అద్దెగర్భ శోకం.. 48 మంది గర్భిణులు పరిస్థితి అగమ్యగోచరం..
19-06-2017 07:03:17
 వైద్యాధికారులు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శనివారం సాయికిరణ్‌ హాస్పిటల్‌లో తనిఖీలు నిర్వహించి వదిలేశారు. ఇప్పుడు కడుపులో శిశువు ఊపిరి పోసుకుంటున్న సమయంలో పిల్లలు పుట్టేంత వరకూ మహిళల బాధ్యత ఎవరు తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. చట్టవిరుద్ధంగా ఆసుపత్రి వర్గాలతో ఒప్పందం కుదుర్చుకున్న ఆ వ్యక్తులు ఆ మహిళల కడుపులో బిడ్డలను తమ వారసులుగా అంగీకరిస్తారా? అక్కడున్న 48 గర్భిణుల పరిస్థితి అగమ్యగోచరం..
 
హైదరాబాద్‌సిటీ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): అమ్మబొజ్జలో ప్రాణం పోసుకుంటున్న పసిగుడ్డు. ప్రపంచం చూడకుండానే కన్నీటి కష్టాలు చూస్తోంది. మౌనంగా రోదిస్తున్న అమ్మ మనోవేదన వింటోంది. మరోవైపు.. రోజూ కడుపులో కదలాడుతూ బుజ్జిపాదాలతో నాట్యమాడే బిడ్డ బతుకు ఏమౌతుందనే మానసిక సంఘర్షణ లో అమ్మతనం కుమిలిపోతోంది. పేదరికం నుంచి బయటపడి.. కడుపున పుట్టిన బిడ్డలకు మంచి జీవితాన్ని ఇచ్చేందుకు ఆ తల్లులు తమ గర్భం అద్దెకిచ్చారు. కుదుర్చుకున్న కిరాయి పైసలు చేతికందగానే ఇంటికెళ్లి.. బిడ్డలను హత్తుకోవాలని ఆశపడ్డారు. కానీ.. ప్రస్తుతం ఎవరో చేసిన తప్పిదానికి ఈ రెండు జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. భవిష్యత్తుపై నీలినీడలు అలుము కున్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 12లోని సాయికిరణ్‌ ఫెర్టిలిటీ ఆసుపత్రిలో అక్రమంగా జరుగుతున్న అద్దెగర్భాల(సరోగసీ) దందా వెలుగు చూసిన సంగతి తెలిసిందే. సుమారు 48 మంది మహిళలు.. సరోగసీ రాకెట్‌లో చిక్కుకున్నారు. అమ్మతనాన్ని మోస్తూ.. నిర్బంధంలో ఉన్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
 
పేదగర్భంలో.. సంపన్నబిడ్డలు
జన్యుపరమైన ఇబ్బందులు.. జీవనశైలితో వచ్చిన మార్పులు. ఊబకాయం.. థైరాయిడ్‌.. తదితర అనారోగ్య సమస్యలు. చేతినిండా డబ్బున్నా.. ఇంట్లో అల్లరి చేసే పిల్లల్లేరనే బెంగ. ఏళ్లతరబడి వైద్యం చేయించుకుంటున్నా..ప్రయోజనం లేని జీవితం. ఒక వేళ గర్భం ధరిస్తే పురిటి నొప్పులు బాధ భరించలేమనే భయం. వెరసి అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డల.. కోరికను తీర్చేందుకు ఆశపడిన ఖరీదైన తాతా.. నాయనమ్మలు డబ్బులు కుమ్మరించారు. రూ.40లక్షలు.. రూ.50లక్షలు. ఎంతైనా పర్లేదంటూ సరోగసీకు ఓకే చేశారు. ముక్కూ ముఖం తెలియని ఆరోగ్యకరమైన పేదింటి అమ్మగర్భంలో.. తమ వారసులకు ఊపిరి పోసేందుకు సిద్ధపడ్డారు. సాయికిరణ్‌ ఫెర్టిలిటీ ఆసుపత్రిలో అద్దెగర్భంలో పసిగుడ్డులందరూ.. సంపన్న కుటుంబాలకు చెందినవారేనంటూ.. ఓ అధికారి అభిప్రాయపడ్డారు. అక్కడ లభించిన రికార్డుల్లో కొందరు హైదరాబాద్‌కు చెందిన సంపన్న వ్యక్తులూ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏజెంట్ల నుంచి రాబట్టిన వివరాల ప్రకారం నగరంలో ఇటువంటి అనధికార సరోగసీ కేంద్రాలు మరో నాలుగు వరకూ ఉండొచ్చని తెలుస్తోంది.
 
