మరణం ఈ రూపంలో కూడా వస్తుందని ఎవరూ ఊహించలేరేమో..!
19-06-2017 06:53:18
కుక్క గొలుసుకు షాక్‌ తగిలి..యువకుడి మృతి
హైదరాబాద్/మదీన: చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. పెంపుడుకుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లిన ఓ యువకుడు.. అనుకోకుండా దాని గొలుసు వల్ల విద్యుదాఘాతం తగిలి మరణించాడు. ఈ ఘటన పాతబస్తీలో జరిగింది. కబూతర్‌ఖానా చిన్నబజార్‌కు చెందిన పి.రవీందర్‌ కుమారుడు రేవంత్‌ (19) ఇంటర్‌ చదువుతున్నాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో భోజనం చేసిన తర్వాత తమ పెంపుడు కుక్కను వాకింగ్‌ కోసమని బయటకు తీసుకెళ్లాడు. కుక్క మెడలో ఉన్న ఇనుప గొలుసు.. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభానికి తగిలింది. అప్పటికే ఆ స్తంభానికి విద్యుత్‌ ప్రసారం అవుతోంది. దాంతో గొలుసు పట్టుకుని ఉన్న రేవంత్‌.. విద్యుదాఘాతంతో కింద పడిపోయాడు. ఆ సమయానికి జనసంచారం పెద్దగా లేదు. దాంతో పది నిమిషాల తర్వాత స్థానికులు చూసి అతడి కుటుంబసభ్యులకు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే రేవంత్‌ మరణించినట్లు వైద్యులు తెలిపారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ కుమారుడు మృత్యువాత పడ్డాడని మృతుని తండ్రి విలపించారు. ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే అహ్మద్‌పాషా ఖాద్రి, వివిధ పార్టీల నాయకులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యుత్‌ స్తంభానికి షాక్‌ వస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమని ఎమ్మెల్యే అహ్మద్‌ పాషా ఖాద్రి అన్నారు. ప్రభుత్వం బాధితుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.