గంజాయి స్మగ్లర్‌పై పీడీయాక్ట్‌
19-06-2017 06:37:01
ధూల్‌పేట్‌లో గంజాయి కట్టడికి ప్రత్యేక చర్యలు
హైదరాబాద్‌సిటీ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ధూల్‌పేట్‌లో మాదకద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ధూల్‌పేట్‌ అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటిండెంట్‌ ఎన్‌.అంజిరెడ్డి తెలిపారు. సారా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాక గంజాయిను ఎంచుకున్న స్మగ్లర్లపై పీడీయాక్ట్‌ ప్రయోగించనున్నట్లు స్పష్టంచేశారు. జుమ్మేరాత్‌బజార్‌కు చెందిన గంజాయి స్మగ్లర్‌ ముకేష్‌సింగ్‌(26)పై పీడీ యాక్ట్‌ ప్రయోగించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ఆదేశాలతో ఆదివారం ముఖేష్‌సింగ్‌ను పీడీయాక్ట్‌ కింద అరెస్ట్‌ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించామన్నారు. ఏడు నెలల వ్యవధిలో మూడు సార్లు గంజాయి రవాణా చేస్తూ అతడు పట్టుబడినట్లు తెలిపారు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌సబర్వాల్‌ ఆదేశాలతో ఎక్సైజ్‌శాఖ డీసీ సి.వివేకానందరెడ్డి, సూపరింటిండెంట్‌ బి.జ్యోతికిరణ్‌ పర్యవేక్షణలో ధూల్‌పేట తదితర ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి మత్తుపదార్థాల సరఫరాను పూర్తిగా కట్టడి చేయనున్నట్లు అంజిరెడ్డి వివరించారు.