ఒక్కొకరికి రూ.2.5లక్షలు-రూ.3.5లక్షలు
అక్కడున్న గర్భిణులు అక్షరజ్ఞానం లేని పల్లెటూరి నుంచి వచ్చినవారు. చట్టాల గురించి అవగాహన లేనివారు. ఏజెంట్ల మాటలు నమ్మి 9 నెలలు ఉంటే చాలని.. గుడ్డిగా నమ్మి అక్కడకు చేరిన వారు. వీరిలో అధికశాతం ఈశాన్యరాష్ట్రాల నుంచి వచ్చినవారున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన వారు 14-16 మంది ఉంటారని అంచనా. ఈ మహిళలంతా నిరుపేదలు.. వ్యవసాయకూలీలు. ఇప్పటికే ఇద్దరు-ముగ్గురు పిల్లలున్న గృహిణులే అధికం. గ్రామీణ ప్రాంతాల్లో వున్న పేదరికాన్ని అవకాశం చేసుకున్న ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకులు దేశంలోని సరోగసీ ఏజెంట్లకు అద్దెగర్భాల కాంట్రాక్టు అప్పగించారు. సుమారు 20-30 మందికి పైగా ఉన్న ఏజెంట్లు గ్రామాలు, మురికివాడల్లో తిరుగుతూ పేదరికంతో మగ్గుతున్న మహిళలను గుర్తించారు. 9 నెలలు కళ్లు మూసుకుంటే చాలు.. మంచి ఆహారం, దుస్తులు, డబ్బులు ఇస్తామని ఆశచూపారు. ఒక్కొక్కరికి రూ.2.5లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకూ ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. దాన్లో భాగంగానే రూ.లక్ష, లక్షన్నర చేతికిచ్చారు. వాటి నుంచి కూడా ఏజెంట్లు 10-15 శాతం కమీషన్‌ పుచ్చుకున్నారు. ఈ మహిళలను ఇక్కడకు తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయారు. వీరిలో 30 మంది వరకూ 7-8 నెలల గర్భవతులున్నారు. కొందరు 3-4 నెలల వారున్నారు. వీరికి ప్రతిరోజూ వైద్యపరీక్షలు, శిశువు ఆరోగ్యంగా పెరిగేందుకుపోషకాహార నిపుణుల సూచనలతో సప్లిమెంట్స్‌, ఇతర పోషకాలు, మందులు అందిస్తూ వస్తున్నారు.

ఇప్పుడేం చేద్దాం..
తాంబూలాలిచ్చాం .. తన్నుకు చావండీ అన్నట్లు వైద్యాధికారులు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించి వదిలేశారు. అక్కడున్న 48 మహిళల పరిస్థితిని అగమ్య గోచరంగా మార్చారు. అంతా సజావుగా సాగినట్లయితే కొద్దినెలల్లో భూమ్మీడ పడిన శిశు వును అగ్రిమెంట్‌ కుదుర్చుకున్న కుటుంబాలకు అప్పగించి ఆ మహిళలు వెళ్లిపో యేవారే. కానీ. కడుపులో శిశువు ఊపిరి పోసుకుంటున్న సమయంలో పిల్లలు పుట్టేంత వరకూ మహిళల బాధ్యత ఎవరు తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. చట్టవిరుద్ధంగా ఆసుపత్రి వర్గాలతో ఒప్పందం కుదుర్చుకున్న ఆ వ్యక్తులు ఆ మహిళల కడుపులో బిడ్డలను తమ వార సులుగా అంగీకరిస్తారా! అనేది అధికారుల్లోనూ గుబులు రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఉన్న నిరుపేద మహిళలు మరో శిశువును పోషించగలరా! అద్దెగర్భంలో పెరుగు తున్న ఆ బిడ్డల పరిస్థితి ఏంటనేది.. టాస్క్‌ ఫోర్స్‌, పోలీసు అధికారులు ఇచ్చే నివేదిక మీదనే ఆధారపడినట్లు సమాచారం.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.