింహారావు