ఆయన కోసం పార్టీ తలుపులు తెరిచే ఉంచాం: మంత్రి
19-06-2017 07:43:44
చెన్నై: పార్టీ విలీనం కోసం దేనికైనా సిద్దమేనని, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కోసం తలుపులు తెరిచే ఉంచామని మంత్రి విజయకుమార్‌ తెలిపారు. ఆదివారం చెన్నై విమానాశ్రయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... ఢిల్లీలో జరుగనున్న జీఎస్టీ బిల్లుకు సంబంధించిన సమావేశంలో హాజరయ్యేందుకు వెళుతున్నానని, రాష్ట్ర ప్రజలు ఈ బిల్లుపై తెలియజేసిన అభిప్రాయాలను కేంద్ర మంత్రులకు తెలియజే స్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వం లోని ప్రభుత్వం వికలాంగులకు ఎన్నో రాయితీలను కల్పించిందని, వారి సంక్షేమార్థం ఎన్నో పథకాలను రూపొందించనున్నట్టు ఆయన వివరించారు. డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు రాష్ట్ర సీఎం కావాలని గత ఐదు నెలలుగా ఎన్నో కుట్రలు పన్నారని, అయితే ఆయన పథకాన్ని అన్నాడీఎంకే ఎన్నడూ ముందుకు రానివ్వదన్నారు. ఆయన సీఎం అయ్యే కల కేవలం పగటి కలగానే ఉంటుందన్నారు. ఇందుకు నిదర్శనం అసెంబ్లీలో ఆయన ప్రవర్తిస్తున్న తీరేనని, ఆయనకు తోడుగా ఆ పార్టీ నేతలు కూడా వ్యవహరిస్తున్నారని, అయితే ఎన్ని కుప్పిగంతులేసినా ప్రయోజనం లేదని, ప్రజలకు వాస్తవాలు తెలుసని జయపై వారికి ఉన్న అభిమానం ఎన్నేళ్ళయినా తరగదన్నారు. ఇరు వర్గాలు విలీనం అయ్యేందుకు సర్వం సిద్దమని ఓపీఎస్‌ కోసం పార్టీ తలుపులు తెరిచే ఉంటామన్నారు. అన్నాడీఎంకేను భూస్థాపితం చేయాలని తప్పుడు వీడియోలను రూపొందించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.